మండల పరిధిలోని అరవీడు గ్రామంలో జన్మించిన టి. రెడ్డెప్పరెడ్డి ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఎస్‌టియు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్‌గా సమాజానికి విశేష సేవచేసినట్లు బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో రెడ్డెప్పరెడ్డికి ఎస్‌టియు మండల శాఖ ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కష్టించి పనిచేయడం వల్ల రాష్ట్రస్థాయికి ఎదిగారని అన్నారు. సహోద్యోగులకు ఎంతో సేవచేశారని కొనియాడారు. ఎగువగొట్టివీడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ రెడ్డెప్పరెడ్డి ఆత్మబంధువుగా ఎదిగారని, సామాజిక సేవలు చేసి అందరికీ ఆప్తుడుగా ఉండేవారని అన్నారు. ఆత్మీయుడుగా మెలుగుతూ మండలంపై ఎక్కువ అభిమానం చూపేవారన్నారు. ఎస్‌టియు మండల శాఖ అద్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో రామాలయ నిర్మాణానికి ఎంతో సహకరించారన్నారు. ఎంఎల్‌సి పోచంరెడ్డి నిధులతో గ్రామానికి సిమెంట్ రోడ్డు ఏర్పాటులో చాలా కృషి చేశారన్నారు. గ్రామ, మండల వాసులు ఎప్పుడు వెళ్లినా వారికి సహకరిస్తూ సాయపడేవారన్నారు. ఎంఎల్‌సి స్థానానికి ఎదగాల్సిన రెడ్డెప్పరెడ్డిని పోగొట్టుకున్నామని అన్నారు. ప్రధానోపాధ్యాయులు సుధాకర్, మాదాసి వెంకటప్ప మెమోరియల్ ట్రస్ట్ సెక్రటరీ నరసింహారెడ్డి అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఆర్‌పిలు, అనేక మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెడ్డెప్పరెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఎస్‌టియు మండలశాఖ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.