జిఓ 152తో ముప్పు

  • కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత లేదు
  • రెగ్యులర్‌ చేయాలన్న డిమాండ్‌ భేఖాతరు
  • కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం
  • ఇఎస్‌ఐ, పిఎఫ్‌ అమల్లో అవకతవకలు
  • జులై 29 సదస్సుకు విస్తృత ప్రచారం

ఉద్యోగులపట్ల రాష్ట్ర ప్రభుత్వం రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తోంది. ఒక పక్క అందరికీ ఉద్యోగాలంటూ ఢంకా బజాయించి చెబుతోంది. మరోపక్క ఉన్న ఉద్యోగాలకు ఎసరుపెట్టే జిఓలు తీసుకొస్తోంది. ఇదీ ప్రభుత్వ ద్వంద్వ నీతి. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి ఎక్కడ మాట్లాడినా 'మా ప్రభుత్వం చెప్పింది చేయడమే కాదు.. చెప్పంది కూడా చేస్తోందని' పదేపదే మాట్లాడుతున్నారు. నిజమే.. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేస్తామన్న ప్రభుత్వం ఆపని చేయలేకపోయింది. చెప్పంది మాత్రం ఖచ్చితంగా చేస్తోందని జిఓ 152 ద్వారా నిరూపించుకుంది. దీంతో కిరణ్‌ సర్కార్‌ చేయాల్సింది చేయకుండా చేయకూడనిది చేయడంలో దిట్ట అనిపించుకుంది.

జిఓ 152 ఉద్యోగులకు నష్టమా?

కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిఓ 152 తెచ్చింది. 1.16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు జిఓ 152 తెచ్చిందని ఉద్యోగుల ఫెడరేషన్‌ మండిపడుతోంది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగించే ఈ చర్య చాలా అన్యాయమని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తున్న వారు 5.5 లక్షలకు పైగా ఉన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో 160 ప్రభుత్వ శాఖల్లో సుమారు 20 వేల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, టైం స్కేల్‌, క్యాజువల్‌, దినసరి, పార్ట్‌టైం తదితర పద్ధతుల్లో పనిచేస్తున్నారు. రాష్ట్ర సచివాలయంలో 95 శాతం మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే ఉన్నారు. ముఖ్యమంత్రి పేషీ మొదలు, జిహెచ్‌ఎంసి కార్యాలయం వరకు అంతటా ఇదే పరిస్థితి. వీరిని క్రమబద్ధీకరించాలని అనేక విన్నపాలు, ఉద్యమాలు జరిగాయి. అయినా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఫెడరేషన్‌ నాయకులు అంటున్నారు. ఉన్న ఉద్యోగులను క్రమబద్ధీకరించకుండా, కొత్త ఉద్యోగాలు ఎలా ఇస్తారని అడిగితే ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు. ఔట్‌ సోర్సింగ్‌ విధానం వల్ల ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నారు. దీనికి ప్రభుత్వ విధానమే కారణమంటున్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రమూ చిత్తశు ద్ధి ఉన్నా ఈ విధానం రద్దు చేసి ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, అప్పటివరకు రెగ్యులర్‌ ఎంప్లాయీస్‌కిచ్చే వేతనాలు, బెనిఫిట్లు ఇవ్వాలని, కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌, కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం 2004 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులరైజ్‌ చేస్తుందన్న ఆశతో 10-15 సంవత్సరాలుగా పనిచేస్తున్నవారున్నారు. ఏజెన్సీలు ఇఎస్‌ఐ, పిఎఫ్‌ వంటి సౌకర్యాలు సక్రమంగా అమలు జరపడం లేదని, కొన్ని ఏజెన్సీలు ఉద్యోగులు, కార్మికుల నుంచి పిఎఫ్‌ పేరుతో వసూలు చేసిన డబ్బులను ఖాతాలో జమ చేయకుండా బోర్డులు తిప్పేసిన ఘటనలు నగరంలో గతంలో జరిగాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తించింది తప్ప బాధ్యతగా వ్యవహరించలేదనే విమర్శలు ఉన్నాయి. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల చేత రోజుకు 10-12 గంటలు, సెలవు రోజుల్లోనూ పనిచేయించుకుంటున్న అధికారులు, ప్రభుత్వం ఈ క్యాడర్ల సమస్యను పట్టించుకోవడంలేదని శాసనమండలిలో గతంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్లు తెలిసింది. అయినా ప్రభుత్వం వీరిచేత వెట్టిచాకిరీ చేయించుకుంటుందనే విమర్శలున్నాయి. ఇన్ని ఇబ్బందుల్లో సైతం కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, ఏదో ఒక రోజు రెగ్యులర్‌ అవుతుందన్న చిరు ఆశతో పట్టుదలతో పనిచేస్తున్నారు.

ఐక్య పోరాటాలకు సన్నద్ధం

ఈ నెల 29న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సదస్సుకు విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ సదస్సులో వివిధ ఉద్యోగ జెఎసిల నాయకుల పాల్గొంటున్నట్లు తెలిసింది. ఇందులో పలు ఆందోళనా కార్యక్రమాలను ప్రకటించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నాటికి ప్రభుత్వం ఏదో ఒకటి ప్రకటించేవరకు ఐక్య ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్‌ చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. రెగ్యులరైజ్‌ అయ్యేలోపు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు డిఎ చెల్లించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో షెడ్యూల్‌ పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా కరువు భత్యం చెల్లిస్తున్నట్లు తెలిసింది. కార్మిక శాఖ ఇటీవల విడుదల చేసిన డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌లో రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు/ఉద్యోగులకు కరువు భత్యాన్ని వర్తింప చేయాలని పేర్కొంది. ప్రభుత్వోద్యోగులకూ ప్రతీ 6 నెలలకు డిఎ పెరుగుతున్న విషయం తెలిసిందే. కానీ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మాత్రం కరువు భత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్