తాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచివెళ్తున్నా ఎండిన బోర్లు, అడుగంటిన బావులు దర్శనమిస్తున్నాయని, ప్రజలకు గుక్కెడు నీటిని అందించమని ప్రభుత్వాన్ని అడిగితే ఏవో కాకిలెక్కలు చూపిస్తోందని టిడిపి శాసనసభ్యులు ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో బోరు బావులు, ఇంకుడు గుంతలు, బావులు ఎండిపోయాయని, ప్రజలు తాగునీటి కోసం నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్లినా నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యేలు పి రాములు, జైపాల్‌యాదవ్, గుంగుల ప్రభాకర్, ఆదిలాబాద్ ఎంపీ రమేష్‌రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తాగునీటి కోసం భారీగా నిధులు కేటాయించాలని, నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో కనీసం బోరు బావులైనా తవ్వించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాగునీటి కోసం కోట్లాది రూపాయలు కేటాయించినట్లు ప్రభుత్వం కాకిలెక్కలు చూపెడుతోందని వారు ఆరోపించారు. ప్రజల దప్పిక తీర్చలేని ప్రభుత్వం మద్యాన్ని మాత్రం ఊరూరా ఏరుల్లా పారిస్తోందని ఆరోపించారు. ఏజెన్సీలు, మారుమూల గ్రామాలు, టౌన్లలో సైతం ప్రజలు తాగునీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. డిడిఆర్‌సి సమావేశాలు జరిగితే క్షేత్రస్థాయిలో తాగునీటి సమస్యకు పరిష్కార మార్గాలు వెతుక్కునే వారమని, గడిచిన కొన్ని నెలలుగా డిడిఆర్‌సి సమావేశాలు కూడా జరగడంలేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తాగునీటి కోసం ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బోరుబావులైనా తవ్వించాలని డిమాండ్ చేశారు. తాగునీటి విషయంపై అసెంబ్లీలో చర్చించాలని తాము పట్టుపట్టినప్పటికీ ప్రభుత్వం తాగునీటి సమస్య చర్చకు రాకుండా సమాధానాన్ని దాటవేసిందని ఆరోపించారు. గ్రామాల్లో తాగునీటి పరిస్థితి ఇప్పుడే ఈవిధంగా ఉంటే మరో రెండు మూడు నెలల్లో ఏవిధంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.