కృష్ణా, గోదావరి గ్యాస్‌ను జెన్‌కోకు కేటాయించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఐక్యకార్యాచరణ సమితి(టిజాక్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. డిస్కాంకు సంఘీభావంగా రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి అసలైన కారణాలను ప్రజలకు తెలియజెప్పాలని టిజాక్ ఆధ్వర్యంలో మింట్ కాంపౌండులోని ఎపిసిపిడిసిఎల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద గురువారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిజాక్ స్టీరింగ్ కమిటీ ప్రతినిధి కె.రఘు మాట్లాడుతూ ప్రభుత్వం జెన్‌కోను నిర్లక్ష్యం చేయడమే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి ప్రధాన కారణమన్నారు. కెజి బేసిన్ గ్యాస్‌ను ల్యాంకో, వేమగిరి లాంటి ఆంధ్రా పెట్టుబడిదారులకు అప్పచెప్పారన్నారు. వాళ్లు రాష్ట్ర ప్రజల అవసరాలను విస్మరించి ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇంతేకాకుండా రాబోయే సమీప కాలంలో దాదాపు 7500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం కెజి బేసిన్ వాడకానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వివరించారు. ఈ విధంగా పెట్టుబడిదారులు భారీఎత్తున విద్యుత్ దోపిడీకి పాల్పడుతున్నారని తెలిపారు. కెజి బేసిన్ గ్యాస్ జెన్‌కోకు అప్పజెప్పితే రాబోయే మూడేళ్లలో పదివేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే సామర్థ్యం జెన్‌కోకు ఉందన్నారు. తద్వారా తెలంగాణాలో ఐదువేల మందికి, ఆంధ్రప్రాంతంలో 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించొచ్చని తెలిపారు. కెజి బేసిన్ గ్యాస్‌ను జెన్‌కోకు కేటాయిస్తూ వెంటనే ఆదేశాలు జారీచేయాలని డిమాండ్ చేశారు. ల్యాంకో, వేమగిరి తదితర ప్రయివేటు కంపెనీలు రాష్ట్రానికే విద్యుత్‌ను అమ్మేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అందుకు విద్యుత్ చట్టం 11 ప్రకారం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి నదిపై దుమ్ముగూడెం, కాంతాలపల్లి ప్రాజెక్టులను ప్రభుత్వం బిఓటి పద్ధతిన ప్రయివేటు వ్యక్తులకు కట్టపెట్టడాన్ని వ్యతిరేకించారు. ఈ పద్ధతిన ప్రాజెక్టులు నిర్మిస్తే గోదావరి జలాలపై అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు తెలంగాణ ప్రజలకు హక్కులు కోల్పోయే ప్రమాదముందన్నారు. నీళ్లు ఇరిగేషన్‌కు వాడాలా విద్యుత్‌కు వాడాలా అనేది ప్రయివేటు పెట్టుబడుదారులు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. తక్షణమే బిఓటి పద్ధతిని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులను జెన్‌కోకు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేయాలని కోరారు. రాష్ట్రంలో ఆంధ్రా పెట్టుబడిదారుల విద్యుత్ దోపిడీ, తెలంగాణ ప్రాంతంలో జరిగిన అన్యాయం, 610 జిఓ అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, కెజి బెసిన్‌లో దోపిడీ తదితర అంశాలపై 168 పేజీల నివేదికను శ్రీకృష్ణ కమిటీకి నివేదించారు. కమిటీకి తప్పుడు సమాచారం వెల్లకుండా నివారించడానికే వాస్తవాలతో తాము నివేదికను అందచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్‌రెడ్డి, జానయ్య, శివాజీ, కిరణ్‌కుమార్, వెంకటనారాయణ, చంద్రయ్య తదితరులు ప్రసంగించారు.
వాటర్ బోర్డులో కలకలం
అంతర్యుద్ధం - ఆధిపత్య పోరు
ఆర్థిక ఇబ్బందులతో .. కుటుఉంబ ఆత్మహత్య
వాటర్‌బోర్డులో కంట్రోల్ రూం ఏర్పాటు
ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన వారికి ఉచిత మందులు
సినారే జన్మదిన వేడుకలు భలే మంచిరోజు- పసందైనరోజు
హుస్సేన్‌సాగర్ వద్ద 92.7ఎఫ్ఎమ్ ఆధ్వర్యంలో మారథాన్ 92.7
విద్యార్థుల పురోభివృద్ధిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి : కలెక్టర్
జంక్షన్లలో 275 ట్రాఫిక్ గొడుగులు