వైష్ణవిని హత్య చేసిన వారిని ఉరి తీయాలని

  • ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం, దిష్టిబొమ్మ దగ్ధం

విజయవాడలో కిడ్నాప్‌ చేసి గుంటూరులో హత్య చేసిన వైష్ణవి మృతికి కారణమైన హంతకులను ఉరి తీయాలని ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక బాలికల కాలేజి నుండి కలెక్టరేట్‌ మీదుగా ర్యాలీ, మానవహారం అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి దస్తగిరిరెడ్డి, ఐద్వా జిల్లాకన్వీనర్‌ పద్మమ్మ మాట్లాడుతూ కిడ్నాప్‌కు గురై వైష్ణవి హత్యకు గురికావడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమాత్రమున్నాయో అర్థమవుతోందన్నారు. హోంమంత్రి స్థానంలో ఒక మహిళ ఉన్నప్పటికీ మహిళలు, అమ్మాయిల కిడ్నాప్‌లు, హత్యలను నివారించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అమ్మాయిలను పాఠశాలకు, కాలేజీలకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీస్‌వ్యవస్థ ఉందో లేదోననే అనుమానం కలుగుతోందన్నారు. కిడ్నాప్‌లు, హత్యలపై పోలీస్‌యంత్రాంగం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని వారు హెచ్చరించారు. హత్యకు పాల్పడిన వారిని తక్షణమే ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. ఈలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్ష, కార్యదర్శులు జమీలా, లక్ష్మిపతి, డివైఎఫ్‌ఐ నగర అధ్యక్షులు రాజు, కార్యదర్శి మస్తాన్‌, ఎస్‌ఎఫ్‌ఐ నగర నాయకులు హరిబాబు, పవన్‌, గర్ల్స్‌కాలేజి విద్యార్థులు పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్