ఆరాధ్య చిత్రం

''ఎప్పుడొచ్చావ్‌, సుధీర్‌? నేనిక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది?'' అడిగాడు ఆనంద్‌.

''వైజాగ్‌లో మీ ఇంటికి వెళ్లాను. నువ్వు విజయవాడ వచ్చావని చెప్పి నీ పేరెంట్స్‌ నీ ఎడ్రస్‌ ఇచ్చారు. నేను, నా పేరెంట్స్‌ ఈ ఉదయం సత్యన్నారాయణపురంలో మా పెదనాన్న గారింటికి వచ్చాం. గవర్నర్‌పేటలో ఈ సాయంకాలం నేను ఒక అమ్మాయిని చూడాలి''

''అంటే, పెళ్లిచూపులన్నమాట'' అన్నాడు ఆనంద్‌ నవ్వుతూ.

సుధీర్‌ కూడా నవ్వుతూ, ''ఉన్నమాటే. ఇక్కడ నువ్వు ఉద్యోగంలో చేరడానికి వచ్చావని మీ పేరెంట్స్‌ చెప్పారు. ఆ వివరాలు చెప్పు'' అన్నాడు.

''నాకిక్కడ ఆంధ్రబ్యాంకులో ఎకౌంటెంటుగా డైరెక్ట్‌ రిక్రూట్‌మెంటులో ఎపాయింట్‌మెంట్‌ వచ్చి ఒక నెలైంది. ప్రస్తుతం వైజాగ్‌లో నా తమ్ముడి చదువు గురించి నా పేరెంట్స్‌ అక్కడే ఉంటున్నారు''

''అన్నట్టు, నీ చిత్ర లేఖనం హాబీని కంటిన్యూ చేస్తున్నావా? మనం వాల్టేర్‌లో యూనివర్శిటీ కాలేజీలో కల్సిచదువుతున్న రోజుల్లో ఒకసారి అయిదు నిమిషాల్లో నా రూపాన్ని ఫొటో తీసినంత బాగా గీశావ్‌. దాన్ని ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను'' అన్నాడు సుధీర్‌.

''నా చిత్రకళను నువ్వు గుర్తుంచుకున్నందుకు థ్యాంక్స్‌. ఒక లలిత కళలో కొంతసాధించిన ఏ కళాకారుడు దాన్ని తన జీవితంలో ఎన్నడూ వదిలిపెట్టలేడు. లలిత కళల్లో ఉండే ఆకర్షణ అటువంటిది. అదే వాటి ప్రత్యేకత''

''యు ఆర్‌ రైట్‌. ఈ మధ్య చిత్రాలేమైనా గీశావా?''

''ఒకవారం కిందట ఆంధ్ర చిత్రకళాసమితివారు ఇక్కడ నిర్వహించిన పోటీలో నేను గీసిన 'సూర్యోదయం' చిత్రానికి ఒక వెండి కప్పు ఫస్ట్‌ప్రైజ్‌గా వచ్చింది. ఆ షెల్ఫ్‌లో ఉన్న కప్పు అదే''

''కంగ్రాచ్యులేషన్స్‌. ఇంకా విశేషాలున్నాయా?''

''నేను గీసిన ఒక ముఖ్యమైన చిత్రం ఉంది. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కనుక నీకు మాత్రం చూపెడ్తాను'' అని ఆనంద్‌ అతణ్ణి తన బెడ్‌రూంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆనంద్‌ బెడ్‌కు ఎదురుగా గోడకు అమర్చిన ఒక అందాల యువతి చిత్రం ఉంది. దానిని చూడగానే సుధీర్‌ కళ్లు చెదిరినట్లయింది. ఆశ్చర్యంగా ఆసక్తిగా ''ఈమె నీ ఊహాసుందరా? నిజంగా ఉన్న సుందరా?''

అడిగాడు సుధీర్‌.

''నిజంగా ఉన్న సుందరే''

''ఆమె ఎవరు? ఎక్కడ ఉంటుంది? ఈ అతిలోకసుందరి చిత్రాన్ని నువ్వు కేవలం ఒక కళాకారుడుగా గీశావా, లేక ఆమె మీదకు నీ మనసు మళ్లిందా?''

''కిందటి వారంలో జరిగిన పోటీలో నా చిత్రానికి ఫస్టు ప్రైజ్‌ ఇచ్చిన వ్యక్తి కూతురు ఈ సుందరి. అప్పుడు ఆయన పక్కనే నిలబడి ఉంది''

''సరే. ఆయనెవరు?''

''గవర్నర్‌పేటలో ఒక కాలేజీకి ప్రిన్సిపాలట. ఆయన్ను చీఫ్‌గెస్టుగా ఆహ్వానించి ఆయనతో విజేతలకు బహుమతులు ఇప్పించారు. ఆయన కూతురిని చూసిన క్షణంలోనే ఆమె రూపం నా మనసులో ముద్ర వేసుకుంది''

''అంటే నీది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌''

''ఆ రోజు ఇంటికి వచ్చిన వెంటనే నా మనసులో భద్రపరుచుకున్న ఆమె రూపాన్ని ఈ చిత్రంగా మలిచాను. అప్పుడు నాకు వచ్చిన బహుమతికంటే ఆమె సుందరరూపం నాకెక్కువ సంతోషం, తృప్తి కలిగించింది. ఎప్పటికైనా నేను ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. లేదా...''

''బ్రహ్మచారిగా ఉండిపోతానంటావ్‌. అంతేగా?''

''అంతే. ఇది నాకు ఆరాధ్యచిత్రం. ఉదయం నిద్రలేచి కళ్లు తెరిచినప్పుడు, మళ్లీ రాత్రి నిద్రలోకి జారుకునేముందు ఆమె చిత్రాన్ని చూసి ఆనందిస్తాను''

''అంతా బాగానే ఉంది. ఆమెను వివాహం చేసుకోవడానికి ఎలా ప్రొసీడ్‌ అవుదామనుకుంటున్నావు?''

ఆమె ఇంటి ఎడ్రస్‌ కనుక్కున్నావా?''

''కనుక్కోలేదు. ఆమెను చూసిన క్షణం నుంచి ఆమె రూపంతో నా మనసంతా నిండిపోయి, నాకు ఏ ఇతర ఆలోచనా రాలేదు''

''నువ్వు ఏ ప్రయత్నమూ చెయ్యకుండా నీ ప్రేయసి చిత్రాన్ని ప్రతిరోజూ పొద్దున, రాత్రి చూస్తూ ఇలాగే ఉంటే ఇంతలో ఎవరో వచ్చి ఆమె మెడలో మూడు ముళ్లు వేసి ఎగరేసుకుపోతాడు. నువ్వు బ్రహ్మకొడుకులా బ్రహ్మచారిగానే ఉంటావు''

''అయితే నేనంతదూరం ఆలోచించలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి?''

''వెంటనే ఆంధ్రచిత్రకళా సమితి సెక్రటరీని కలుసుకుని ఆ ప్రిన్సిపాల్‌ ఎడ్రస్‌ కనుక్కో''

''సరే నువ్వు చెప్పినట్టుగా చేస్తాను''

''బెస్టాఫ్‌లక్‌''

''నీ పెళ్లి చూపులవగానే ఆ వివరాలు నాకు వెంటనే చెప్పాలి''

''తప్పకుండా. బై''

''బై...''

ఆ సాయంకాలం సుధీర్‌ అతని తల్లిదండ్రులతో గవర్నర్‌పేటలో పెళ్లి చూపులకు వెళ్లాడు. ఫలహారాలు, కాఫీలు అయిన తరువాత అమ్మాయిని అలంకరించి తీసుకువచ్చారు. ఆమెను చూడగానే సుధీర్‌ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. కొంచెం సేపు ఆశ్చర్యంతో ఆమె వంక కళ్లార్పకుండా చూస్తూ నిశ్చేష్టుడయ్యాడు. ఆమె ఆనంద్‌ గీసిన చిత్రంలోని సుందరే! ఆమె మాత్రం ఒకసారి అతణ్ణి చూసి సిగ్గుతో తల వంచుకుని ఉంది. అతను ఆశ్చర్యం నుంచి తేరుకుని ఆమెతో పర్సనల్‌గా మాట్లాడాలని అన్నాడు. ఆమె తండ్రి ఆమెను, సుధీర్‌ని మేడమీదకు పంపించాడు.

''నేను ఒక ముఖ్యమైన విషయం మీకు అర్జంటుగా చెప్పాలి'' అన్నాడు సుధీర్‌ చందనతో.

''ఒకరికొకరు నచ్చడం నచ్చకపోవడం గురించి కాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ''చెప్పండి'' అంది చందన.

''నా ప్రాణస్నేహితుడు ఆనంద్‌ కిందటి వారంలో ఇక్కడ జరిగిన చిత్రలేఖనం పోటీలో తను గీసిన సూర్యోదయం చిత్రానికి ప్రథమ బహుమతిగా ఒక వెండికప్పును అందుకున్నాడు. మీకు గుర్తుందనుకుంటాను''

''అవును''

''అప్పుడు మీ నాన్నగారు చీఫ్‌గెస్టుగా ఉండి అతనికి కప్పు ఇస్తున్నప్పుడు పక్కనే నిలబడి ఉన్న మిమ్మల్ని చూశాడు. మీ అందమైన రూపానికి ముగ్ధుడై మీతో ప్రేమలో పడ్డాడు. అతను ఇంటికి వెళ్లిన వెంటనే తన మనసులో ముద్రితమైన మీ రూపాన్ని చిత్రంగా రూపొందించాడు. దాన్ని తన ఆరాధ్యచిత్రంగా చేసుకుని ఉదయం, సాయంకాలం మీ రూపాన్ని చూస్తూ మిమ్మల్నే వివాహం చేసుకోవాలని లేదా బ్రహ్మచారిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. అతను యోగ్యుడు, అందగాడు, కళాకారుడు, ఆంధ్రబ్యాంకులో ఎకౌంటెంటుగా పని చేస్తున్నాడు. మిమ్మల్ని అంతగా ఆరాధిస్తున్న అతనే మీకు భర్త కాదగినవాడు''

చందన ఆశ్చర్యంగా అతని మాటలు వింటోంది.

''మన పెళ్లిచూపుల గురించి, మీ గురించి మా అభిప్రాయం తరువాత తెలియచేస్తామని మా పేరెంట్స్‌తో చెప్పిస్తాను''

ఆమె సిగ్గును వదిలి అతనితో ''నన్ను గాఢంగా ప్రేమించి నా చిత్రాన్ని ఆరాధిస్తున్న మీ స్నేహితుణ్ణి చూడాలని వుంది'' అంది. సుధీర్‌ ఆమెకు ఆనంద్‌ చిరునామా, వైజాగ్‌లో అతని పేరెంట్స్‌ ఎడ్రసును ఇచ్చాడు. ఆ విధంగా సుధీర్‌, చందనల పెళ్లి చూపులు ముగిశాయి.

ఆ రాత్రి చందన తన తల్లికి ఆనంద్‌ గురించి సుధీర్‌ చెప్పిన వివరాలన్నీ చెప్పింది. ఆవిడ ఆ వివరాలన్నీ తన భర్తకు చెప్పింది.

ఆనంద్‌కు ప్లెజెంట్‌ సర్‌ప్రైజ్‌ ఇద్దామని పెళ్లిచూపులైన తరువాత రోజు సుధీర్‌ అతణ్ణి కలుసుకోలేదు. ఆ మర్నాడు ఉదయం చందన తల్లిదండ్రులు ఆనంద్‌ తల్లిదండ్రులతో పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి వైజాగ్‌ వెళ్లారు. వెంటనే చందన ఆనంద్‌ ఇంటికి వెళ్లింది. తనను ఒకసారి చూసినంత మాత్రాన తన రూపాన్ని ఆరాధ్యచిత్రంగా చేసుకుని ప్రేమిస్తున్న ఆనంద్‌కు తను కనపడితే అతని ప్రేమను తన మీద ఎలా కురిపిస్తాడో అనే ఆలోచనతో కాలింగ్‌బెల్‌ మోగించింది. ఆనంద్‌ వచ్చి తలుపు తీశాడు. అతని ఆరాధ్యదేవత తన ఎదుట ప్రత్యక్షమైంది! ఇది నిజమా, కలా అని కొన్ని క్షణాలు సందిగ్ధానికి లోనయ్యాడు. అప్రయత్నంగానే ఆమె కళ్లు అతని రూపాన్ని గమనించాయి. అతను పొడవైన మనిషి, అందగాడు, ఎరుపు రంగులో ఉన్నాడు. విశాలమైన ఛాతీ, రింగులు తిరిగిన జుట్టు, కళ్లలో కళాకారుని కళతో ఆమె దృష్టిని ఆకట్టుకున్నాడు. కొన్ని క్షణాలు వారిద్దరి మధ్య నిశ్శబ్దం ఆవరించింది. ఆమె తేరుకుని ''మే ఐ కమిన్‌, ప్లీజ్‌'' అంది.

''యు ఆర్‌ మోస్ట్‌ వెల్‌కం'' అన్నాడు ఆనంద్‌.

లోపలికి వెళ్లి అతను చూపించిన చైర్‌ మీద ఆమె కూర్చుంది. వెంటనే ఆనంద్‌ రెండు కప్పుల్లో ఫ్లాస్కులోని కాఫీని పోసి ఆమెకు ఒక కప్పు అందించి, తను ఒక కప్పు తీసుకున్నాడు. ఇద్దరూ కాఫీ తాగుతున్నారు. తన మనసులోని మాటను ఎలా చెప్పాలో తెలియక అతను మనసులో ఘర్షణకు లోనయ్యాడని ఆమె గ్రహించింది.

''మీరు చిత్రాలు చాలా బాగా గీస్తారు కదా! కిందటి వారంలో మీ సూర్యోదయం చిత్రానికి మా నాన్నగారు మీకు ఫస్టు ప్రైజ్‌గా ఒక వెండికప్పు ఇచ్చారని నాకు బాగా గుర్తు'' అంది.

''అవునండీ. మీ నాన్నగారి పక్కన అప్పుడు మీరు కూడా నిలుచున్నారు''

''అయితే మీరు నన్ను గుర్తుపెట్టుకున్నారన్నమాట!''

''మిమ్మల్ని గర్తుపెట్టుకోవడమే కాదు. మీ....'' అని మాట్లాడకుండా ఆగిపోయాడు.

''చెప్పండి. ఆగిపోయారేం?''

''నేను మీ చిత్రాన్ని గీశాను''

''అయితే నేను తప్పకుండా చూడాల్సిందే''

''రండి చూద్దురు గానీ'' అని అతను ఆమెను తన బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లాడు. వెంటనే ఆమె కళ్లు తన చిత్రం మీద పడినాయి. అంత అందంగా ఉంటానా? అని తన మనసులో తను మురిసిపోయింది. ఆపాదమస్తకం తన అందాలన్నీ అతను మనసులో నిలుపుకుని తన రూపాన్ని చిత్రంలో తీర్చిదిద్దినందుకు ఒకవైపున అతని కళానైపుణ్యాన్ని మనసులో అభినందిస్తూ మరొకవైపు సిగ్గుతో ముడుచుకుపోయింది. తన మనసులోని ఆలోచనలను బయటపెట్టకుండా ''నాకంటే మీరు గీసిన నా చిత్రం ఎక్కువ అందంగా ఉంది'' అంటూ ఆమె గలగలా నవ్వింది.

అతను కూడా ఆమెతో కలిసి నవ్వి,

'మీరు భలే తమాషాగా మాట్లాడుతున్నారు'' అన్నాడు.

''అయితే నా చిత్రాన్ని ఎందుకు గీశారు?''

''మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నా మనసంతా మీ రూపంతో నిండిపోయింది''

''అంటే మీరు సౌందర్యోపాసకులన్నమాట. ఎంతైనా కళాకారులు కదా! మీరు నన్ను ప్రేమిస్తున్నారా?'' సిగ్గు విడిచి అడిగింది.

''త్రికరణ శుద్ధిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మరి మీరు?''

''మిమ్మల్ని ప్రేమించబట్టే ఇలా ఒంటరిగా మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. మీరు నా మీద గాఢమైన ప్రేమతో నన్నారాధిస్తున్నారని మీ ఫ్రెండ్‌ సుధీర్‌ చెప్పాడు''

సుధీర్‌ అనే పేరు వినగానే ఆనంద్‌ కొన్ని క్షణాలు ఆశ్చర్యపడి ''సుధీర్‌ మీకెలా తెలుసు?'' అనడిగాడు.

''నిన్న నా పెళ్లిచూపులకు అతనే నన్ను చూడడానికి వచ్చాడు. నాతో పర్సనల్‌గా మాట్లాడినప్పుడు మీరు నన్ను గాఢంగా ప్రేమిస్తున్నారనీ, నా చిత్రాన్ని గీసి ఆరాధిస్తున్నారనీ, మీరే నాకు తగిన భర్త అనికూడా నిశ్చయంగా చెప్పాడు. మన పెళ్లి నిశ్చయించడానికి నా పేరెంట్స్‌ మీ అమ్మానాన్నతో మాట్లాడ్డానికి వైజాగ్‌ వెళ్లారు. మళ్లీ మన పెళ్లిలో కలుసుకుందాం. అంతవరకూ ఇప్పుడు మనం కలుసుకుని చేసిన సంభాషణను గుర్తుంచుకుని తృప్తిపడతాను. వెళ్లొస్తాను. బై'' అంది చిరునవ్వుతో చందన.

''నేను మీ చిత్రాన్ని చూసుకుంటూ తృప్తి పడతాను'' అన్నాడు ఆనంద్‌ ఆనందంగా. అతను కూడా బై చెప్పగానే, ఆమె వెళ్లిపోయింది.

చందన వెళ్లిన కొంచెం సేపటికి సుధీర్‌ వచ్చాడు. ఆనంద్‌ సంతోషం పట్టలేక అతణ్ణి కౌగిలించుకున్నాడు. సుధీర్‌ నవ్వుతూ, ''నీ పెళ్లికి గ్రీన్‌ సిగల్‌ పడింది కదా!'' అన్నాడు.

''నువ్వు సూత్రధారిగా ఉండి చందనతో నా పెళ్లికి ప్రయత్నాలన్నీ చేయిస్తున్నావ్‌. నీ పెళ్లి చూపుల్లో చూసిన అందాల చందనను నువ్వు ఆశించకుండా నా కోసం త్యాగం చేశావ్‌. నువ్వు నిజంగా దేవుడివి'' అని అన్నాడు ఆనంద్‌.

అతని కళ్లు చెమర్చాయి. ''దేవుడు, త్యాగం అంటూ పెద్ద పెద్ద పదాలు ఉపయోగించకు. నీకోసం ఆ మాత్రం చెయ్యకపోతే మనం ప్రాణస్నేహితులం ఎలా అవుతాం? మొత్తం మీద నీ పెళ్లి సమస్య చాలా తేలిగ్గా పరిష్కారమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది''

మరుసటినెలలో చందన, ఆనంద్‌ల వివాహం నిశ్చయమైంది. మొదటి శుభలేఖలు ఇరువైపుల నుంచి సుధీర్‌కు వెళ్లాయి. సుధీర్‌ ఆనంద్‌తో ''మీ వివాహానికి మూల కారణం నువ్వు గీసిన చందన ఆరాధ్యచిత్రం'' అని స్నేహపూర్వకంగా అతని భుజం తట్టాడు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్