విలక్షణ నేత విశిష్ట వైఖరి

జ్యోతిబసు వేషభాషలు విద్యావంతులతో సహా బెంగాలీలనే కాదు దేశవ్యాప్తంగా చాలామందిని ఆకర్షించాయి. రాజకీయాలకతీతంగా కూడా ప్రజల్లో ఆయన పట్ల ప్రత్యేక గౌరవముంది. దానికి కారణం ఆయన నిజాయితీ, నిబద్ధత. అన్నిటికీ మించి ఆయన వ్యవహార శైలి విలక్షణంగా ఉంటూ పలువురిని ఆకట్టుకునేది, ఆయనది పాదరసం లాంటి తీక్షణ మేథస్సు. ఎంతటి జఠిల పరిస్థితిలోనైనా వెరువకుండా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆయన సొంతం.

తోటివారిని ఎంతో ప్రేమిస్తారుఒక వ్యక్తిగా సహయోధుడుగా తన తోటి వారిని ఆయన ఎంతగానో ప్రేమిస్తారు. ప్రమోద్‌ దాస్‌గుప్తా, జ్యోతిబసు దీర్ఘకాలంపాటు ఇద్దరూ కలిసి పనిచేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇద్దరూ కవలల మాదిరిగా కలిసిపోయారు. డిసెంబర్‌ 1982లో ప్రమోద్‌ దాస్‌ గుప్తా చనిపోయారు. ఆయన మరణం బసుపై తీవ్ర ప్రభావం చూపింది. దానితో బసు గుండెపోటుకి గురయ్యారు. నెల రోజుల పాటు ఎవర్నీ ఆయన కలవలేదు. ఆ షాక్‌ నుంచి ఆయన కోరుకుంటారా? అని చాలామంది అనుకున్నారు. కానీ ఆయన అంతటి తీవ్ర అనారోగ్యం నుంచి తేరుకుని సమర్థవంతంగా అటు తరవాత 18 ఏళ్ళపాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు పదుగురు మెచ్చుకునేలా నిర్వహించగలిగారు. తనకున్న మానసిక సామర్థ్య పటిష్టత వల్లే సాధ్యమైందని పలువురు కొనియాడారు.

1969లో రెండో ఐక్య సంఘటన కాలంలో బెంగాల్‌కు గవర్నర్‌గా పనిచేసిన శాంతి స్వరూప్‌ ధావన్‌ కూడా జ్యోతిబసు అసమాన పాలకుడని కొనియాడారు. ప్రత్యేక గూర్ఖాల్యాండ్‌ ఆందోళన లేవనెత్తిన సుభాష్‌ ఘీసింగ్‌ కూడా ఒక సమయంలో జ్యోతిబసు దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి అని చెప్పారు. గూర్ఖాల్యాండ్‌ డిమాండ్‌ డార్జిలింగ్‌ హిల్‌ డిస్ట్రిక్ట్‌ కౌన్సిల్‌ రూపంలో అప్పటికి ఇంకా ఒక పరిష్కారానికి రాలేదు. అయినా జ్యోతిబసు నిజాయితీతో కూడిన ప్రవర్తన ఆయనను ప్రభావితం చేసి అలా చెప్పించింది.ఆయన రాజకీయ విజ్ఞత, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతే జాతీయ అంతర్జాతీయ స్థాయి విషయాల్లో ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా బసుని సంప్రదించేలా చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందిరా గాంధీ హత్యకు గురైన 31.10.1984నాడు జ్యోతిబసు చెన్నైలో ఉన్నారు. అక్కడి నుంచి పశ్చిమబెంగాల్లో పరిస్థితిని తెలుసుకుని పాలనా పరంగా కఠినంగా వ్యవహరించైనా సరే శాంతి భద్రతలను కాపాడే విధంగా ఉత్తర్వులు ఇప్పించారు. ఆ రోజు ఆరుగురు దుండగులు సిక్కుల మీద దాడి చేయడానికి పూనుకున్నారు. వారు పోలీసు కాల్పుల్లో చనిపోయారు కూడా. కానీ, ఇతర ఉత్తర భారత రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్లో పరిస్థితి చాలా తొందరగా... ఒక్క రోజులోనే అదుపు కావడమంటే బసు పాలనాదక్షతే కానీ మరో విషయం కాదు.

1992 డిసెంబర్‌ బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత జ్యోతిబసు వెంటనే టివీలో ప్రజలను ఉద్దేశించి 'బైట కర్ఫ్యూ విధించబడింది, షూట్‌ ఎట్‌ సైట్‌ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ప్రజలు ఇళ్ళల్లోనే ఉండి శాంతి పరిరక్షణకు సహకరించాలి' అని చెప్పారు. అతి శీఘ్రంగా అవాంఛనీయమైన సంఘటనలు జరుగకుండా పరిస్థితిని అదుపు చేయగలిగారు.

బి.డి.పాండే గవర్నర్‌గా వచ్చిన (1981) వెంటనే పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ ఫైల్స్‌ను(దాదాపు 150 దాకా) పరిశీలనకు తెప్పించుకున్నారు. అప్పుడు అది రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. వామపక్ష ప్రభుత్వం సంగతి తేలుస్తాడని వ్యతిరేకులు ఉత్సాహపడ్డారు. వామపక్ష శ్రేణులు కూడా ఈ చర్యకు గందరగోళ పడ్డాయి. కానీ, జ్యోతిబసు గవర్నర్‌ ప్రవర్తనను వ్యతిరేకించలేదు. రాష్ట్రానికి రాజ్యాంగ బద్ధంగా గవర్నర్‌ అధినేత అయినందున ప్రభుత్వ ఫైళ్ళు చూసే అధికారం ఆయనకుందని, దీని గురించి ఆందోళన చెందే అవసరం లేదని ప్రకటించి తన సహనాన్ని, నిబద్ధతను ప్రదర్శించారు.

అధికారులు ప్రజాప్రతినిధులకు లోబడి పనిచేయాలి

పోలీసులు, వామపక్ష ప్రభుత్వ ఆదేశాలని బేఖాతర్‌ చేయాలని ఒక సందర్భంలో వ్యతిరేకుల నుంచి వచ్చిన కవ్వింపుకి ముఖ్యమంత్రిగా జ్యోతిబసు తీవ్రంగా స్పందించారు. 'పోలీసులు ఇప్పుడు ఉన్న వ్యవస్థలో ప్రభుత్వ నిర్దేశానుసారం పని చేయాలి, ప్రభుత్వ విధానాలు బాగోకుంటే ప్రజలే ఆ ప్రభుత్వాన్ని మార్చుకుంటారు' అని చెప్పారు.

ఒకసారి జ్యోతిబసు విదేశీ పర్యటనకు వెళుతూ అశోక్‌ మిత్రాను తాత్కాలిక ముఖ్యమంత్రిగా పెట్టారు. ఆ సమయంలో పారిశ్రామిక వర్గాల నుంచి ఒక ప్రతినిధి బృందం ఒక పవర్‌ ప్లాంట్‌ను సందర్శించేందుకు ముందుకు వచ్చింది. అది జ్యోతిబసుతో చర్చించి నిశ్చయించబడిన కార్యక్రమమే. పవర్‌ సెక్రటరీ ముర్షేన్‌ దానికి ఏర్పాట్లు చేశారు. కానీ అశోక్‌ మిత్రా గారికి దాని గురించి చెప్పలేదు. దానికి ఆగ్రహించిన అశోక్‌మిత్రా ఆఖరు నిమిషంలో ఆకార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. అశోక్‌ మిత్రా ప్రవర్తన కూడా విమర్శకు వచ్చింది. విదేశీ పర్యటన నుంచి వచ్చిన తరువాత జ్యోతిబసు బహిరంగంగా ప్రకటన చేస్తూ మనం పని చేస్తున్న వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధుల మాట ప్రకారం నడుచుకోవాలి' అని చెప్పారు. ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి గురించి ప్రజలు చూసుకుంటారని చెప్పారు. అంటే పవర్‌ సెక్రటరీ తాత్కాలిక ముఖ్యమంత్రిని కాదని ఆయన పని చేసుకుపోతాననడం సరైంది కాదని బసు చెప్పకనే చెప్పారు.

సాధారణంగా అధికారులు తన దగ్గరకి వచ్చినప్పుడు బసు వారిని మర్యాద పూర్వకంగా కూర్చోమని మాట్లాడేవారు. కానీ ప్రభుత్వానికి ఇబ్బంది కరంగా ప్రవర్తిస్తే ఆయన వారిని కూర్చోమనకుండా నిలబెట్టే మాట్లాడి పంపేవారు. అలా హూందాగా తన అసంతృప్తిని కనబరిచేవారు.

మదర్‌ థెరిస్సాకు నోబెల్‌ ప్రైజ్‌ వచ్చినప్పుడు కొల్‌కతా పార్క్‌ స్ట్రీట్‌ అసెంబ్లీ అవ్‌గాడ్‌ చర్చ్‌ ఆసుపత్రి ప్రాంగణంలో సివిల్‌ రిసెప్షన్‌ పెట్టారు. దీనికి జ్యోతిబసు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. థెరిసాకు బహుమానం వచ్చిన సందర్భంగా ఆయన ఏం చెప్తారోననే ఆలోచన అందరిలో కుతూహలం కలిగించింది. బసు మాత్రం మదర్‌ థెరిసా పాత్రను కొనియాడుతూ సోషలిస్టు వ్యవస్థలోనూ మనిషికి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, లాలన అవసరముంటాయి. మదర్‌ థెరిసా వంటివారి అవసరం మానవాళికి ఎప్పుడూ ఉంటుంది అని చెప్పారు.

1967 తరువాత కల్లోల సమయంలో కాంగ్రెస్‌ దుండగుల దాడుల్ని ప్రతిఘటించే సందర్భంలో జ్యోతిబసుని 'మీవాళ్ళు కూడా ప్రతిఘటిస్తున్నారు కదా?' అని ప్రెస్‌ వారు ప్రశ్నించినప్పుడు 'వాళ్ళు మామీద బాంబులు విసిరితే మేము వాళ్ళమీద రసగుల్లాలు విసురుతామా?' అని ఆయన గట్టిగా సమాధానం చెప్పారు.

కుట్రలను వమ్ముచేసిన తీరు

1982లో మే నాటికి మొదటి వామ పక్ష సంఘటన పాలనా కాలం పూర్తికానుంది. 5ఏళ్ళు పూర్తికాగానే అసెంబ్లీ, ప్రభుత్వం రెండూ రద్దు చేసి రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరిపే ఉద్దేశం ఇందిరాగాంధీకి ఉందని సిపిఎం అంచనా వేసి కాలం ముగియకుండానే అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసి ఎన్నికలు ముందుగా నిర్వహించండని కోరింది. దానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుపడి అసెంబ్లీ రద్దు కాకుండా నాటకం ఆడింది. చివరికి సుప్రీం కోర్టులో లేవనెత్తితే రాష్ట్ర ప్రభుత్వం కావాలనుకుంటే ముందుగా ఎన్నికలు నిర్వహించాలంటూ పార్టీ నిర్ణయాన్నే సమర్థించింది.

ఎన్నికలు నిర్వహించటానికి ఇందిరాగాంధీకి ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఓటర్‌ లిస్టులో 30 శాతం బోగస్‌ ఓట్లున్నాయని కాంగ్రెస్‌ మరో గందరగోళానికి తెరతీసింది. దానికి ప్రభుత్వ తరుపున జ్యోతిబసు ఓటర్‌ లిస్టు తయారు చేసేది ఎన్నికల కమిషనరని, రాష్ట్ర ప్రభుత్వానికి దానిలో పాత్రలేదని చెప్పినా ఆగలేదు. ఇందిరాగాంధీ కూడా బెంగాల్లో పర్యటించి అదేమాట లేవనెత్తారు. అప్పుడు బసు సంచలనాత్మకంగా విషయాన్ని ఫోకస్‌ చేస్తూ 'ఓటర్‌ లిస్ట్‌లో 3కోట్లకు పైన ఓటర్లున్నారు. ఐతే కోటి ఓటర్ల పేర్లు గల్లంతా? ఎన్నికల కమిషన్‌ దీని సంగతి తేల్చాలి' అని చెప్పడంతో ఇందిరా గాంధీ కూడా వెనక్కిపోయి ఆమెకు తప్పుడు బ్రీఫింగ్‌ ఇవ్వడం జరిగిందని తెలుసుకున్నారు. అలా పలు రకాలుగా ప్రజల పక్షాన నిలవడమే కాకుండా పాలనా దక్షతను కూడా చాటాడు జ్యోతిబసు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్