గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)లో కోట్లాది రూపాయల వాహన విడిభాగాల (స్పేర్‌పార్ట్స్) కుంభకోణం వెలుగుచూసింది. చాలాకాలంగా ఈ తతంగం నడుస్తున్నా, పట్టించుకున్న నాధుడు లేకపోవడంతో అవినీతిపరుల ఆటలు కొనసాగుతూనే ఉన్నాయి. కార్పొరేషన్‌లోని చెత్త తరలింపు వాహనాలతో సహా అధికారుల కార్లు, వ్యాన్‌లకు మరమ్మతుల పేర బినామీ ఏజెన్సీల పేరుతో స్పేర్‌పార్ట్స్ సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించి కార్పొరేషన్ ఖజానాను భారీగా కొల్లగొట్టారు. కొందరు ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులు కూడా ఈ కుంభకోణంలో సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతుండగా కొందరు అధికారులు అడ్డుతగిలి ఆ నివేదిక బహిర్గతం కాకుండా అడ్డుకుంటున్నట్లు తెలిసింది. అంతా తామై వ్యవహరిస్తోన్న కొన్ని అవినీతి తిమింగలాలకు కార్పొరేషన్‌లో పట్టిందల్లా బంగారంగా మారింది. ఇటీవల ట్రాన్స్‌పోర్ట్ విభాగం తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న విషయం తెలిసిందే. పలుమార్లు డీజిల్ దొంగలు పట్టుబడ్డారు. ఇప్పుడు స్పేర్‌పార్ట్స్ దొంగల అంతుచూసేందుకు కమిషనర్ సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. గతంలోనే అనేకమార్లు ఈ కుంభకోణాలకు సంబంధించి పత్రికల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశాలపై కమిషనర్ సమీర్‌శర్మ ఇప్పటికే విజిలెన్స్ నివేదికను పరిశీలించి, ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇంటిదొంగలను నేరుగా కట్టడి చేయలేమనే ఉద్దేశ్యంతో మధ్యే మార్గంగా కార్పొరేషన్ వాహనాల మరమ్మత్తులు, డీజిల్ వాడకం తదితర అంశాలపై థర్డ్‌పార్టీతో క్వాలిటీ చెకింగ్‌కు ఆదేశించారు. ఈ మేరకు సిఐఆర్‌టి నిబంధనలకు లోబడి ఉన్న ప్రైవేటు ఏజెన్సీల నుండి 'ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్'కు దరఖాస్తులను ఆహ్వానించారు. దీనికోసం ఈనెల 18 నుండి 29వ తేదీ వరకు దరఖాస్తులు ఇస్తామని, 30వ తేదీలోపు వాటిని కార్పొరేషన్‌లోని సూపరింటెండెంట్ ఇంజనీర్ (ట్రాన్స్‌పోర్ట్)కు అందచేయాలని కోరారు. ఇప్పటికే కమిషనర్ ప్రత్యేక బృందాల ద్వారా పలు బోగస్ ఏజెన్సీల వివరాలను సేకరించినట్లు సమాచారం. వీటన్నింటినీ ప్రత్యేకంగా ఆడిట్ చేయించాలని నిర్ణయించారు. అదే సందర్భంలో ఆయా ఏజెన్సీల చిరునామాల వెరిఫికేషన్, డ్రా చేసిన మొత్తాలు, బోగస్ బిల్లులు వంటి పలు అంశాలకు సంబంధించి ఆధారాలు ఇప్పటికే కమిషనర్‌కు అందినట్లు తెలిసింది. థర్డ్‌పార్టీ ఏజెన్సీలను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసి వీటి అసలు గుట్టును విప్పేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒకే అడ్రస్‌పై ఏడెనిమిది బోగస్ ఏజెన్సీలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా చిరునామాల్లో ఎలాంటి దుకాణాలు లేవని నిర్ధారణకు వచ్చారు. కార్పొరేషన్‌లోని కొందరు అధికారులు, ఉద్యోగులే బినామీ పేర్లపై బోగస్ ఏజెన్సీలను ఏర్పాటు చేసి ఖజానాను కొల్లగొట్టినట్లు వెల్లడైంది. అప్పటికప్పుడు ఏజెన్సీలను రిజిస్టర్ చేయడం, ఆ మరుసటిరోజు నుండే కార్పొరేషన్‌కు స్పేర్‌పార్ట్స్ సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించడం వంటి విషయాలు కమిషనర్ పరిశీలనలో వెల్లడయ్యాయి.
కమిషనర్ దృష్టికి వచ్చిన కొన్ని ఏజెన్సీల వివరాలు
విఎన్‌జి ఎంటర్‌ప్రైజెస్, రాఘవేంద్ర ఎంటర్‌ప్రైజెస్, శ్రీగణేష్ ఆటోపార్ట్స్, అయ్యప్ప మోటార్స్, అమృత ఆటోమోబైల్స్, కన్నయ్య ఆటోమోబైల్స్, ఎల్‌ఎన్ మోటార్స్, వెంకటేశ్వర ఆటో సర్వీసెస్, భవాని మోటార్స్, విక్టోరియా ఆటోమోబైల్స్ వంటివి ఉన్నాయి. దాదాపు వందకుపైగా ఏజెన్సీలు కార్పొరేషన్‌కు స్పేర్‌పార్ట్స్ సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్‌పోర్ట్ విభాగంలోని బిల్లులు చెప్తున్నాయి. వీటన్నింటిపై పూర్తిస్థాయి విచారణ జరిపాలని, బోగస్ అని తేలితే సంబందిత ఏజెన్సీలతోపాటు ట్రాన్స్‌పోర్ట్ విభాగంలోని అధికారులపై కూడా పోలీసు కేసులు నమోదుచేసి, డ్రా చేసిన ప్రజాసొమ్మును రికవరీ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం.
వాటర్ బోర్డులో కలకలం
అంతర్యుద్ధం - ఆధిపత్య పోరు
ఆర్థిక ఇబ్బందులతో .. కుటుఉంబ ఆత్మహత్య
వాటర్‌బోర్డులో కంట్రోల్ రూం ఏర్పాటు
ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన వారికి ఉచిత మందులు
సినారే జన్మదిన వేడుకలు భలే మంచిరోజు- పసందైనరోజు
హుస్సేన్‌సాగర్ వద్ద 92.7ఎఫ్ఎమ్ ఆధ్వర్యంలో మారథాన్ 92.7
విద్యార్థుల పురోభివృద్ధిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి : కలెక్టర్
జంక్షన్లలో 275 ట్రాఫిక్ గొడుగులు