ప్రనమీ చరణే తబో...

  • సంతాప పుస్తకంలో రాతలే కాదు చిత్రాలు కూడా ఉన్నాయి

కోల్‌కాతా జనవరి 18 : సంతాప పుస్తకంలో అందరూ వారి స్పందనలు రాశారు. కానీ కాజి అనిర్బాణ్‌ రాయటంతో పాటు బసు రేఖా చిత్రాన్ని కూడా గీసారు.జ్యోతిబసు ఎట్లాగైతే రెండు చేతులు జోడించి మొహం దగ్గరకు తెచ్చి 'నొ మొస్కార్‌' తెలియజేసే వారో అచ్చంగా ఆ చిరపరిచిత భంగిమనే చిత్రించారు. సంతాప పుస్తకంలో లెక్కకు మిక్కిలిగా పొందుపరిచిన అనుభూతుల మధ్య జ్యోతి బసు రేఖా చిత్రం అంతిమ వీడ్కోలు చెబుతున్నట్లుగా ఉండి పలువురిని ఆకర్షిస్తుంది. బసు మరణంపై తమ స్పందనను తెలియజేసేటందుకు గానూ రెండు చోట్ల సంతాప పుస్తకాలను పెట్టారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయం కామ్రేడ్‌ ముజఫర్‌ అహ్మద్‌ భవన ప్రవేశ ద్వారం వద్ద ఒకటి, అదు భవరం రెండో అంతస్తు హాల్‌లో మరొకటి పుస్తకాలను పెట్టారు. అలాగే సోమవారం రాష్ట్ర శాసనసభా ప్రాంగణంలో రెండు ప్రవేశ ద్వారాల వద్ద మరో రెండు పుస్తకాలను పెట్టారు. రోజంతా కష్టపడే శ్రామికుల దగ్గర నుండి కొల్‌కతాలో చైనా కౌన్సిల్‌ జనరల్‌ వరకు వివిధ వృత్తులకు చెందిన చాలామంది జ్యోతిబసును స్మరించుకుంటూ వారి వారి అనుభూతులను అందులో పొందుపరుస్తున్నారు. 'పార్టీ లేకుంటే నేనేవరిని' అంటూ బసు తానే ప్రశ్నించేవారు. కానీ ఈ సంతాప రాతల వలన ప్రజలు ఆయన్ని ఎంత గౌరవించే వారో స్పష్టమవుతుంది. 'గాడియన్‌' అని ఒకరు, 'దేవుడు' అని మరొకరు, మరోచోట 'మహాపురుషుడు' అని రాయడాన్ని బట్టి చూస్తే ప్రజల మనస్సులో ఆయన స్థానం ఏమిటో అర్థమవుతుంది.

'కామ్రేడ్‌ జ్యోతిబసు భారతదేశంలో ఒక మహత్తరమైన కమ్యూనిస్టు, చైనా దేశానికి ప్రియుడు' అని చైనా కౌన్సిల్‌ జనరల్‌ సిఓఇ మావో సంతాప పుస్తకంలో తన భావాలను పొందుపరిచారు. బంగ్లాదేశ్‌ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షులు మంజ్రూల్‌ హైసన్‌ఖాన్‌, ఆ పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షులు మహమ్మద్‌ జహంగీర్‌ ఇలా రాశారు 'అవిభక్త భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని, ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం నిర్మించడంలో బంగ్లాదేశ్‌ ప్రాంతంలో కూడా ఆయన కీలకమైన పాత్ర పోషించారు. ఈ పాత్ర ఆయనను భారత ఉపఖండంలోనే కాక ప్రపంచానికే గౌరవనీయ ప్రజా నాయకుడుగా నిలిపింది.

సాధారణ ప్రజలతో ఆయన ఆత్మీయత కొనసాగించే పద్ధతులు ఎలా ఉండేవో అది హౌరా జిల్లా సర్క్య వాస్తవ్యుడు లెబర్‌సిస్‌ ముజిందార్‌ సంతాప పుస్తకంలో రాసిన దాన్నిబట్టి మనకి తెలుస్తుంది. 'జ్యోతి తాతా.. నా వయస్సు రెండు మూడేళ్లప్పుడు మీరు హౌరాలో ఒక కార్యక్రమంలో నన్ను ఎత్తుకుని, నువ్వు నా మనవడివి, నేను నీకు తాతని' అని అన్నారంటూ రాశారు. చిరునామా రాయకుండా అబ్దుల్‌గని అబుల్‌ హుస్సేన్‌ అనునతను 'నా కొడుకు అహిల్‌గనికి మొట్టమొదట పల్స్‌పోలియో మందు తినిపించి పశ్చిమబెంగాల్‌లో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు' అని రాశాడు. ఇవి వ్యక్తిగత అనుభూతులు కాగా జ్యోతిబసు రాజకీయ సాధన గురించి కొల్‌కతా వాస్తవ్యులు జునాయెద్‌ అహ్మద్‌ ఈవిధంగా ప్రస్తావించారు, 'ఆయన హిందూ ముస్లిం మత కలహాలకు తీవ్ర విరోధిగా ఉండేవారు'అని రాశారు.

హుగ్లీ జిల్లా నిలాచల్‌దాస్‌ 'నిన్ను చూస్తేనే ఎర్రజెండాను పట్టుకునే ఉత్సాహాన్ని పొందుతాను. నిన్ను చూడగానే పోరాడాలనే పట్టుదల కలుగుతుంది' అని రాయడం ద్వారా బసు ఎంతగా స్ఫూర్తినిచ్చే వారో తెలిపారు. బసిరాహాట్‌ వాస్తవ్యులు దేవసిస్‌దత్తా 'వ్యక్తి పూజకంటే జ్యోతిబసు, ఆయన చేసిన పనిని నిర్మొహమాటంగా విశ్లేషించి దాని నుండి గుణపాఠం నేర్చుకుంటే మంచిది అని నేను అనుకుంటున్నాను.' అని సూచించారు. 'మొన్నటి ఆనారోగ్యం కంటే కొద్ది రోజుల ముందు ఆఖరిసారి ఆయనను కలిసి మాట్లాడినప్పుడు ఆయన చేతితో చేయి వేసిన నన్ను చూస్తూ 'ఏం చూస్తున్నారు, చర్మం దుమ్ములు తప్ప ఇంకేం లేదు కదా మృత్యువు కోసం వేచి వున్నా'నంటూ చెప్పడం నన్ను భయానికి గురిచేసింది అని అజరు ముఖర్జీ స్పందించారు. 'మానవ ప్రేమికుడివి నువ్వు, నువ్వు మరిచిపోతగినవాడివి కావు అందుకే నిన్ను ఎప్పటికి మరిచిపోలేము.' అంటూ కవి సుభాష్‌ ముఖోపాధ్యారు తన కుటుంబం తరఫున స్పందనను పొందుపరిచారు.

ఈ ప్రజా నాయకుడిని ఎప్పుడూ కూడా మరిచిపోలేమని 'ప్రనమీ చరణే తబో, చిర హమోలినా, కొటు నా నిష్‌ప్రభ (ప్రణామం నీ చరణాలకు, చిర కటువు, కాంతిలేనివి)' అంటూ దేశ్‌ ప్రాణ్‌ సస్మల్‌ రోడ్‌ వాస్తవ్యులు రవిదత్తా పొందపరిచింది వాస్తవమే అంటూ ఈ పుస్తకం ప్రతి పేజీలోనూ రాసిన రాతలు చెబుతున్నాయి. ఇక్కడున్న వారే కాదు అమెరికా నుండి రాలేకపోయిన సజాద్‌ అహ్మద్‌, పర్‌ఫెద్‌ సుల్తాన్‌ అక్కడి నుంచే బిమన్‌బసు గారికి ఫోన్‌చేసి వారి మనోవేదనను తెలియజేశారు. ఇలా బసు మృతికి దేశవిదేశాల నుంచి ఎందరో తమ తమ భావాలు, స్పందనలను తెలుపుతూనే ఉన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్