వినాయకుడు సినిమాతో లవర్‌బాయ్ గా తెలుగు తెరకు పరిచయమైన నటుడు సూర్యతేజ్. శంభో శివ శంభో సినిమాలో ఎంపి తనయుడిగా వైవిధ్యమైన పాత్రను పోషించాడు. ఇటీవలే ఫ్రెండ్స్‌బుక్ చిత్రంలో టీం లీడర్‌గా ఒక కీలకమైన పాత్రను పోషించి, ప్రేక్షకులను మెప్పు సంపాదించాడు. ఈరోజు సూర్యతేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన సినీ జీవితం గురించి మీడియాతో ముచ్చటించారు. వాటి విశేషాలు...
*మాది శ్రీకాకుళం జిల్లా రాజం పట్టణం. పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. మా నాన్నగారు హైకోర్ట్ లాయర్‌గా పనిచేస్తున్నారు. ఫిల్మ్ ఇండిస్టీలో నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. మొదట సినిమాలోకి వస్తానంటే అమ్మానాన్న వద్దన్నారు. తర్వాత కొన్ని నెలల ప్రయత్నం తర్వాత, బోజపూరి అనే సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత ఫిల్మ్ స్కూల్‌లో యాక్టింగ్ నేర్చుకున్నా.
*బోజపూరి సినిమా తర్వాత హ్యాపీడేస్ ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు నన్ను పిలిచారు. కానీ అవకాశం చేజారిపోయింది. సాయికిరణ్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల 'వినాయకుడు'లో అవకాశం దక్కింది. తర్వాత 'శంభో శివ శంభో', 'రామ్ బలరామ్', 'క్రికెట్ గర్ల్స్' వంటి చిత్రాల్లో నటించాను. 'భలేమొగుడు-భలే పెళ్లాం' చిత్రంలో సుహాసినీ గారికి బారుఫ్రెండ్‌గా చేశాను. ఆ క్యారెక్టర్ ఇప్పటికీ మరిచిపోలేను. ఇప్పుడు మా అమ్మానాన్న నుంచి కూడా మంచి సహకారం అందుతోంది.
*'అయోధ్య' అనే సినిమాను నా స్నేహితులు తీశారు. అప్పుడు ఆ సినిమాకి ప్రొడక్షన్ వర్క్ అంతా నేనే చూశాను. అలా సినిమాతో, సినిమాల్లో నటించాలనే ఆశ నాలో కలిగింది.
*ఇప్పటివరకూ నేను చేసిన బ్యాడ్ బాయ్ , లవర్‌బాయ్ క్యారెక్టర్స్...ఓ రకమైన గుర్తింపును తెస్తే, ఫ్రెండ్స్‌బుక్‌లో చేసిన క్యారెక్టర్ మంచి టర్నింగ్ ఇచ్చిందనే చెప్పాలి. ఆర్.పి.పట్నాయక్‌గారు మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్. తీసినవి మూడు సినిమాలే అయినా మంచి గుర్తింపును తెచ్చాయి. అందులో రెండు సినిమాలకు అవార్డులు కూడా వచ్చాయి.
*కోట శ్రీనివాసరావు, చిరంజీవి...వారి నటన బాగా నచ్చుతుంది. వారిలాగా ఛాలెంజింగ్ క్యారెక్టర్ రోల్స్ చేయాలని ఉంది. చిన్నా, పెద్దా..అన్న తారతమ్యాలు లేకుండా మంచి సినిమా అంటే చాలు.
*తమిళంలో ముగపుస్తకం, కన్నడలో ఒక ఆఫర్ రెడీగా ఉంది. ముగపుస్తకం తర్వాత తెలుగులో కొనసాగుదామని అనుకుంటున్నా.
*సూర్యతేజ అనే వాడు మంచి నటుడు...అన్న గుర్తింపు ప్రేక్షకుల మదిలో సంపాదించాలి. నిదానమే ప్రధానం. ఏదైనా చేసే ముందు బాగా ఆలోచిస్తాను. దీంతో కొంత గ్యాప్ వస్తోంది.