జ్యోతిబసు అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా విమర్శలను ఆహ్వానించే వారని అసెంబ్లీ స్పీకర్ హషీమ్ అబ్దుల్ హలీమ్ అన్నారు. ఎప్పుడూ సభాపతినుద్దేశించి 'స్పీకర్ సర్' అంటూ అత్యంత గౌరవప్రదంగా సంబోధించే వారన్నారు. బసు మంచి వక్తే కాక ఇటు అధికార పక్షనేతగా, అటు ప్రతిపక్ష నేతగా సభలో హుందాగా ప్రవర్తించేవారని హలీమ్ చెప్పారు. ఎప్పుడైనా సభలో వాతావరణం ఉద్విగ భరితంగా మారితే చలోక్తులతో నవ్వులు పూయించే వారని, అదే సమయంలో ఎటువంటి తీవ్ర విమర్శలనైనా ఆయన సహృదయంతో ఆహ్వానించే వారని హలీమ్ వివరించారు. ఇతర ప్రముఖుల తరహాలోనే బసు తైలవర్ణ చిత్రాన్ని అసెంబ్లీ హాలులో త్వరలో ఆవిష్కరిస్తామని, అటు సిపిఎం, ఇటు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటూ బసు కాంశ్య విగ్రహాన్ని కూడా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ప్రతిపక్ష సభ్యులతో పాటు అధికార పక్షంలోని జూనియర్ సభ్యులను కూడా ఆయన సమానంగా గౌరవించే వారన్నారు.
ప్రతిపక్షానికి సైతం ఎనలేని సహకారం
అధికార పక్షంలోవున్నప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష సభ్యులకు ఎనలేని గౌరవాన్నిచ్చి తమకు అనేక అంశాలలో సహాయం చేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ సభ్యుడు గ్యాన్‌సింగ్ సోహన్‌పాల్ అన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకునే వారని ఆయన నాటి రోజులను గుర్తుచేసుకున్నారు.
శాస్త్ర పరిశోధనలకు బసు కానుక
మరణానంతరం తన పార్ధివ దేహాన్ని వైద్య పరిశోధనలకు వినియోగించాలన్న దివంగత జ్యోతిబసు కోరిక ప్రకారం ఆయన శరీరాన్ని వైద్యవిద్యార్ధుల బోధనకు వినియోగిస్తామని ఇక్కడి ఎస్‌ఎస్‌కెఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వైద్య నిపుణులు పరిశీలించి అనుమతించిన తరువాతే బసు శరీర భాగాలను విద్యార్ధులు ఏ విధంగా ఉపయోగించాలో నిర్ణయిస్తామని ఎస్‌ఎస్‌కెఎంలోని పోస్టుగ్రాడ్యుయేట్ వైద్య కళాశాల డైరెక్టర్ ప్రదీప్ మిత్రా చెప్పారు. శరీరాన్ని దానం ఇవ్వటం అంటే అంత్యక్రియలతో సమానమేనని, దాని ఇచ్చిన శరీరాన్ని ఏం చేస్తారన్న ప్రశ్న అడిగేందుకు ఎవరికీ అవకాశం వుండదని ఆయన చెప్పారు. బసు తమకు ఇచ్చిన కానును ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో తాము నిర్ణయిస్తామన్నారు. సచివాలయంలో ఆరోగ్య మంత్రి సూర్యకాంత మిశ్రాతో భేటీ అయిన అనంతరం ఆయన బసు శరీరభాగాల పరిరక్షణకు తీసుకోబోయే చర్యలను మీడియా ప్రతినిధులకు వివరించారు.