ఘుమ ఘుమ లాడే కాఫీ రుచిని...కమ్మని కాలేజీ రోజుల్ని...ఆయన సినిమాలు గుర్తుకుతెస్తాయి. కొత్త వాళ్లతో సరికొత్త ఆనందాల్ని తెరపై నింపగల దర్శకుడు ఆయన. అలాంటి దర్శకుడి నుంచి భిన్నంగా..విభిన్నంగా 'లీడర్' తెరకెక్కబోతున్నాడు. తీసింది నాలుగు సినిమాలే కావచ్చు...తనకంటూ ఓ ఒరవడీ..నడవడీ..సృష్టించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల.కథనాల్ని చూపడంలోనే కాదు..కథానాయకుల్ని ఎంపిక చేసుకోవడంలోనూ ఆయనది ప్రత్యేక తరహానే. డాలర్‌డ్రీమ్స్ వంటి ఆంగ్ల చిత్రాన్ని తన స్నేహితులతో నిర్మించి దర్శకుడిగా గుర్తింపు పొందాడు. తెలుగులో ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ చిత్రాల ద్వారా సామాన్య ప్రేక్షకుడికి మరింత దగ్గరైయ్యాడు. తాజాగా డి.రామానాయుడు మనవడు రామానాయుడు (రానా)తో ఏవీఎం. సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న 'లీడర్' చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజకీయ నేపథ్యంలో రూపొందిన 'లీడర్' ఈ నెల 19న విడుదలవుతోంది. తమ 'లీడర్' అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందంటున్న శేఖర్ కమ్ముల ప్రజాశక్తితో మరిన్ని వివరాలు చెబుతున్నారు..
రాజకీయాల్లో ఉండాల్సిన కొత్తదనం గురించి ఏం చెబుతున్నారు. ?
రాష్ట్రం లోనేకాదు, దేశంలోనూ సరైన లీడర్ ఎలా ఉండాలబ నేది నిర్వచించాం. అలా అని ఇందులో ఏ పార్టీని విమర్శించలేదు.
ఏ రాజకీయపార్టీని గానీ, వ్యక్తుల్నిగానీ తిట్టలేదు. ఎవరినో ఏదో తిట్టేసి....ఆ తర్వాత ఏదో సందేశం ఇచ్చేసే చిత్రాలు నేను తీయను. ప్రధానంగా దేశం ఎదుర్కొంటున్న సమస్య అవినీతి. ఇది లేకపోతే దేశం మరింత అభివృద్ది చెందుతుంది. అందుకే రెండూ ఒకేచోట ఉండజాలవనే చెప్పే చిత్రం. ఇంతవరకు రాని కథాంశం.
ఈ చిత్రం తీయడానికి కారణం ఏంటి ?
హ్యాపీడేస్ తర్వాత దాదాపు రెండేళ్ళు ఖాళీగా ఉన్నానని చాలామంది అడుగుతుండేవారు. ఈ గ్యాప్‌లో ఎన్నో మార్పులు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. అప్పుడే ఎలక్షన్లు జరగడం వాటిపై మీడియాల్లో వస్తున్న రకరకాల కథనాలను పరిశీలించాను. ఆ నేపథ్యంలోనే పుట్టిన ఆలోచన లీడర్.
లీడర్‌కు ఉండాల్సిన లక్షణాలేమిటని చెప్పబోతున్నారు?
రాజకీయనాయకుడికి, లీడర్‌కు ఉన్న తేడా ఏమిటో చూపించే ప్రయత్నం చేశాను. దేన్నైనా వృత్తిగా స్వీకరిస్తే దాన్ని కమిట్‌మెంట్‌తో పనిచేయాలి. ఒకప్పుడు రాజకీయ నాయకుల్ని ఆదర్శంగా తీసుకునేవారు.
అలాంటివారు తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో లీడర్ ఎలా ఉండాలనేది చూపించాను.
కథాపరంగా ఎటువంటి కృషిచేశారు?
రాజకీయ చిత్రమైనా కొద్దోకొప్పో నాకూ వాటిపై అవగాహన ఉంది. ఇప్పుడున్న రాజకీయాల్లో మార్పురావాలను కునేవారిలో నేనూ ఒకడిని. ఈ సబ్జెక్ట్‌కోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. సమాజాన్ని, రాజకీయాల్ని నిరంతరం గమనిస్తూ ఉంటే చాలు.
రానాను ఎంపికచేసుకోవడానికి గల కారణం?
నేను కథను సిద్ధంచేసుకున్నాక రానాను కలిశాను. కథరీత్యా కొత్తవారైతే బాగుంటుందనిపించింది. ఇమేజ్ ఉన్న హీరోలు చేస్తే అవి ఒక డ్రీమ్‌లా ఉంటాయి. ఇది డ్రీమ్‌కాదు సత్యం అని చెప్పాలంటే కొత్త నటుడే చేయాలి.
ఏవీఎం సంస్థలో చేయడం పట్ల ఎలా ఫీలవుతున్నారు?
ఏవీఎంలో 174వ సినిమా ఇది. చాలా ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. దర్శకుడిగా పూర్తి స్వాతంత్య్రాన్ని ఇచ్చారు.
ఆనంద్- మంచి కాఫీలాంటి సినిమా అన్నారు. మరి లీడర్‌ను ఎలా పోలుస్తారు?
ఈ సినిమా చూశాక సెన్సార్ సభ్యులు ఎంతో అభినందించారు. నా సినిమాలకు ఏదో కాప్షన్ పెట్టడంతోపాటు నేను బంధువులతో పోలుస్తాను. లీడర్‌ను నా తల్లిలాంటి సినిమా అని భావిస్తాను. తల్లిలా వేలు పట్టుకుని నడిపించింది. నేటి సమాజానికి అవసరమైన సినిమా ఇది.
తదుపరి చిత్రాలు?
హ్యాపీడేస్‌ను హిందీలో చేయడమే తర్వాత చేసే పని.