ఊరి మధ్యన మూడు వీధుల కూడలి బొడ్రాయి. దానికి కొద్ది దూరంలో జెండా దిమ్మె. దసరా పండుగ రోజున జెండా ఎగురవేసేది. ఇంకో పక్కన పీర్లకొట్టం. తాతల నాటి రావి చెట్టు. దాని నీడ విశాలంగా పర్చుకుంటుంది. రోజుల్లో ఎక్కువ భాగం జెండా అరుగును కప్పి ఉంచుతుంది నీడ. ఈ జెండా అరుగునే రచ్చ బండగా ఊపయోగించుకోవడానికి, చాలా మంది కూర్చోవడానికి వీలుగా విశాలంగా, చదరంగా కట్టుకున్నారు పెద్దమనుషులు.ఉదయం సుమారు ఎనిమిది గంటల సమయం. వేపపుల్లతో పళ్ళు తోముకుంటూ వచ్చే, పోయే వాళ్ళని పలకరిస్తున్నాడు రంగయ్య. జేబులో మోగుతున్న సెల్‌ఫోనుని తీసి ఆకుపచ్చ బటన్ ఒత్తి ''హల్లో ఎవ్వరు మాట్లాడేది'' అన్నాడు. ఇరవైఐదుకు పైన అయితేనే బేరం. అంతకన్నా తక్కువయితే మాట్లాడేది లేదు. ''హలో.. హలో.. సిగల్ పోయినట్లుంది'' అంటూ అంగీ జెబులోకి దూర్చేశాడు సెల్‌ఫోనుని. ఈ పెద్ద మనిషికి అనుచరులు ఆశయ్య, ఊశయ్య, మైసయ్య ఉన్నారు. కరెంటు లైన్‌మేన్ మల్లయ్య కూడా ఉన్నాడు. ఉబుసుపోక మాటలకు కూడుతుంటారు వీళ్ళందరూ.
'నాకు నాలుగు కోట్లు వస్తన్నట్టున్నాయిరా' అన్నాడు రంగయ్య.
'రూపాయలా అమ్మో! సాలనే. ఎక్కడికెెళ్లి వస్తుంది' ఈ వొరద 'ఆశయ్య' నోరెళ్ళ బెట్టాడు.
'నా గుట్టల్ల సెలక లేదురా ఆ ఇరవై ఎకరాలకు. ఇప్పుడే ఫోనురాలే అందుకే. ఎకరం ఇరవై లక్షలకు అడుగుతున్నారు. ఇరవై ఎకరాలకు నాల్గు కోట్లు రావు మరి.
'ఇరవై ఇరవైలు నాల్గొందల లక్షలు.. అంటే నాలుగుకోట్లు అయితయి'.
''నాలుగుకోట్లు అంటే మస్తు పైసలు కదా? ఏం చేయాల్నో సోంచాయిస్తలేదురా''
'మల్లయ్యా! మరి ఈ నన్నూరు లక్షలు నేనేంజేసుకోను!'
'నీకు ముగ్గురు కొడుకులు ఆరుగురు బిడ్డలు. పట్నంల హైదరాబాదుల తలా ఓ ఇల్లు కొనియ్యి. ఇండ్లో, ఆపార్టుమెంట్లో గాని ముప్పై నలభై లక్షలున్నాయంట. నీ కొచ్చే డబ్బు ఆడికాడికి సరిపోతది. ఏం మిగలవ్'.
'పెద్ద బిడ్డకు కట్నమింకా పురాగ ఇయ్యలేదంటగా!' ఆశయ్య గుర్తు చేశాడు.
'ఏV్‌ా, తర్వాత మస్తుగ ఇచ్చాన్రా. అందరికీ మస్తుగ ఇచ్చిన. ఎవ్వరికీ ఏమిచ్చేది లేదు'
'నడిపి కొడుకు నష్టాల్లో ఉన్నాడుగా. పాపం ముగ్గురూ ఆడపిల్లలే. ఆళ్ళ పెళ్ళిండ్లు సెయ్యాలగా? ఆయనకు ఇన్నియ్యరాదు'
'ఆడికి ఎంతిచ్చినా దండగే. నా పేరు ఖరాబు జేస్తుండు. తరతరాల దాకా నా పేరు గుర్తుండేట్టుగా ఏదైనా చెయ్యాలనుందిరా!'
'మనూళ్ళో సరైన బడి వసతి లేదు. గదులు సాలక సెట్ల కింద పాఠాలు సెప్తుండ్రు పంతుళ్ళు. గదులు కట్టియ్యరాదు. నీ పేరుంటది' మరొకరు.
'మనూరోళ్ళంతా బద్మాషోళ్ళు ఎంత జేసినా దండుగే. నా పేరు కొట్టేస్తరు'
'అట్లా అయితే పక్కఊరి గుట్టల్ల పెద్దగుడి కడ్తున్నాడంట పట్నం నుంచి వచ్చిన పెద్ద స్వామి. కార్లల్ల, బస్సుల్ల మంది వొచ్చి పోతున్నరంట. గుడి సుట్టూ పూల తోటంట. వంటశాల, స్నానాల గుండాలు, దిక్కులేనోళ్ళకు, ముసలోళ్లకు అశ్రమమంట. అవ్వన్నీ కట్టడానికి బోలెడు డబ్బుగావాల్నంట. ఎవ్వరు ఏది కట్టిస్తే దానికి ఆళ్ళపేరు పెడ్తరంట. నీ పేరు ప్రఖ్యాతం కావడానికి అక్కడ పెట్టుబడి పెటు'్ట అంతకు మునుపే వచ్చి వీరి సంభాషణా సారాంశమంతా అర్థం జేసుకున్న పూజారి రామయ్య సలహా ఇచ్చాడు.
'అయితే నేనో కోటి రూపాయలిస్తాను. నా పేరు మీద ఏం కడ్తారో కనుక్కో పంతులు'
''అట్లానే. వచ్చేవారం ఆలయం సంస్థాపన వార్షికోత్సవాలున్నాయి. నాతోరా. ఆలయ సంస్థాపకుడు అయిన పెద్ద స్వామిని పరిచయం చేస్తా. ఆ ఉత్సవాల్లో వేదిక మీద ప్రకటిస్తే నీకు పెద్ద పేరొస్తది. పేపర్ల వస్తది'
'తగాదాల్లో ఉన్న ఈయన భూమికి ఇంకా బేరమే కుదరలేదు. డబ్బు రానేలేదు. అప్పుడే ఇచ్చేస్తున్నాడేంది' మల్లయ్యది స్వగతం. ఆశయ్య, ఊశయ్య నోరెళ్ళబెట్టారు. మైసయ్యకు అంతా మాయగా ఉంది.
'నాకు నాలుగు కోట్లు వస్తన్నయి. కోటి రూపాయలు గుడికిస్తా. ఇంకా మూడుకోట్లు ఉంటయి. ఏం చేయాలే?' ఎదురైన వాళ్ళకళ్లా, ఫోన్ చేసిన వాళ్ళకళ్లా చెప్తూనే ఉన్నాడు సలహాలు అడుగుతూనే ఉన్నాడు రంగయ్య.
ఈయనకెన్ని డబ్బు లొస్తున్నాయో, తానెంత ధనవంతుడవుతుడో తెలపడం కోసమే ఈ అట్టహాసమంతా. మంది సొమ్ముకు ఆశపడేవాడు దానం చేస్తాడంటే ఉన్న ఊళ్ళో ఎవ్వరూ నమ్మరు.
***
చంద్రం రంగయ్య మొదటి సంతానం. భార్యా పిల్లలతో పట్నంలో ఉంటున్నాడు. ఊరి పక్కన ఉన్న పొట్టి గుట్టంత డబ్బు వచ్చినా తృప్తిచెందడు అని అతడి గురించి తెలిసి వాళ్లంతా అంటుంటారు. భూమినమ్మే వార్త అతనికి చేరనే చేరింది. తండ్రి డాంబికాలు బాగా ఎరిగిన వాడే. భూములకు బూమొచ్చింది కాబట్టి ఉత్త మాటలు అనుకోలేక పోయాడు. ఆరా తీసి నిజమేనని నిర్ధారణ చేసుకున్నాడు. ఆ వొచ్చే డబ్బు తమ్ముళ్ళకు చెల్లెళ్లకు చెందనీయకుండా తానొక్కడే పొందాలని పథకం వేశాడు. అక్కలకిస్తాడని చెల్లెళ్లకి, చెల్లెళ్లకిస్తాడని అక్కలకు నమ్మబలికాడు. అట్లా ఆరుగురు చెల్లెళ్లకు ఒకరి మీద ఒకరికి, ఇద్దరు తమ్ముళ్లకు ఒకరిమీద ఒకరికి అనుమానం కలిగేట్లు చేసి మనస్పర్ధలను సృష్టించాడు. బేధాభిప్రాయాలొచ్చి తండ్రితో దూరంగా ఉంటున్న తాను అట్లా ఉంటే నష్టపోతానని తండ్రితో సన్నిహితం కావడానికి పావులు కదిపాడు. కారు డ్రైవరుతో స్కాబ్ విస్కీఫుల్ బాటిల్ పంపాడు. కోడలు మసాల దట్టించిన కోడి మాంసపు వేపుడు టిఫిన్ డబ్బానిండా పెట్టి పంపింది. ఆ మందుతాగి, కోడి వేపుడు తిని పెద్దోడికి తానంటే ప్రేమే అనుకున్నాడు. కోడలు పెద్దింట్ల పుట్టింది. కమ్మగా వండుతది. ఆమె సేతి వంటరుచి ఎవ్వరికీ అబ్బదు అనుకున్నాడు. పెద్దింటి నుంచి వచ్చిన కోడలికిచ్చే గౌరవం కూతుళ్ళకీయడు. రైతు కుటుంబాల నుంచి వచ్చిన చిన్నకోడళ్ళ పట్ల కూడా చిన్నచూపే.
***
రంగయ్య భూమికి బేరం కుదిరింది. ఇరవై ఎకరాలు. ఎకరం ఇరవై లక్షలు. అరవై లక్షలు చెల్లించి మిగతా పైకానికి వాయిదా పెట్టి ఒప్పందం రాసుకున్నారు.
''నాన్నా ఫ్యాక్టరీ పెడదామనుకుంటున్న. సీజన్ బట్టి వ్యాపారం జేస్కుంటూ నెట్టు కొస్తున్నాగానీ నాకింత వరకూ స్థిరత్వం లేదు. ఫ్యాక్టరీకి నీ పేరే పెడతా. బ్యాంకు అప్పిస్తది. కానీ మార్జిన్ మనీకి బ్యాంకు ఖాతాలో నిల్వ ఉండాలే. లోను రాగానే నీ డబ్బు నీకు పువ్వుల్ల పెట్టిస్తా. నీ డబ్బు నాకేమీ వద్దు. ఫ్యాక్టరీ సక్సెస్ అయితే లాభాలు మస్తుగొస్తయి. నీ డబ్బు మీద నాకేమీ ఆశలేదు'' అంటూ చంద్రం తండ్రికి మస్కాకొట్టాడు.
పెద్దోడు బుద్ధిమంతుడు. పైస ఇస్తే రూపాయి జేస్తడు. ఆడు కంపెనీ పెట్టుకుంటే తనకూ పెద్దపేరు వస్తది. తన ప్రతిష్ట పెరుగుతది. వచ్చే డబ్బు పెద్దోడికిస్తేనే సార్థకం అని తనను తాను సముదాయించుకున్నాడు. సమర్థించుకున్నాడు. కొడుకు ఫ్యాక్టరీ అయితే పెట్టాడు. కానీ తండ్రి పేరు పెట్టలేదు. భార్యపేరు పెట్టాడు.
'కంపెనీకి నా పేరు పెడ్తానని డబ్బులు తీసుకుని కోడలి పేరు పెట్టినవేందిరా' అని కొడుకుని నిలదీశాడు.
నీ పేరు పెడితే ''ఫ్యాక్టరీ మా నాయనది అని తమ్ముళ్ళు భాగాలకు వొస్తరు తేరగా. డబ్బుమీద ఆళ్ళకు ఆశెక్కువ. ఫ్యాక్టరీ మా నాయనది ఉమ్మడి ఆస్తి అని వాటా కోసం కోర్టుల కేసు పెడ్తరు'' అని సమాధానమిచ్చాడు చంద్రం.
***
గాలి బుగ్గ గాలెక్కువై పగిలిపోయింది. భూమి బూం డామ్మంది. రంగయ్య భూమికి బయానా ఇచ్చిన వాళ్ళు వాయిదా చెల్లించ లేక ముఖం చాటేశారు. ఒప్పందం రద్దు చేస్తే అంత ధరతో మళ్ళీ కొనేవాళ్ళులేరు. రంగయ్య ఒప్పందం రద్దు పర్చకుండా వారికి మరో వాయిదా ఇచ్చాడు.
వచ్చిన డబ్బుమొత్తం పెద్దన్నే ఎత్తుకు పోయాడని ఆ డబ్బుతోనే ఫ్యాక్టరీ పెట్టాడని రంగయ్య సంతానం అందరికీ తెలిసిపోయింది. ఇంకా డబ్బు వచ్చే అవకాశం లేదని గ్రహించి ''ఆడొక్కడే పుట్టాడా. మేం పుట్టలేదా. మాకెందుకు ఇయ్యవు'' అని గొడవ మొదలు పెట్టారు.
'ఇంకా పైసలు వొచ్చేది ఉంది. మీ అందరికీ ఇస్తాలే' అని సర్ది చెప్పబోయిన తండ్రికి 'అవ్వొస్తయి. నువ్విస్తవ్. మేం జూస్తం. వొస్తే గిస్తే పెద్దోడే నిన్ను మాయజేసి గుంజుకుపోతడు. నీకంత ఇయ్యాలని ఉంటే అన్న దగ్గర వసూలు జేసి తలా ఇన్ని ఇయ్యి' ఏక కంఠంతో అన్నారు కొడుకులూ కూతుళ్ళు.
'ఆడిస్తలేడు. కంపెనీకి లాభాలొస్తే ఇస్తడంట!' 'లాభాలొస్తున్నాయని ఆయనెప్పుడూ చెప్పడు. వొస్తే కంపెనీని పెద్దగ జేస్తానంటడు. ఇంకోటి పెడ్తానంటడు. ఇంకిన్ని డబ్బులు కావాల్నంటడే కానీ ఇచ్చుడు ఉండదు. ఇట్ల ఎన్నిసార్లు కాలే. నువ్వింతే. పెద్దోడికే ఇయ్య బుద్ధయితది' నిష్టూరమాడి పోయారు.
చిన్న కోడళ్ళిద్దరూ వండి పెట్టేది బందు పెడ్తామన్నారు. కూతుళ్ళు కూడా అంతే చేప్పారు. సంగతి తెలిసిన చంద్రం ఫుల్ బాటిల్ విస్కీ, చికెన్ ముక్కలు పంపించాడు. తిని, తాగి రంగయ్య నిశ్చింతగా పడుకున్నాడు.
***
రావి చెట్టు నీడన జెండా అరుగు మీద రంగయ్య అనుచరులతో ''నిన్న నా కొడుకులు, బిడ్డలు గొడవ జేసిండ్రు. నాకెవ్వరూ వండి పెట్టమంటున్నారు'' అని చెప్పుకున్నాడు.
''గంత డబ్బు ఒక్కడికి ఎట్లిస్తవ్. పిల్లలందర్నీ సమంగా సూడాలిగా. గొడవ జెయ్యరా మరి' పెద్ద మనిషివి. ఈడ కూసొని నలుగురికి న్యాయం సెప్పెటోడివి. నువ్వే న్యాయంగ లేకపోతే ఎట్ల? నీ మాట ఎవ్వరింటరు? డబ్బంతా ఒక్కడికి, అదీ మంచి స్థితిలో ఉన్నోడికి ఎట్లిస్తవ్?'
'తీసుకున్న దాంట్ల కెళ్ళి తన భాగం ఉంచుకొని మిగిలిన డబ్బంతా తిరిగి ఇయ్యమను పెద్దాయన్ని. అందరికీ పంచి తప్పు దిద్దుకుంటే సరి అయితది'
తలా ఒకరు జేసిన ఈ వ్యాఖ్యలు రంగయ్యకు రుచించలేదు.
''ధూ నేను పోసిన మందు తాగుతరు. నాకు తగ్గట్లు మాట్లాడరు. డబ్బు తెచ్చి తలా ఇన్ని ఇస్తే ఏమైతదిరా. దిన వెచ్చాలకు, బండ్లకు, స్కూలు ఫీజులకు ఖర్చుపెట్టుకుంటరు. రెండోడు బిడ్డకు కట్నమిచ్చి పెళ్ళిజేస్తడు. అందరూ ఖర్చు పెట్టేటోళ్లే. అందుకని పెద్దోడికిచ్చిన. ఆడు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ పెడ్తనంటే ఇచ్చిన. నా కొడుకు ఒక్కడు పెట్టుబడిదారుడైండా? లేదా? కంపెనీకి యజమాని అయ్యిండా లేదా. ఆ యజమానికి నేను తండ్రినా కానా?
కరెంటు మల్లయ్యకు చిరాకెత్తింది. ''ఈ ముసలోడు తిక్కలోడే. ఒక్కణ్ని పెట్టుబడిదారుడిని చేయడానికి మిగతా కొడుకులను బిచ్చపోళ్ళను చేస్తుండు. కంపెనీ యజమానికి తండ్రినని మురిసిపోతుండు. బిచ్చపోళ్ళకు, దరిద్రులకు తండ్రవుతున్న సంగతి మరుగున పెడ్తుండు'' అని అందామనుకున్నాడు. కానీ అనలేకపోయాడు. ఈ తిక్క సెంటిమెంటుని కనిపెట్టిన పెద్దోడు ఉపాయంతో మొత్తం గుంజుతుండు అని భావించాడు.
***
'పెద్దమనిషి పట్నం వెళ్ళి వొచ్చిండు. రెండు రోజులైంది. జెండా కాడికి వొస్తలేడు. బయటిక్కూడా వస్తలేదంట. కనుక్కుందాం పాండ్రి' అంటూ రంగయ్యతో ఉండే ఉబుసుపోక పార్టీ అతడింటికి వెళ్ళింది. రంగయ్య ముఖంలో ముందటి హుశారు లేదు, డాంబికం లేదు.
'ఏంది పెద్దమనిషి! అట్ల కూసున్నవ్. ఏదో పరేషాన్ల ఉన్నట్లున్నవ్' ఊశయ్య కదిపాడు.
'ఏం జెప్పుకోనురా! మళ్ళా ఎవ్వడో వొచ్చి భూమి కొంటానని ఆశ పెడితే ఇచ్చిన పైకం మందం మొదట బేరం జేసుకున్నాళ్ళకు మూడెకరాలు పట్టా జేసి రాసిచ్చిన కాగితాలు వాపసు తీసుకుంటిని. కొంటానన్న కొత్త పార్టీ రాలేదు. ఇంక భూమి ఎవ్వరూ కొనరు. నాకాడ పైసలు అయిపోయినై. గుంజడానికి ఏమీ లేదని ఉల్టాఖర్చని పెద్దోడు ఇంట్లకెళ్ళి ఎళ్ళగొట్టె. మొత్తం అన్నకే ఇస్తవా అని సిన్నోడు, నడిపోడు కొట్లాడిరి. కోడళ్ళు వండి పెట్టమనిరి. బిడ్డలు అలిగి పోయిరి. ఇంత బతుకు బతికి, ఇంతమంది కొడుకులు, బిడ్డలు ఉండి ఏం లాభం? వండి పెట్టే దిక్కులేదు. మా ముసలామె బతికుంటే నాకీగతి రాకపోనేమో' విచారం వ్యక్తం చేశాడు రంగయ్య.
''ఆమే ఉంటే నీకీ స్థితి రాకపోవును. డబ్బంతా ఒక్కడికే ఇయ్యనిచ్చేది కాదు. సంతానం అందరికీ ఇప్పించేది. నువ్వింత పెత్తనం జేస్తy.్ బీదా బిక్కీకి పంచాయితీలు సెప్తవ్. నీ విషయంలో ఎందుకు ఆలోచన సెయ్యలేదు. పెద్దాయన మాటలు నమ్మి నీ కడుపున పుట్టిన నీ సిన్న కొడుకుల్ని ఆగమాగం జేస్తివి. అన్నా తమ్ముళ్ళు పాలోళ్ళు అవుతారేమో. నీకు నీ సిన్న కొడుకుల్ని పాలోళ్ళను జేస్తివి. ఆళ్ళని ఆగం జేస్తివి. ఇప్పుడు నువ్వు ఆగమైనవ్'' కరెంటు మల్లయ్య గట్టిగానే అన్నాడు.
ఎవ్వరు ఎంత చెప్పినా తాను చేసింది పొరపాటు అనుకోడు. సరి దిద్దుకోడు. ఒక శ్రీమంతుడికి తాను తండ్రిని అని గర్వంగా ఊహించుకుంటాడు. మరో ఇద్దరు పేద కొడుకులకు తండ్రిని అనుకోడు. అత్తెసరు బతుకులు వెళ్ళదీస్తున్న ఆర్గురు కూతుళ్లకు మెరుగైన స్థితికి సాయం చేసింది లేదు.
ఇంటిపని, వంటపని చేసిపెట్టడానికి ఓ ఆడమనిషిని పెట్టుకుని రంగయ్య కాలం గడుపుతున్నాడు.
రంగయ్య జేబులో సెల్‌ఫోన్ మోగింది. తీసి మాట్లాడాడు. బ్రోకర్ మాట్లాడాడు. 'నాకు నాలుగు కోట్లు వస్తయి కొడుకులకు, బిడ్డలకు ఎవ్వరికీ ఇయ్యను. ప్రకటన చేశాడు' అతడు.
'అట్లా మాట్లాడకు. నీ సిన్న కొడుకులకన్నా కొంచెం ఈయి. న్యాయం జేసినట్లయితది' ఆశయ్య నచ్చ చెప్పబోయాడు. జేబులో సెల్ మళ్ళీ మోగింది. మాట్లాడి జేబులో పెట్టేశాడు.
'నా మనవడు, పెద్దోడి కొడుకు అమెరికా పోతుండంట. ఆడనే పెద్ద సదువులు సదివి కొలువు కూడా అమెరికాలోనే జేస్తడంట. రేపు దావతంట. నన్ను రమ్మంటుండు. అన్నీ నేనే దగ్గరుండి సూస్కోవాలని ఫోను జేసిండు చంద్రం'
'పోతావా మరి' సందిగ్దంగా అన్నాడు ఊశయ్య. 'నా మనవడు అమెరికాల సదివి ఆడనే కొలువు జేస్తే గొప్పే కదా. సిన్నోళ్ళ కొడుకులు ఊరి బళ్ళనే సదవబెట్టిరి. ఖదరు తక్కువ. ఆ కార్యానికి పోకపోతే ఎట్లా పొంగి పోయాడు రంగయ్య.
'ఈ మనిషికి బుద్ధిరాదు. భూమికి బేరాలొస్తున్నాయి. మళ్ళా గుంజడానికి పెద్దోడు ఎరవేస్తున్నాడు. రేపటి విందు ఖర్చు ఈయనతోనే పెట్టిస్తడు. ఈయనకు అదే ఖుషీ' కరెంటు మల్లయ్య తనలో తాను గొణుక్కున్నాడు.