స్పెయిన్‌ చేతిలోనూ చిత్తు

    న్యూఢిల్లీ: పన్నెండవ ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌కు ఆతిథ్యం వహిస్తున్న భారత జట్టు మరో ఓటమిని చవిచూసింది. పాకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించి ప్రేక్షకుల్లో ఆశలను రేకెత్తించిన భారత జట్టు ఆ తరువాత ఆస్థాయిలో ఆడలేకపోతోంది. ఆసీస్‌ చేతిలో రెండు రోజుల క్రితం ఓటమి చవిచూసిన భారత జట్టు గురువారం నాడు స్పెయిన్‌ చేతిలో కూడా ఓడిపోయి సెమీస్‌కు చేరుకునే అవకాశాలను దాదాపు చేజార్చుకుంది. పాకిస్తాన్‌ చేతిలో ఓడిపోయిన స్పెయిన్‌ 5-2 తేడాతో భారత్‌ను ఓడించింది. ప్రథమార్ధం ముగిసే సమయానికి స్పెయిన్‌ 2-0 తేడాతో ఆధిక్యతలో ఉంది. 19వ నిమిషంలో అల్బర్ట్‌ సాలా గోల్‌ చేసి తమ జట్టుకు ఆధిక్యత అందించాడు. ప్రథమార్ధం మరో 14 సెకన్లలో ముగుస్తుందనగా పాల్‌ అమాట్‌ చేసిన గోల్‌తో స్పెయిన్‌ ఆధిక్యత 2-0కు పెరిగింది. భారత్‌ ఈ మ్యాచ్‌లో బాగానే ఆడినప్పటికీ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమైంది. ద్వితీయార్ధంలో సందీప్‌ సింగ్‌ గోల్‌ చేసాడు. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. స్పెయిన్‌ దాదాపు వెంటవెంటనే రెండు గోల్స్‌ చేసింది. పా కుమేదా 41వ నిమిషంలో , రామన్‌ అలెగ్రే 42వ నిమిషంలో ఈ గోల్స్‌ చేసారు. గుర్విందర్‌ సింగ్‌ 43వ నిమిషంలో గోల్‌ చేసాడు. 66వ నిమిషంలో కుమేదా మరో గోల్‌ చేసి తమ జట్టు విజయం ఖాయం చేసాడు. ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో ఓటమి. ఇంతకుముందు ఆసీస్‌ చేతిలో 2-5తో ఓటమిపాలైన విషయం విదితమే. పాకిస్తాన్‌పై గత ఆదివారం నాడు జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్‌ 4-1 తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో సెమీఫైనల్స్‌ చేరుకునే అవకాశాలు దాదాపు మృగ్యమయ్యాయని చెప్పవచ్చు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్