యువత సంఘటితం కావాలని సిపిఎం మండల కమిటీ సభ్యులు భాస్కర్ క్రీడల ముగింపు సందర్భంగా కోరారు. మండలంలో సంక్రాంతి క్రీడోత్సవాలు సోమవారంతో ముగిశాయి. మండల వ్యాప్తంగా డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వివిధ క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంచాలలో జరిగిన క్రీడలను ఎస్‌ఐ రవికుమార్ ప్రారంభించారు. ఆరుట్లలో వ్యకాస మండల కార్యదర్శి కె.భాస్కర్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి దోహద పడతాయని యువత క్రీడల పట్ల మక్కువ చూపాలన్నారు. నేడు అనేక సంఘ విద్రోహ చర్యలు జరుగుతున్నాయని వాటినిరూపు మాపడం కోసం యువత సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. సంఘటితంగా ఉంటూ గ్రామాభివృద్ధికి పాటుపడాలని గుర్తు చేశారు. మత్తుపానీయాలకు ప్రతిఒక్కరూ దూరంగా ఉండాలని ముఖ్యంగా యువత వాటి జోలికి పోకూడదని కోరారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందని దానికి అడ్డుకట్టవేయడానికి యువత ముందుకు రావాలని తెలిపారు. ఈ సందర్భంగా బండ లేమూర్‌లో మద్యాన్ని అరికట్టేం దుకు సంఘటితంగా యువత కృషి చేసిన విధానాన్ని గుర్తు చేశారు. సంక్రాంతి సందర్భంగా యువతను చైతన్యం పర్చడం కోసం డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు.దీనిలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారని క్రీడాంశాలుగా వాలిబాల్, క్రికెట్, ముగ్గుల పోటీలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఈ. స్వామి, రమేష్, వెంకటేష్, సిపిఎం మండల కమిటీ సభ్యులు గోపాల్, నాయకులు శేఖర్, బుచ్చయ్య, అంజయ్య, పారేష, వినోద్, సంజీవ, గణేష్ పాల్గొన్నారు.