షోరూము డీలర్ల నెత్తిన లక్షల టోపీ

  • అంతరాష్ట్ర మోసగానికి సంకెళ్లు

    పదవ తరగతి వరకు చదువుకున్న యువకుడు ఏకంగా కార్లు షోరూము డీలర్లను తన అతి తెలివితేటలతో మోసం చేసి లక్షల రూపాయలు డండుకున్నాడు. వరుసగా మోసాలకు పాల్పడుతూ చివరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కాడు. మోసం సొమ్ముతో 26 లక్షలకు ఫ్లాటు, బంగారు నగలు, ఖరీదైన గృహౌపకరణాలు కొనుగోలు చేసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ డిసిపి కమలాసన్‌రెడ్డి ఈ ఘరానా మోసగాని వివరాలు వెల్లడించారు. బెంగుళూరుకు చెందిన మహ్మద్‌ సలీం(27) పదవ తరగతి వరకు చదుడువుకున్నాడు. అనంతరం బెంగుళూరులోని ఓ బట్టల షాపులో పనిచేశాడు. 2005లో కుటుంబంతో కలిసి నగరానికి వలస వచ్చి సలాల బర్కాస్‌లో స్థిరపడ్డాడు. గతంలో బెంగుళూరులోఉన్న సమయంలో ఓ నేరం చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. మరో సారి పోలీసులకు పట్టుబడకుండా నేరాలు చేసి సులభంగా డబ్బు సంపాదించాలని పథకం రూపొందించుకున్నాడు.

సలీం నేరం చేసే విధానం

    మొదట నగరంలోని ఏదో ఒక చోట బట్టల దుకాణం పేరుతో షాపును లీజ్‌కు తీసుకుంటాడు. ఆ షాపు పేరుతో ల్యాండ్‌లైన్‌ తీసుకుంటాడు. తన మరదలి ఫొటోను అతికించి మారుపేరుతో పాన్‌ కార్డును తీసుకుంటాడు. అనంతరం నకిలీ పత్రాలతో బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తాడు. దగ్గరలో ఉన్న కార్ల షోరూముకు వెళ్లి ఐదు వేలు డ్వాన్స్‌ చెల్లించి కారును బుక్‌ చేస్తాడు. రెండు రోజుల తరువాత షోరూముకు వెళ్లి కొన్ని సమస్యల వల్ల తాను డబ్బు చెల్లించలేని స్థితిలో ఉన్నాననీ, తన అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వాలని కోరుతాడు. షొరూముకు చెందిన సిబ్బంది చెక్‌ రూపంలో వెనక్కి ఇస్తారు. చెక్‌తో ఇంటికి వచ్చిన సలీం చెక్‌పై ఉన్న ఐదు వేల నగదు అంకెలను బ్లేడుతో తుడిచి లక్షల రూపాయలను వేసుకొని బ్యాంకులో వేస్తాడు. ఇలా హైదరాబాద్‌, విజయవాడల్లో 2009 మే నుండి ఇప్పటి వరకు వరుణ్‌ మోటార్స్‌, ఫార్చూన్‌ ఆటో మొబైల్స్‌, ఆటోమోటివ్‌ మానుఫాక్షరర్స్‌, టాటా మోటార్స్‌, చెన్నైలోని ఇండియా గ్యారేజ్‌, సుందరం మోటార్స్‌ షోరూముల్లో 36 లక్షలు మోసం చేశాడు. తమ కంపెనీ ఖాతాలో నుండి ఎక్కువ డబ్బులు డ్రాకావడంతో షోరూము యజమానులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ కేసును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అప్పగించారు. పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సయ్య నిందితునిపై నిఘా పెట్టి పట్టుకున్నారు. అతని వద్ద నుండి ఫ్లాట్‌కు చెందిన డాక్యుమెంట్లు, 14 తులాల బంగారు నగలు, ఎల్‌సిడి టివి, 20 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని తదుపరి విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్