అప్పు కట్టకపోతే ఇంట్లోనే తిష్ట

  • బాకీ తీర్చడం కోసం కొత్త రుణం
  • మైక్రోఫైనాన్స్‌ నిర్వాహకుల వింత పోకడలు

    ''మనం ఎవరికైనా అప్పు ఇస్తే పదిసార్లు వారిని అడుగుతాం. విసిగిస్తాం.. వెంటబడుతాం.. అవసరమైతే గట్టిగా మందలించి మరీ వసూలు చేస్తాం. కానీ ఇక్కడ అప్పు ఇచ్చిన వారు మీరు గడువులోగా ఇవ్వాలని ప్రామిసరీ నోటు రాయించుకుని వెళ్తారు. గడువులోగా ఇవ్వకపోతే మందలించరు.. కొట్టరు.. పోలీసులకు కూడా చెప్పరు. అణాపైసా సహా అప్పు తీర్చే వరకు తీసుకున్న వ్యక్తి ఇంట్లో తిష్టవేస్తారు. ఒకరుకాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమంది మహిళలను వాళ్ల ఇంటికి పంపిస్తారు. తీసుకున్న అప్పు చెల్లించేవరకు వారు అతిథుల్లా అన్నీ అనుభవిస్తారు. రుణ గ్రహీత ఇంట్లో ఉండి వస్తువులు వాడుకోవడం, సరుకులతో వండుకుని తినడం ఇలా వారి ఇల్లు గుల్ల చేస్తారు. అప్పు చెల్లించేవరకు అక్కడే మకాం వేస్తారు. ఒకవేళ ఆ బాధితుడు అప్పు చెల్లించడంలో ఆలస్యమైతే ఇంట్లోని సరుకులు నిండుకుంటాయి. అప్పటికీ కదలరు, వదలరు. వస్తువులను తెగనమ్మి సరుకులు తెచ్చి మరీ వండుకుని తింటూ ఉంటారు. చేసేదిలేక అప్పు తీసుకున్న వారు మళ్లీ ఇరుగుపొరుగిళ్లలో అప్పు చేసి వారి పీడ వదిలించుకోవాల్సిన పరిస్థితి. ఇలా అప్పులపై అప్పులు చేసి ఆర్థికంగా చతికిలపడుతున్న నిరుపేద రైతులు, మహిళలు ఎందరో.. ఆదిలాబాద్‌ జిల్లాలోని లక్షెట్టిపేట, కోటపల్లి, చెన్నూర్‌, కాసిపేట మండలాల్లో ఇదో రకం మైక్రోఫైనాన్స్‌ వ్యాపారం. పెట్టుబడుల కోసం రైతులు, స్వశక్తి మహిళలూ అధిక శాతం మంది బ్యాంకుల చుట్టూ తిరిగి వేసారి ఉన్న సమయంలో ఈ వడ్డీవ్యాపారులు వారికి సాక్షాత్కరిస్తున్నారు. నిరుపేదలు గత్యంతరం లేక వీరి ఉచ్చులో పడి ఇలా ఇళ్లు గుల్ల చేసుకుంటున్నారు'

ప్రజాశక్తి-లక్షెట్టిపేట, కోటపల్లి

    జిల్లాలో ఇప్పటి వరకు షేర్ములా, స్పందన, బేసిక్స్‌, ఎల్‌ఎంటి తదితర మైక్రోఫైనాన్స్‌ సంస్థలు ప్రజలకు అప్పులిస్తూ ముక్కుపిండి మరీ వసూలు చేయడం చూశాం. కానీ ఇక్కడ వడ్డీ వ్యాపారం తీరే వేరు. వీరికిి ఊరు లేదు..పేరు అంతకన్నా లేదు. ఎక్కడినుండి వచ్చారో కూడా చెప్పరు. వాళ్ల అడ్రస్‌ ఏదో ఒకటి రాసిస్తారు. అవసరానికి డబ్బులు కావాలంటే వడ్డీకి ఇస్తారు. 10 నుండి 30 వేల వరకు అప్పు ఇస్తారు. తీసుకున్న అప్పుకు వడ్డీ లెక్క కట్టి మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లించేలా ప్రామిసరీ నోటు మీద రాసుకుంటారు. అప్పు తీసుకున్న సదరు వ్యక్తులు సమయానికి చెల్లించలేని పరిస్థితి ఎదురైతే అంతే సంగతులు. ఈ వాయిదా డబ్బులు సర్దుబాటు కాలేదని బాధితుడు వారికి చెప్పిన మరుక్షణమే పదిమంది మహిళలు వారింట్లో అతిథిలుగా దిగుతారు. డబ్బులు వచ్చే వరకు ఆ ఇంట్లో టూత్‌పేస్ట్‌ నుండి పక్క మంచం వరకు అన్నీ విని యోగించుకుంటారు. ఇది బాధితునికి ఆత్మగౌరవ సమస్యగా తయారవుతోంది. ఇరుగు పొరుగువారు చూస్తే పరువు పోతుందనే మానసిక క్షోభకు గురవుతాడు. దీంతో ఎవరికీ చెప్పుకోలేక మళ్లీ కొత్తగా అప్పు చేసి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఒక్క లక్షెట్టిపేటలోని ఉత్కూర్‌, చందారం, లక్కారం, మంచిర్యాలలోని ముల్కల్ల, నస్పూర్‌, సింగాపూర్‌, తీగల్‌పహాడ్‌, దొనబండ, కాసిపేటలోని ముత్యంపల్లి, దేవాపూర్‌, సోనాపూర్‌, మల్కేపల్లి, కోనూరు, దస్నాపూర్‌, నీల్వాయి, కేతనపల్లి, గొర్లపల్లి, సుంపుటం, చామనపల్లి, చెన్నూర్‌ మండలంలోని కిష్టంపేట, ఆస్నాద్‌, కత్తరశాల, చింతల్‌పల్లి, చాకేపల్లి, బుద్ధారం, సోమన్‌పల్లి, దండేపల్లిలోని దండేపల్లి, కాసిపేట, వెల్గనూరు, నెల్కి వెంకటాపూర్‌, రెబ్బెనపల్లితో పాటు పలు గ్రామాల్లో ఇప్పటి వరకు వీరి వద్ద అప్పులు తీసుకుని తిప్పలు పడిన వారిలో 950 కుటుంబాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇలా వడ్డీ ఇచ్చిన చోట వసూలు చేసుకోవడం, కొత్త ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్తూ వ్యాపారాన్ని మూడుపువ్వులు, ఆరుకాయలుగా విస్తరించుకుంటున్నారు. ఈ వడ్డీ వ్యాపారులు పేద ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని తక్కువ వడ్డీకి రుణం అని ఆశ చూపి అవస్థలకు గురి చేస్తున్నారు.

ఊరొదిలిన వారూ ఉన్నారు...

    ఈ రుణాన్ని మూడు వాయిదాల్లో ఆరు నెలల్లోపు చెల్లించాలి. చెల్లించకపోతే తర్వాత అధిక వడ్డీ విధిస్తారు. ఒక్క లక్సెట్టిపేటలోనే ఇప్పటి వరకు 30 కుటుంబాలు వీరి చేతిలో మోసపోయాయి. అప్పు పుట్టనివారు ఊరు విడిచి వెళ్లిపోయిన సందర్భాలూ ఉన్నాయి. వారు బాకీ కట్టకుండా ఊరు విడిచిపోతే మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి నుండి డబ్బు వసూలు చేస్తున్నారు. డబ్బు ఇచ్చిన సమయంలో ప్రామిసరీ నోటు మీద తీసుకున్న వ్యక్తితో పాటు మధ్యవర్తి సంతకం కూడా ఉండడం, నిబంధనలన్నింటికీ అంగీకరించినట్లు సంతకాలు చేయడంతో మధ్యవర్తులకూ బాధ తప్పడం లేదు. విధిలేని పరిస్థితుల్లో వీరి ఉచ్చులోపడి నానా అవస్థలు పడుతున్నామని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరు ఊరు చెప్పుకోవాలంటే కూడా ఆత్మగౌరవ సమస్యగా భావించి లోలోపల కుమిలిపోతున్నామని 'ప్రజాశక్తి' ఎదుట కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

    కడమంద సుధాకర్‌(30) వృత్తిరీత్యా కూలి. లక్షెట్టిపేట మండలం ఉయ్యూరు గ్రామస్తుడు. ప్రామిసరీ నోటు రాసిచ్చి వీరి వద్ద రూ.22500 రుణం పొందాడు. డి.దయావత్‌(కూలి), సుందరి(కూలి) ఈ అప్పు కోసం జామీను ఇచ్చారు. నిర్దేశించిన గడువులోపు చెల్లించకపోవడంతో గత నెలలో వీరి ఇంట్లో మకాం వేశారు. విధిలేని పరిస్థితిలో వ్యయ ప్రయాసాలకోర్చి మరో చోట అప్పుచేసి వారి నుండి తప్పించుకున్నాడు. లక్షెట్టిపేట మండల కేంద్రానికి చెందిన గొర్రె సుధ పదివేల రూపాయల రుణం తీసుకుంది. భర్త తాపీ మేస్త్రి. ఆమె కూలీ పనిచేస్తుంది. వడ్డీతో కలిపి 16వేల రూపాయలు ఆరు నెలల్లోగా బాకీ చెల్లించాలని మైక్రోఫైనాన్స్‌ వ్యాపారి ప్రామిసరీ నోటు రాసుకున్నాడు. సకాలంలో ఇవ్వలేదని వారింటికి పదిమంది మహిళలను పంపించారు. వారు వారం రోజుల పాటు అక్కడే మకాం వేసి ఇంట్లోని సరుకులు తెచ్చుకుని వండుకుని తిన్నారు. వారి బాధ భరించలేక పట్టణంలో తెలిసిన మరో ఇద్దరి వద్ద బాకీ చేసి డబ్బులు చెల్లించారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్