వర్శిటీల స్వయంప్రతిపత్తిని కాపాడాలి

  • ఉద్యమాల్లో పాల్గొన్న ప్రొఫెసర్ల డిబార్‌ సరైంది కాదు : నాగేశ్వర్‌

స్వయం ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయాల ప్రయోజనాలను కాపాడాలని ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌ కోరారు. ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న ప్రొఫెసర్లను ప్రభుత్వం డిబార్‌ చేయడం సరైంది కాదన్నారు. ఇది తమ ప్రాథమిక హక్కులపై దాడి చేయడమేనని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొనడాన్ని కాంగ్రెస్‌ సభ్యుడు గోపాల వెంకటకృష్ణారెడ్డి శుక్రవారం శాసనమండలిలో లేవనెత్తారు. దీనిపై నాగేశ్వర్‌ మాట్లాడుతూ ఏయే విశ్వవిద్యాలయాల్లో ఎంతమంది ప్రొఫెసర్లు ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొంటున్నారని ప్రశ్నించారు. వారికి ఏమైనా నిబంధనలు ఉన్నాయా? ఎంతమందిపై ఫిర్యాదులొచ్చాయని అడిగారు. విసిలు సైతం ఆందోళనల్లో పాల్గొంటున్నారా? వారిపై ఫిర్యాదులొచ్చాయా? అని ప్రశ్నించారు. ఆందోళనల్లో పాల్గొన్నారని ముగ్గురు విద్యార్థులను డిబార్‌ చేశారని, ఆందోళనల్లో పాల్గొన్న ప్రొఫెసర్లను ఎందుకు డిబార్‌ చేయడం లేదని ప్రశ్నించారు. పిడిఎఫ్‌ సభ్యుడు ఉద్యమాల్లో పాల్గొంటే డిబార్‌ చేస్తారా? 'అలాగైతే నేను విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. అనేక ఉద్యమాల్లో పాల్గొంటున్నాను. నన్ను డిబార్‌ చేస్తారా?' అని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న మొత్తం ప్రొఫెసర్ల గురించి మాట్లాడటం సరైంది కాదని, అది తమ ప్రాథమిక హక్కులపై దాడి చేయడమే అవుతుందని చెప్పారు. ఛైర్మన్‌ చక్రపాణి కూర్చోవాలని చెప్పడంతో 'నేను దీనిపై మాట్లాడకపోతే సభలో ఉండడం ఎందుకు?' అని నాగేశ్వర్‌ ప్రశ్నించారు. తాను వెళ్లిపోతానని సీటులోంచి లేచే సరికి పక్కనున్న సభ్యులు సర్దిచెప్పి కూర్చోబెట్టారు.

వర్శిటీలపై ప్రభుత్వ అజమాయిషీ లేదు : మంత్రి శ్రీధర్‌బాబు

స్వయం ప్రతిపత్తి కలిగిన వర్శిటీల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే అవకాశం ప్రభుత్వానికి లేదని, వాటిపై ప్రభుత్వ ఆజమాయిషీ లేదని ఉన్నత విద్యాశాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రొఫెసర్లను డిబార్‌ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. వర్శిటీకి సూచనలు, సలహాలు మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలను ప్రభుత్వం సున్నితంగా పరిగణిస్తోందన్నారు. ప్రభుత్వం దృష్టికి ఆందోళనల్లో ఒక ప్రొఫెసర్‌పై ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. సంబంధిత వర్శిటీకి ఆయనపై ఉన్న రిమార్కులను పంపించామని తెలిపారు. దానిపై విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మండలి ఛైర్మన్‌ చక్రపాణి ఆదేశాల ప్రకారం విద్యావ్యవస్థ ప్రక్షాళన కోసం శాసనమండలి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

అన్‌క్వాలిఫైడ్‌కు డిఇగా పదోన్నతి

ఓయులో డిప్లొమా చేసిన దేవిప్రియ అన్‌క్వాలిఫైడ్‌ అయినప్పటికీ డిప్యూటీ ఇంజనీర్‌(డిఇ)గా పదోన్నతి కల్పించారని దాడి అన్నారు. గ్రాడ్యుయేట్‌ అయివుండి సీనియార్టీలో ముందున్న శ్రీనివాసరావును వదిలిపెట్టి ఆమెకు డిఇగా పదోన్నతి ఇవ్వడం సరైంది కాదని మండలిలో ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు అన్నారు.

సీనియార్టీ ప్రకారమే పదోన్నతి : మంత్రి

1984లో దేవిప్రియ ఉద్యోగంలో చేరారని, సీనియార్టీ జాబితాలో ఆమె పేరు ముందున్నందువల్లే పదోన్నతి కల్పించామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. సీనియార్టీ ఉన్నందువల్లే సెలెక్షన్‌ ప్యానెల్‌లో దేవిప్రియ పేరు ముందుకొచ్చిందని, అందుకే డిఇగా పదోన్నతి కల్పించామని తెలిపారు. దీనిపై కొంతమంది అసిస్టెంట్‌ ఇంజనీర్లు(ఎఇ)లు హైకోర్టునాశ్రయించారని, తీర్పు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీనివాసరావుకు పదోన్నతి కల్పించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని సమాధానమిచ్చారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్