వీధి బాలల కోసం భవనం నిర్మాణం

  • బ్రిడ్జిస్కూల్‌ పిల్లలకు మంచి
  • సౌకర్యాలు కల్పించండి
  • స్వచ్ఛంద సంస్థల
  • సమీక్షలో కలెక్టర్‌

వీధి బాలల నివాసం కోసం త్వరలో కొత్త భవన నిర్మాణం చేపట్టనున్నట్లు కలెక్టర్‌ గుల్జార్‌ తెలిపారు. బ్రిడ్జి స్కూలు నిర్వహణపై పలు స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుల్జార్‌ మాట్లాడుతూ పలు సూచనలు జారీ చేశారు. హాస్టళ్లలో ప్రతి రోజూ హాజరయ్యే పిల్లల హాజరు పట్టికను వెబ్‌సైట్లలో పొందుపరచాలన్నారు. పదిరోజులకోసారి డేటా పరిశీలించిన అనంతరం అవసరమైన నిధులు కేటాయిస్తామని చెప్పారు. హాస్టళ్లలో మంచినీటి సౌకర్యం, టాయిలెట్లు, బట్టలు, చెప్పులు స్టేషనరీ లాంటి సౌకర్యాలు ఎప్పటికప్పుడూ పిల్లలకు అందించాలన్నారు. 50 మంది పిల్లలకు వెయ్యి చదరపు గజాలకు తగ్గకుండా నివాసం ఏర్పాటు చేయాలని సూచించారు. నివాసపు అద్దె భవనానికి రూ.6000 నుంచి రూ.10000 వరకు పెంచడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. హాస్టళ్లలో విద్యా వాలంటీర్లను నియమించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆర్‌విఎం ఇన్‌ఛార్జి పిఓ సుశీందర్‌ కుమార్‌కు ఆదేశాలిచ్చారు. మొత్తం 39 స్వచ్ఛంద సంస్థలలో 1950 మంది పిల్లలకు ఇప్పటి వరకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు గుల్జార్‌ చెప్పారు. పదినెలల బ్రిడ్జి కోర్సు పూర్తి అయిన మీదట పిల్లలను స్థానిక పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రతి మూడు నెలలకోసారి ఉపాధ్యాయులను మార్చవద్దన్నారు. మారిస్తే పిల్లలకు, ఉపాధ్యాయులకు మధ్య సాన్నిహిత్యం కొరవడుతుందని అభిప్రాయపడ్డారు. పిల్లల భవిషత్‌ దృష్ట్యా స్థానిక ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమన్వయ సహకారాలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్నారు. కొత్తగా 26 స్వచ్ఛంద సంస్థలు హాస్టళ్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయని, వారికి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించేందుకు అనుమతివ్వాలని ఆర్‌విఎం పిఓను ఆదేశించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రిడ్జి స్కూల్స్‌ నిర్మాణం చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని, ఉర్ధూ మీడియం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని కలెక్టర్‌ను కోరారు. పదిహేను రోజుల్లో పుస్తకాలు పంపిణీ చేస్తామని కలెక్టర్‌ వారికి హామీనిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ నియామకాలకు విరుద్ధంగా బ్రిడ్జిస్కూలు నిర్మాణం చేపట్టడం కుదరదన్నారు. హాస్టల్‌ విద్యార్థులకు పాలు, గుడ్డు, పౌష్టికాహారం అందించాలని వారికి సూచించారు. ఎజెసి వై.సత్యానందం మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించాలని, వారికి చదువుపై ఆసిక్తి పెంచాలని సూచించారు. కుటుంబంలో ఒక విద్యార్థి చదువుకుని అభివృద్ధి అవుతే ఆ కుటుంబమంతా అక్షరాస్యులౌతారని తెలిపారు. పేదరికం చదువుకు ఆటంకం కాకుండా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో కిన్నెర, నాంది, అమన్‌, ప్రిధమ్‌, శాంతి సదన్‌ తదితర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్