ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది''... అన్నారు గురజాడ అప్పారావు. ఇది అక్షర సత్యమని చెప్పక తప్పదు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పోటీపడు తున్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఐ.టి) విభాగం లోనూ పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. శాస్త్ర సాంకే తిక రంగాల్లో మహిళల పురోభివృద్ధే దీనికి నిదర్శనం.
జటిలమైన సమస్యలను పరిష్కరించడానికి కంప్యూ టర్ ప్రోగ్రామ్‌లను రాసే స్థాయికి స్త్రీలు ఎప్పుడో ఎదిగారు. సంగీతం సమకూర్చడానికి కంప్యూటర్లను విని యోగించవచ్చనీ, వాటంతట అవే ప్రోగ్రామ్ చేసుకోగల తెలివైన ఎలక్ట్రానిక్ పరికరాలుగా రూపొందించవచ్చనీ ప్రతిపాదించిన అసాధారణ మహిళ... ప్రపంచంలోనే తొలి మహిళా ప్రోగ్రామర్ - అడా అగస్టా లవ్‌లేస్.
ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్, బిల్‌గేట్స్ లాంటి మహా మహుల మేధస్సు స్థాయి (160) కంటే మరో రెండు పాయింట్లు ఎక్కువగా 162 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించిన పన్నెండేళ్ళ నేహా రాము ప్రజ్ఞ మేధా ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. మేధా స్థాయి (ఐ.క్యూ) సూచీలు కొలవడానికి బ్రిటన్‌లోని 'మెన్స' నిర్వహించే 'ఐ.ఐ.ఐ.బి' ఆమె ఈ స్కోరు సాధించింది.
అడా లవ్‌లేస్, నేహా రాము... వీరిద్దరి మధ్య సుమారు 150 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం. ప్రపంచ ఐ.టీ పరిశ్రమ ఇప్పటికీ పురుషుల ఆధిపత్యంలోనే ఉన్నప్పటికీ.. సాంకే తిక సమరాంగణంలో ప్రతిభావంతులైన మహిళా మూర్తులు తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు.
అలాగే, నలభై ఆరేళ్ళ వయస్సులోనే ప్రపంచంలోని 30 అతిపెద్ద సంస్థలలో ఒకటైన హెచ్.పి. సంస్థకు అధినేతగా మారిన కార్లీ ఫియోరినా నుండి అగ్ని-4 క్షిపణి రూపకల్పనకు నాయకత్వం వహించిన 'మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా' టెస్సీ థామస్ వరకు తమ ప్రతిభా పాటవాలు, దార్శనికతలతో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తిమంతుల సరసన సగర్వంగా నిలబడుతున్న మహిళా మణి దీపాలూ ఇవాళ ఎందరో ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాంకేతిక ప్రపంచం లోని ఈ ఉజ్జ్వల తారల గురించి రేఖా మాత్రంగా...
లిండా డిమైచీల్: కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించి స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డి చేసిన లిండా టెక్నాలజీ ప్రపంచంలో అంచెలంచెలుగా ఎదుగుతూ... మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. జావా ఈఈ ప్లాట్‌ఫామ్ గ్రూప్‌లో సీనియర్ ఆర్కిటెక్ట్‌గా కొనసాగుతున్నారు. ఒరాకిల్, జావా విభాగాల్లో లిండా డిమైచీల్ నిష్ణాతులు.
మారిస్సా మేయర్: ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ యాహూకు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మారిస్సా మేయర్ యువ సీఈవోగా రికార్డుల్లో నిలిచారు. ఈమె సింబాలిక్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో డిగ్రీలను పొందారు. గూగుల్‌లో పని చేసిన తొలి మహిళా ఇంజనీర్‌గా మారిస్సా గుర్తింపుపొందారు.
జోసిలిన్ గోల్డ్‌ఫియన్: ఫేస్‌బుక్‌లో డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్న జోసిలిన్ గోల్డ్ ఫియన్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను వృద్ధిచేయటంలో దిట్ట. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన జోసిలిన్ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీని పొందారు.
కిరణ్ మజుందార్ షా: తొలి భారతీయ బయోటెక్ పారిశ్రామికవేత్తగా కిరణ్ మజుందార్ షా గుర్తింపు పొందారు. ఈమె 1978లో బయోకాన్ పేరుతో సంస్థను స్థాపించారు. ఆసియా హెల్త్ కేర్ మ్యాగజైన్ కిరణ్ మజుం దార్ షాను భారతదేశపు గ్లోబల్ మహిళగా గుర్తించింది.
జూలీ లార్సన్ - గ్రీన్: విండోస్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ విభాగాలకు సంబంధించి ఇటీవల అధ్యక్ష హోదాను అధిరోహించిన జూలీ లార్సన్ గ్రీన్ ఆధునిక మహిళా మణులకు ఆదర్శంగా నిలిచారు. ఈమె సాఫ్ట్‌వేర్ ఇంజ నీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ, బిజినెస్ పరిపాలనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీలను పొందారు. విండోస్7, విండోస్8 ఆపరేటింగ్ సిస్టంలకు సంబంధించి ప్రోగ్రామ్ మేనేజి మెంట్, యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్ ఇంకా రీసెర్చ్ తదితర అంశాలకు సంబంధించి లార్సన్ గ్రీన్ పూర్తి బాధ్యత వహిస్తున్నారు.
కార్లీ ఫియోరినా: 1999 జూలై 17న ఒక కొత్త పేరు వెలుగులోకొచ్చింది. అప్పటికే 60 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉండి, ప్రపంచ కంప్యూటర్ రంగంలోని అతి పెద్ద సంస్థలలో ఒకటైన హ్యూలెట్ ప్యాకర్డ్ (హెచ్.పి) తన సంస్థకు ఛైర్మన్ Ê సిఇవోగా ఒక మహిళను ఎంపిక చేసింది. నలభై ఆరేళ్ళ వయస్సులో ప్రపంచంలోని 30 అతిపెద్ద సంస్థలలో ఒకదానికి అధినేతగా మారిన ఏకైక యువతి కార్లీ ఫియోరినా. ఈమె బాధ్యతలు తీసుకున్న తర్వాత హెచ్‌పి గమనాన్ని మార్చివేయడమే గాక కంప్యూటర్ రంగంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అదే సంస్థలో చిన్న ఉద్యోగంతో కెరీర్‌ను ప్రారం భించి... ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ సంస్థలలో రెండవ స్థానంలో వున్న హెచ్‌పికి అధినేతగా మారడం వెనుక ఆమె శ్రమ, కఠోర దీక్ష, పట్టుదలే కారణం. కార్లీ ఫియోరినాను ఇవాళ ఐటీ రంగంలో ఐరన్ లేడీగా పిలుస్తుంటారు.
టెస్సీ థామస్: రక్షణ పరిశోధన - అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ) శాస్త్రవేత్త... ఇండియన్ మిస్సైల్ ప్రాజెక్టు తొలి మహిళా డెరైక్టర్... మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా... టెస్సీ థామస్! గత నవంబర్ 15న ఒడిశా తీరంలోని వీలర్స్ ఐలండ్ నుంచి డిఆర్‌డిఓ ప్రయోగించిన భారత ఉపరితల క్షిపణి 'అగ్ని-4'ను వృద్ధి పరిచింది టెస్సీ, అమె బృందం. కేరళకు చెందిన టెస్సీ థామస్‌ను డిఆర్‌డిఓలో శాస్త్రవేత్తలు, భారత రాజకీయ రంగ ప్రముఖులు ''రాకెట్ లేడీ'' సంబోధిస్తారు. డి.ఆర్.డి.ఓలో టెస్సీ థామస్ ప్రస్థానం మరో రెండేళ్లలో రజతోత్సవానికి దగ్గరవుతుంది. ఇదంతా వృత్తిపట్ల అంకితభావంతో టెస్సీ వెనకేసుకున్న సంపద. ''ఎంతో కష్టపడి సాధించుకున్న కెరీర్‌ను కూడా పెళ్లి తర్వాత అమ్మాయిలు వదిలేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ప్రతిభను నిరూపించుకునే క్రమంలో చిన్నచిన్న ప్రతిబంధకాలను సవాల్‌గా తీసుకోవాలి'' అంటారు టెస్సీ.
ఆధునిక ప్రపంచంలో శక్తిమంతులుగా ముందుకు సాగుతున్న వీరందరికీ జేజేలు!