దేశరాజధాని నుదుటిన 2012 డిసెంబర్ 16వ తేదీన చిందిన రక్తపు మరక ఇప్పుడప్పుడే చెరగదు. మహిళలపై సామూహిక అత్యాచార సంఘటనలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. దీన్ని అడ్డుకోవడానికి ఆత్మరక్షణ పద్ధతులు అత్యవసరం. ఆ క్రమంలో కరాటే లాంటి వాటిని నేర్చుకోవాల్సిన అవసరం ఇవాళ ఎంతైనా ఉంది. అయితే ఈ అవసరాన్ని 1943లలోనే గుర్తించి, నేర్పింది మోటూరు ఉదయం నాయకత్వంలోని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా). ఆ సంఘం సంస్థాపకుల్లో ఒకరైన మల్లు స్వరాజ్యం ఆ తర్వాత 1978లో అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పాఠశాల స్థాయి నుండి కాలేజీ స్థాయి వరకూ కరాటేను పాఠ్యాంశంగా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ నాటి అసెంబ్లీ రికార్డుల్లో ఆ విషయాలు నమోదై ఉన్నాయి. ఇటీవల మహిళాసంఘాలు, స్వచ్ఛందసంస్థలతో హోంశాఖ, స్త్రీ-శిశుసంక్షేమ శాఖ మంత్రులు జరిపిన సమావేశంలో ఈ అంశం మళ్ళీ ప్రస్తావనకు వచ్చింది. ఐద్వా ఆధ్వర్యంలోని మోటూరు ఉదయం ట్రస్టు ఛైర్మన్ మల్లుస్వరాజ్యం పాఠశాల స్థాయి నుండి కాలేజీ స్థాయి వరకు కరాటేను పాఠ్యాంశంగా చేయాలని ప్రస్తావించారు. దీనికి ప్రభుత్వం అంగీకరించినట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ తర్వాత ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏ.పి.ఎస్.ఆర్.టి.సి)లో కూడా కరాటేను నేర్పించడం మొదలుపెట్టినట్లు ఏ.కె.ఖాన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేటి మహిళలు, యువతరం ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకుంటున్నారు.
ఇవి నేటి పరిస్థితుల్లో యువతరానికి ఎంతైనా అవసరం. ఆ అవసరాన్ని గుర్తించి ఇప్పటికే అనేక ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేట్ కళాశాలలు, పోలీస్‌స్టేషన్లలో సైతం మహిళలకు పూర్తిస్థాయిలో ఉచితంగా ఆత్మరక్షణ విద్యల్ని నేర్పడం మొదలైంది.
కరాటే గురించి...
'కరాటే' నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆత్మరక్షణ విద్యల్లో (మార్షల్ ఆర్ట్స్) ఒకటి. ఇది జపాన్‌లోని ఒకప్పటి ర్యూకు ద్వీపం (నేటి ఒకినావా)లో అభివృద్ధి చెందింది. 'టే', కెన్‌పో (చైనా) అనే పోరాట విద్యల నుంచి ఇది రూపుదిద్దుకుంది. కరాటేలో పంచ్‌లు, కిక్‌ల కోసం మోచేతితో, మోకాలితో స్ట్రయిక్ చేయడం లాంటి టెక్నిక్‌లు అనేకం ఉంటాయి. కరాటే 19వ శతాబ్దానికి ముందే జపాన్‌లో అభివృద్ధి చెందింది. జపాన్‌లోని ప్రధాన భాగాలలో 20వ శతాబ్దంలో ప్రాచుర్యం పొందింది. 1922లో జపాన్‌లోని విద్యా మంత్రిత్వశాఖ 'షోట్‌కన్ కరాటే' సృష్టికర్త అయిన 'గిచిన్ ఫునకోషి'ని టోక్యోకు పిలిపించి తన కరాటే విద్యను ప్రజల ముందు ప్రదర్శించాల్సిందిగా కోరింది. జపాన్‌లోని కియో విశ్వవిద్యాలయం 1924లో తొలి కరాటే క్లబ్‌ను స్థాపించింది. జపాన్‌లోని అన్ని విశ్వవిద్యాలయాలలో 1932 వరకూ కరాటే గురించి ప్రత్యేక క్లబ్‌లను ఏర్పాటు చేశారు. కొంతకాలం తరువాత కరాటే విద్య జపాన్‌లోని సైనిక శిక్షణలో ప్రధానాంశంగా అవతరించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒకియావోలో నివసించే అమెరికన్ సైనికులు కరాటేను నేర్చుకున్నారు. అలా అమెరికాకు వెళ్ళిన కరాటే త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల మంది కరాటే శిక్షణ చేస్తున్నవారు ఉన్నారంటే దాని ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు.
ప్రయోజనాలు...
- మార్షల్ ఆర్ట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కరాటే ఎంతగానో దోహదపడుతుంది.
- దీన్ని సాధన చేయడం వల్ల మహిళలలో శారీరకంగా ఫిట్‌నెస్ కలుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. కొద్దిగా బరువు తగ్గుతారు కూడా!
- కరాటే వల్ల కలిగే లాభాలలో ప్రధానమైనది గుండెకు సంబంధించిన క్రియలు సక్రమంగా జరుగుతాయి.
- ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కరాటే ఎంతగానో ఉపయోగపడుతుంది. శ్వాస తీసుకునే విధానం మెరుగవుతుంది. హాయిగా నిద్రపోవచ్చు. మీలో ఏదో కొత్త శక్తి వచ్చినట్లు ఉత్సాహంగా ఉంటారు.
- కరాటే సాధన వల్ల మానసికంగా ఒత్తిడి పోయి, హాయిగా ఉండగలుగుతారు.
- సానుకూల దృక్పథం అలవడుతుంది.
- ప్రపంచాన్ని మరింత సమర్థంగా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
- ప్రమాదాల్ని ఎదుర్కోవడంలో ఎంతగానో తోడ్పడుతుంది.
- నిత్య సాధనతో చురుకుగా ఆలోచిస్తారు.
ఇలా ఎన్నో లాభాలున్న కరాటేను నేర్పాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉందని కరాటే నేర్చుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. పిల్లలకే కాకుండా మహిళలకూ కూడా ఇది చాలా అవసరమని చెప్పారు. ఉద్యోగాలు చేసే మహిళలకు మాత్రమే కాకుండా ఇళ్లల్లో ఉన్న వారికీ నేర్పించాలని కోరారు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియకుండా ఉందన్నారు. అందుకే అందరూ కరాటే నేర్చుకోవడం అత్యవసరమని అన్నారు. అయితే, మల్లు స్వరాజ్యం చెప్పినట్లు, పెరిగిపోతున్న ఈ అత్యాచార ఘటనలకు మూలాల్ని కనుగొని, వాటిని సంస్కరించడమే దీర్ఘకాలిక కర్తవ్యం.
విద్యార్థినులకు కరాటే తరగతులు : రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి
యువతులపై అఘాయిత్యాల నిరోధానికి పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే మహిళలను గౌరవంగా చూడాలనీ, వారు ఇచ్చే ఫిర్యాదులను కచ్ఛితంగా నమోదు చేయాలనీ తాము ఆదేశాలు ఇస్తున్నామనీ అన్నారు. విద్యార్థుల పాఠ్యాంశాలలో ఆత్మరక్షణను బోధనాంశంగా చేర్చాలని ఆమె సూచించారు. ప్రతి కళాశాలలో విద్యార్థినులకు సలహాదారులను నియమించాలని కోరుతున్నట్లు ఆమె వివరించారు. ఏడో తరగతి నుంచి పదవ తరగతి వరకు కరాటే తరగతులు నిర్వహించాలనీ, అందుకు క్లాసులుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరామనీ, అందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించారనీ ఆమె తెలిపారు.
నాడే చెప్పాం.. చేశాం.. చేస్తున్నాం.. : మల్లు స్వరాజ్యం
విజయవాడలో 1943లో మహిళల్ని బయటకు రావద్దని అనేవారు. కాదని వచ్చినవారిపై సంప్రదాయవాదులు దాడులు చేసేవారు. ఆ సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ మహిళలకు కరాటే, మగవాళ్ళకు కర్రసాము విద్యలు నేర్పింది. ఆ తరువాత సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం సందర్భంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది. ఆ సందర్భంగా గెరిల్లా దళాలుగా, గ్రామ రక్షక దళాలుగా ఏర్పడ్డాం. అప్పుడు ఈ విద్యలన్నీ ఉపయోగపడ్డాయి. అంతేకాకుండా తుపాకీనీ చేతబట్టాం. పరిగెత్తడం, దూకడం, కరాటే వంటివన్నీ నేర్చుకున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే సైనికుల లాగా తయారయ్యాం.
ఆ తర్వాత మహిళాసంఘం ఆధ్వర్యంలో మోటూరు ఉదయం నాయకత్వంలో కార్యకర్తలకు కరాటే శిక్షణ తరగతుల్ని నిర్వహిం చాం. అప్పట్లో చెన్నరు నుండి కరాటే నేర్పేందుకు శిక్షకుల్ని పిలిపిం చడం జరిగింది. నెలరోజుల పాటు జరిగిన ఆ శిక్షణలో సుమారు 70 మంది కార్యకర్తలు తర్ఫీదు పొందారు.
నేను అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక 1978లో 7వ తరగతి నుండి పిల్లలకు కరాటే శిక్షణ నివ్వాలని ప్రభుత్వం జి.వో తీసుకు రావాలని డిమాండ్ చేశాను. (రికార్డుల్లో ఉంది) పార్టీలతో సంబంధం లేకుండా అప్పటికే సభలో ఉన్న 15 మంది మహిళా ఎమ్మెల్యేలు నాకు మద్దతుగా నిలిచారు. కానీ ఇప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా అడుగుతూనే ఉన్నాను.
ఈ ప్రభుత్వం మద్యం డబ్బులతోనే నడుస్తోంది. ఓ పక్క ఒంటరి మహిళల సంఖ్య కూడా దాదాపు 30 శాతం ఉంది. మేము ఐద్వా ఆధ్వర్యంలో మోటూరు ఉదయం ట్రస్టు ప్రారంభించాక మళ్లీ మా డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అయినా ఎటువంటి స్పందనా లేకపోవడంతో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మా ట్రస్టు కార్యదర్శి పుతుంబాక భారతి ప్రభుత్వ పాఠశాలలో చదివే సుమారు 75 మంది పిల్లలకు కరాటే నేర్పించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఒకచోట 60 మందికి, మరోచోట 40 మందికి శిక్షణ ఇప్పించాం. మరిన్ని శిక్షణా కేంద్రాలు నిర్వహించాలని ఉంది, కానీ అందుకు తగినంత నిధులు లేకపోవడం మాకు ప్రధాన ఆటంకమైంది.
తాజా ఢిల్లీ ఘటన తర్వాత మళ్లీ ఆడపిల్లలకు కరాటే శిక్షణ అనేది ఇప్పుడు చర్చకు వచ్చింది. ట్రస్టు తరఫున ఒక కాలేజీలో, మల్కాజిగిరి లోని ఒక పాఠశాలలో స్థానిక దాతల సహకారంతో కరాటే నేర్పిసు న్నాం. మల్కాజిగిరిలో పిల్లలకు శిక్షణ జరుగుతున్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల నివసిస్తున్న 40-45 ఏళ్ల మహిళలు తమకు కూడా కరాటే నేర్పమని అడిగారు. వారికీ నేర్పించాలనుకుంటున్నాం.
మహిళా కండక్టర్లకు శిక్షణ : ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఏ.కె. ఖాన్
మహిళా కండక్టర్ల ఆత్మరక్షణ కోసం వారికి కరాటేలో శిక్షణ నిప్పిస్తున్నట్లు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. మేనేజింగ్ డైరెక్టర్ ఏ.కె. ఖాన్ తెలిపారు. హకీంపేటలోని సిబ్బంది శిక్షణ కేంద్రంలో మహిళా కండక్టర్లకు కరాటే శిక్షణను ఆయన ప్రారంభించారు. కరాటే విద్య ఆత్మరక్షణ కోసం మహిళా కండక్టర్లకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఆత్మరక్షణతో పాటు ఆత్మస్థైర్యం కూడా నింపుతుందన్నారు. మొదటి విడతగా 60 మంది మహిళా కండక్టర్లకు శిక్షణ నిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని ఆరు స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీల్లో కూడా శిక్షణ నివ్వనున్నట్టు చెప్పారు. కరాటే శిక్షణ మూలంగా మహిళా కండక్టర్లు రోజువారీ విధుల్లో ఎదురయ్యే సమస్యలను ఎదిరించడానికి ఉపయోగపడు తుందన్నారు. బస్సులో మహిళా సీట్లలో ఎవరైనా పురుషులు కూర్చుంటే వారిని లేపి, ఆ సీట్లలో స్త్రీలను కూర్చోబెట్టడానికి, ఫుట్‌బోర్డు మీద ప్రయాణం చేస్తున్న, పొగ తాగుతున్న వారిని ధైర్యంగా నివారించే స్థాయి వారికి అలవడుతుందన్నారు. కరాటే నేర్చుకోవడం ద్వారా వారిలో నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయని చెప్పారు.