ఇండియా న్యూస్ నెట్‌వర్క్,
న్యూఢిల్లీ : ప్రభుత్వం త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న అణు (ప్రమాద పరిహార) బాధ్యతల బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించవద్దని పార్లమెంటు ఉభయ సభల సభ్యులందరికీ వామపక్షాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు వామపక్షాల అగ్రనేతలు ప్రకాశ్ కరత్, ఎబి బర్దన్, దేవబ్రత బిశ్వాస్, టిజె చంద్రచూడన్ ఎంపీలందరికీ వ్యక్తిగతంగా లేఖలు రాశారు. అణు విద్యుత్ ప్లాంట్లలో ఏదైనా ప్రమాదం సంభవించిన పరిస్థితుల్లో నిర్వాహకులు, సరఫరాదారుల ప్రమాద పరిహార బాధ్యతపై ఈ బిల్లు పరిమితులు విధిస్తోందని వారు పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం, అక్కడి పెట్టుబడిదారులు, సంస్థలు ఉన్నత స్థాయిలో ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం ఈ బిల్లును ముందుకు తెస్తోందని, ఈ బిల్లును ఆమోదిస్తేనే తాను అణు సహకార ఒప్పందాన్ని అమలు చేస్తానని అమెరికా ముందస్తు షరతు విధించిందని వామపక్ష నేతలు తెలిపారు. అందువల్లే అణు ఇంధన రిప్రాసెసింగ్‌కు అనుమతి వంటి అంశాలపై అమెరికా ఇప్పటి వరకూ తన సమ్మతిని వెల్లడించలేదని గుర్తు చేశారు. అంతేకాక ప్రధాని పార్లమెంటుకు హామీ ఇచ్చినట్లు సాంకేతిక పరిజ్ఞానం పునర్వినియోగంపై ఆంక్షలను కూడా ఎత్తివేయలేదని వారు పేర్కొన్నారు. ప్రమాద పరిహార బాధ్యతలను భారత ఖజానాపైకి నెట్టి అమెరికా సరఫరాదారులు లాభాలు మూటకట్టుకొనేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుందన్నారు. ప్రమాద పరిహార బాధ్యతను 2143 కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితం చేస్తున్నారని, అంతకు మించి ఎటువంటి ప్రాణ, ఆరోగ్య, పర్యావరణ హాని జరిగినా ఆ భారం ప్రభుత్వ ఖజానాపైనే పడుతుందని గుర్తు చేశారు. ప్రమాదం సంభవిస్తే ఈ ప్లాంట్లను నిర్వహించే భారత (ప్రభుత్వ) సంస్థ కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే పరిహారం చెల్లిస్తుందని, ఆ మొత్తాన్ని కనీస స్థాయిలో వంద కోట్లకు తగ్గించేందుకు ప్రభుత్వానికి అధికారమున్నట్లు వివరించారు. విదేశీ సంస్థలు తప్పుడు, నాసి రకం పరికరాలను సరఫరా చేసినా వాటికి ప్రమాద పరిహార విషయంలో ఎటువంటి చట్టపరమైన బాధ్యతా ఉండబోదని వామపక్ష నేతలు వెల్లడించారు. ఈ బిల్లులో ప్రతిపాదిం చిన నిబంధనలు కూడా అత్యంత క్లిష్టతరమైనవిగా ఉన్నట్లు తెలిపారు.
అణు విద్యుత్ కేంద్రాలలో ప్రమాదం అంటూ సంభవిస్తే అది అపారమైన నష్టానికి దారి తీస్తుందని, దానికి ఉదాహరణ ఛెర్నోబిల్ ప్రమాదమేనని గుర్తు చేశారు. భోపాల్ గ్యాస్ లీకేజ్ ప్రమాదంలో కేంద్ర ప్రభుత్వం, యూనియన్ కార్బైడ్ మధ్య కుదిరిన రూ.2,152 కోట్ల రూపాయల పరిహార ఒప్పందాన్ని సుప్రీంకోర్టు ఆమోదించినప్పటికీ అది బాధితులకు ఏ మాత్రం సరిపోదన్న విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. ఈ బిల్లులో పేర్కొన్న నిబంధనలన్నీ అమెరికా సరఫరాదారుల కొమ్ము కాసేవేనని వారు స్పష్టం చేశారు. ఇటు రష్యా కానీ అటు ఫ్రాన్స్‌కు చెందిన అణు పరికరాల సరఫరాదారులెవ్వరూ అణు ప్రమాద పరిహార బాధ్యతలపై పరిమితి విషయాన్ని ఎక్కడా ప్రస్తావించని విషయాన్ని గుర్తించాలని వారు సూచించారు. ప్రస్తుతం మన ప్రభుత్వ నిర్వహణలోని అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి ప్రమాద పరిహార బాధ్యతల చట్టం ఏమీ లేదని, అది భారత్‌తో అణు వాణిజ్యానికి పెద్ద విఘాతం అవుతుందన్న ఆందోళన ఉందని, అందువల్లే ఎటువంటి రక్షణలు లేకుండా భారత్‌తో అణు వాణిజ్యానికి అమెరికా సంస్థలేవీ ముందుకు రావడం లేదని వివరించారు. ప్రస్తుతం భారత్‌లో అమలులో ఉన్న ప్రమాద పరిహార బాధ్యతల విషయంలో ప్రమాదకర పరిశ్రమలకు సంబంధించి ఆయా ప్లాంట్ల యాజమాన్యాలపైనే చట్టం పూర్తి బాధ్యత పెడుతోందని, అందులో ఎటువంటి పరిమితులనూ చట్టం అనుమతించడం లేదని గుర్తు చేశారు. ప్రమాద పరిహార బాధ్యత కేవలం బాధితులకు మాత్రమే కాక పర్యావరణ నష్టానికి కూడా వర్తిస్తుందని వారు వివరించారు. అంతర్జాతీయంగా 1997లో కుదిరిన అవగాహన ప్రకారం అణు ప్రమాద పరిహార బాధ్యతల విషయంలో ఏర్పాటయ్యే ప్రత్యేక నిధిలో భాగస్వామి అయ్యేందుకు భారత్ ముందుకొచ్చినట్లు తెలిపారు. అయితే ఆ అవగాహన కేవలం అర్జెంటీనా, చెక్ రిపబ్లిక్, ఇండోనేషియా, ఇటలీ, లెబనాన్, లిథువేనియా, మొరాకో, పెరూ, ఫిలిప్పైన్స్, రుమేనియా, ఉక్రెయిన్, అమెరికా వంటి 13 దేశాల మధ్య మాత్రమే కుదిరిందని, అందులో కేవలం అమెరికా, అర్జెంటీనా, మొరాకో, రుమేనియా మాత్రమే దాన్ని ఇప్పటి వరకూ ధృవీకరించినట్లు వివరించారు. కనీసం 4 లక్షల మె.వా అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఐదు దేశాలు కావలసి ఉన్నందున ఈ అవగాహనా ఒప్పందం ఇప్పటి వరకూ అమలులోకి రాలేదని వామపక్షాలు వివరించాయి.
అణు పరికరాల సరఫరాదారులకు ప్రమాద పరిహార బాధ్యతల నుంచి పూర్తి మినహాయింపు కల్గిస్తున్నందునే రష్యా ఈ ఒప్పందంపై ఇప్పటి వరకూ సంతకం చేయలేదని గుర్తు చేశాయి. అంతేకాక అణు విద్యుత్‌ను ఉత్పత్తిచేసే దేశాలేవీ ఈ ఒప్పందంలో చేరలేదని, భారత్ మాత్రం అంతర్జాతీయ నిధులు అందుబాటులోకి వస్తాయన్న నిరాధారమైన ఊహతో ఈ అవగాహనలో చేరేందుకు ఆరాట పడుతోందని విమర్శించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో వియన్నాలో జరిగిన సదస్సు అణు ప్రమాద పరిహార బాధ్యతల ఒప్పందంలో అణు విద్యుత్ ఉత్పత్తి చేసే అన్ని దేశాలపై కనీస బాధ్యతను ఉంచిందని, అయితే భారత్ ఆ ఒప్పందంలో భాగస్వామి కాలేదని వివరించారు. ప్రమాద పరిహార బాధ్యతలపై ఈ ఒప్పందం ఎటువంటి పరిమితీ విధించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వారు ఎంపీలకు సూచించారు. వియన్నా ఒప్పందంలో భాగస్వామి కాని అమెరికా సైతం తన సొంతంగా అణు పరిశ్రమల (ప్రమాద పరిహార) బాధ్యతల చట్టాన్ని 1957లో రూపొందించి 2005లో సవరించిందని, దాని ప్రకారం ప్రైవేటు రంగంలో అందుకు సంబంధించి పది వేల కోట్ల డాలర్ల(సుమారు నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయిలు) నిధి అందుబాటులోకి వస్తుందని వివరించాయి. అంటే అణు ప్రమాద పరిహార బాధ్యతల విషయంలో అమెరికా ప్రజలకు చెల్లించే పరిహారం భారత్‌లో ప్రతిపాదించిన దానికన్నా 23 రెట్లు ఎక్కువగా ఉందంటూ, భారతీయుల ప్రాణాలంటే అంత చులకనా అని వామపక్షనేతలు నిలదీశారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న బిల్లు భారత ప్రజల ప్రయోజనాలకు ఉద్దేశించింది కాదని, వారి ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికా కొమ్ము కాస్తున్నదని వామపక్షనేతలు ఉద్ఘాటించారు. ఈ అంశాలన్నింటినీ నిశితంగా పరిశీలించి భారతీయుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న బిల్లును తిరస్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.