కనిపించని కష్టం, అగుపించని స్థానం

రైతుపడే కష్టం, ఆరుగాలం శ్రమించే రైతు చిందించే చెమట అనగానే పురుషుడే కళ్ల ముందు కదలాడతాడు. కానీ, మహిళా రైతు గురించి అందరూ మరిచిపోతున్నారు. పల్లెల్లో చాలావరకూ శ్రమ మహిళా రైతుదే! కూలీకి వెళ్ళే మహిళలే కాదు సొంత పొలమున్నా బాధ్యత మహిళలదే! నిద్ర లేవగానే వంట చేసి క్యారేజీలు సర్దుకొని పొలానికి వెళ్లేది భర్త కాదు, ఆ పొలమున్న ఇల్లాలే! కూలీలతో కలిసి నిత్యం పొలం పని చేసేది ఆమే! ఏ సమయంలో ఏ పనిచేస్తే బాగుంటుందో ప్రణాళికలు వేసేదీ ఆవిడే! ఇన్ని చేస్తున్నా ఆమెకు గుర్తింపు శూన్యం. పొలం పని భార్యకు వదిలిపెట్టి మధ్యలో ఓ సారి వచ్చిపోయే రైతులు చాలామంది ఉన్నారు. తాగుడు, పేకాటలో పొద్దుపుచ్చేవాళ్లూ కద్దు. అదీ కాదంటే నలుగురితో కబుర్లు చెబుతూ కాలం వెళ్లమార్చేవాళ్లూ ఉన్నారు.

అయినా, మహిళల గురించి ఎవరూ మాట్లాడరు. రైతుల కష్టాల గురించి మాట్లాడాలంటే పత్రికలు, ఛానెళ్లలో పురుషుల తోనే చర్చిస్తారు తప్ప మహిళల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోరు. నిజానికి, పొలంతో ప్రత్యక్ష సంబంధం, అనుబంధమున్నది స్త్రీలకే!

గత ఏడాది మన దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా కురిశాయి. వర్షాభావం కారణంగా అనేకచోట్ల పంటలు సరిగ్గా పండలేదు. ఇక రైతుల ఆత్మహత్యలు రోజూ పత్రి కల్లో చదువుతూనే ఉన్నాం. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పొలంలో పడి రాత్రింబగళ్లూ కష్టించే మహిళ గురించి మాత్రం ఎవరూ మాట్లాడడంలేదు. పొలం పని గురించి ఆలోచిస్తే అందులో ఎక్కువ శాతం మహిళే చేస్తుందనేది ఎవరికైనా తట్టే విషయం. సాక్షాత్తూ ప్రభుత్వ లెక్కల ప్రకారం, 79 శాతం పొలం పని గ్రామీణ మహిళలపైనే ఉందనేది గుర్తించాల్సిన వాస్తవం. 9 శాతం మహిళలకు మాత్రమే సొంత పొలం ఉంది. మిగతావారంతా ఇతరుల పొలాల్లో కూలీ పనికి వెళ్లేవారే!

పొలంపని ఓ పద్ధతి ప్రకారం జరిగేది కాదు. దానికెన్నో వనరులు సమకూరాలి. నీళ్లు, ఎరువులు, విత్తనాల లాంటి అంశాలన్నింటితోనూ ముడిపడి ఉన్న పని అది! వీటన్నింటి మధ్యా వాళ్ళు నలిగిపోతుంటారు. అన్నింటినీ సమీకరించుకుని పొలం పనిని నడిపిస్తుంటారు. అయినా సరే, వాళ్లు రైతులు కారు! ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నీ పురుషులకే అన్నట్లుంటాయి తప్ప, మహిళలకు ఉద్దేశించినట్లుండవు.

పాల ఉత్పత్తినే తీసుకుందాం.

కొన్ని లెక్కల ప్రకారం, 93 శాతం పాల సేకరణలో మహిళలే భాగస్వాములు. పాల ఉత్పత్తి రంగంలో కోటిన్నర మంది మహిళలు మమే కమై ఉన్నారు. పశువుల మంచీచెడు చూసు కోవడం, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడం, వాటికి గడ్డి వేయడం, పాలు పితకడం, అవి తీసు కెళ్లి పాలకేంద్రానికి పోయడం వరకూ ప్రతి అడుగూ మహిళదే బాధ్యత. కానీ, వస్తున్న లాభం, దొరికే ప్రయోజనాల్లో వారికెంతవరకూ చేరుతున్నాయనేది ప్రశ్నార్థకమే!

ఎన్నో తరాలుగా మన దేశంలో ఇదో సంస్కృతిగా సాగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది. ఆర్థిక సాధికారత లేనినాడు ఎంత కష్టం చేసినా మహిళలకు గుర్తింపు లభించడం శూన్యం. ఏ చిన్న విషయంలోనూ ఆమెకు విలువ ఉండదు. హక్కులుండవు. ఆమె అభిప్రాయాలను స్వీకరించడమనేదే ఉండదు. ఇంకా చెప్పాలంటే, ఆమెను ఓ మనిషిగా గుర్తించడమే ఉండదు. నిజానికి, మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడినంత మాత్రాన ఆమె మాటలకు విలువ లభించేస్తుందనుకోవడమూ పొరపాటే! అయినా, ఆర్థిక స్వాతంత్య్రం ఆమెకు కొంతయినా ధైర్యాన్నిస్తుందనేది నిజం.

నేడు మహిళలపై అనేక రకాల వేధింపులు, హింస, అత్యాచారాలు జరుగు తున్నాయి. పత్రికల్లో, ఛానళ్లలో కనిపించి, వినిపించేవి వదిలిపెడితే... బయటకు తెలియనివి మరెన్నో ఉంటాయి. మహిళలు బయటికి వెలిబుచ్చుకోలేనివి, సర్దుకుపోయేవి ఎన్నో బాధలు ఉన్నాయి. ఢిల్లీలోని 'నిర్భయ' లాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ ప్రతిఘటించడం, వ్యతిరేకతను వెలిబుచ్చడం సరే!

మరి, ఘోరాలు జరుగుతున్నా సర్దుకుపోయే, రగులుతున్న బడబాగ్నులను మదిలోనే దాచుకునే వారి గురించి కూడా ఆలోచించాలి. ఇవి పోలీసుల రికార్డులకు ఎక్కవు. ప్రభుత్వం లెక్కల్లోకి రావు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అత్యాచారాల్లో ఎక్కువ శాతం భూమితో ముడిపడి ఉంటాయి. మహిళలకు భూమిలోనూ, ఆర్థిక విషయాల్లోనూ భాగం రావాలి. మహిళలకు భూమి పుట్టింటి నుండి ఆస్తిగా వచ్చినా బలవంతంగా తమ పేర రాయించుకునే వాళ్లే మన దేశంలో ఎక్కువ. ఇక, పొలాన్ని స్త్రీల పేర పెట్టమంటే ఎంతగా అల్లల్లాడిపోతారో!

మనం బడ్జెట్‌ గురించి, ఆర్థికపరమైన కేటాయింపుల గురించి ఎడతెరిపి లేకుండా మాట్లాడుకుంటాం. వీటన్నింటికీ, మహిళ స్థితిగతులకూ సంబంధం ఉందనేది మాత్రం గ్రహించం. వ్యవసాయం గురించి మాట్లాడతాం. కానీ, అందులో నిరంతరం శ్రమించే మహిళల గురించి మాత్రం మాట్లాడం. కనీసం, ఇకనైనా ఆ పని చేద్దాం. వ్యవసాయంలో ఆమె తోడ్పాటును గుర్తిద్దాం. ఆమెకు వెన్నుదన్నుగా నిలుద్దాం. అన్నం పెడుతున్న రైతమ్మ కూ వందనమందాం! - జీవన డెస్క్‌