హక్కులను సాధించుకోవడంలో మహిళలు ఉద్యమాల్లో ముందుండాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా అధ్యక్షురాలు కోనేటి నాగరాణి పిలుపునిచ్చారు. 100వ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో శత వార్షికోత్సవ సదస్సును ఐద్యా పట్టణ కమిటీ అధ్యక్షురాలు గోలి కల్పన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కోనేటి నాగరాణి మాట్లాడుతూ పురుషులతో సరిసమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. ఎన్నో ఏళ్లుగా ఐద్వా ద్వారా చేసిన పోరాటం ఫలితంగానే నేడు పార్లమెంటులో 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఇది దేశ మహిళలు సాధించిన అపూర్వ విజయమని, ఇదే పోరాట స్ఫూర్తితో మహిళలపై జరుగుతున్న వివక్షను దాడులను, ఎదుర్కొనేందుకు మహిళలు అన్ని ప్రజా స్వామిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని, ముందు వరుసలో ఉండాలన్నారు. పట్టణాధ్యక్షురాలు గోలి కల్పన మాట్లాడుతూ శ్రామిక వర్గ మహిళలు అన్ని రకాలుగా వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆధాయంపైనే దృష్టి పెట్టడంతో ఈ రోజు అనేక పేద, మధ్య తరగతి కుటుంబాలు మద్యం ఉచ్చులో చిక్కి తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. చుక్క నీరు లేక ప్రజలు అల్లాడుతుంటే, వాడకో బెల్టుషాపులు తెరుచుకుంటున్నాయని, మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా మహిళా లోకం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బెల్టుషాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కడారి సత్తవ్వ, మాడం చంద్రకళ, వేముల సుజాత, లత, గాజుల రమ, పలువురు మహిళలు పాల్గొన్నారు.