బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యతోపాటు పలువురు ప్రభుత్వోద్యోగులు జ్యోతిబసుకు నివాళులర్పించారు. రాష్ట్ర సెక్రటేరి యట్ రైటర్స్ బిల్డింగ్‌లో ఉంచిన బసు భౌతిక కాయం వద్ద వేలాది మంది ప్రభుత్వోద్యోగులు తమ ప్రియతమ నాయకుణ్ని చివరిసారిగా చూశారు. బసు మృతదేహం వద్ద పుష్ప గుచ్ఛాలుంచి నివాళులర్పిం చిన వారిలో ముఖ్యమంత్రితోపాటు ఆయన మంత్రి వర్గ సహచరులు కూడా ఉన్నారు. దీనికి ముందుగా సిపిఎం రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రత్యేక వాహ నంపై బసు భౌతిక కాయాన్ని సెక్రటేరియట్‌కు తర లించారు. జ్యోతిబసుకు దీర్ఘకాలంపాటు సహాయ కునిగా పనిచేసిన జయకృష్ణఘోష్ కూడా ఆ వాహ నంలో ఉన్నారు.
మ్యూజియంగా ఇందిరా భవన్
భౌతికంగా జ్యోతిబసు దూరమైనా కొల్‌కతా ప్రజలకు మాత్రం ఆయన మరింత దగ్గర కాబోతున్నారు. జ్యోతిబసు దాదాపు రెండు దశాబ్దాలపాటు నివాసం ఉన్న ఇందిరా భవన్ త్వరలోనే మ్యూజియంగా మారనుంది.నగరంలోని ఒక ప్రముఖ వీధికి ఆయన పేరును కూడా పెట్టబోతున్నారు. దీంతోపాటు 23 ఏళ్ళు ఆయన పరిపాలన కొనసాగించిన రైటర్స్ బిల్డింగ్ ఎదుట ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని కూడా కొల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఒక ప్రముఖ రోడ్డును గుర్తించే పనిలో ఉన్నామని మేయర్ బికాస్ రంజన్ భట్టాచార్య చెప్పారు. వీధి పేరును మార్చేందుకు కార్పొరేషన్ కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. 'అనేక సలహాలు వచ్చే అవకాశముందని మేము భావిస్తున్నాం.అంతిమంగా వాటిని పరిశీలించాక ఆమోదం కోసం మేయర్‌కి పంపుతాం. దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది' అని మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అలీముద్దీన్ స్ట్రీట్, హిందుస్థాన్ పార్క్‌తోపాటు రైటర్స్ బిల్డింగ్ ఎదురుగాను కొన్ని ముఖ్యమైన రోడ్లను కూడా పరిశీలిస్తున్నట్లు కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి. బ్రబౌర్న్ రోడ్, రిపన్ స్ట్రీట్, మిడిల్‌టన్ స్ట్రీట్, ఎజెసి బోస్ రోడ్, గరియాహత్ రోడ్‌లలో కూడా కొన్నింటికి పాక్షికంగాగానీ, పూర్తిగాగానీ పేరు మార్చే అవకాశముంది. రోడ్డు పేరును మార్చడంతోపాటు జ్యోతిబసు నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా తమ అభిమాన నేతకు కొల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఘన నిశాళి అర్పించనుంది.