కార్మికవర్గం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లపై దేశవ్యాప్తంగా ఉమ్మడి పోరాటాన్ని కొనసాగించాలని 9 జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. సిఐటియు, ఎఐటియుసి, బిఎంఎస్, ఐఎన్‌టియుసి తదితర సంఘాలు రాజకీయ విభేదాలను పక్కనపెట్టి గత కొంతకాలంగా ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. బుధవారమిక్కడ ప్రారంభమైన సిఐటియు 13వ జాతీయ మహాసభల్లో జాతీయ కార్మిక సంఘాలన్నీ మరోసారి ఒకే వేదికపైకి వచ్చాయి. ఆయా సంఘాల ప్రతినిధులు మహాసభల్లో సౌహార్ద్ర సందేశాలిచ్చారు. కార్మికవర్గ ఐక్యత ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్మిక చట్టాల అమలు, అసంఘటితరంగ కార్మికుల సంక్షేమం, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేత తదితర 5 డిమాండ్లపై ఉధృతంగా ఉమ్మడి పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించాయి. అవసరమైతే ' జాతీయ సమ్మె 'కు సిద్ధమవ్వాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్మికవర్గ ఐక్యతపై సిఐటియు ప్రధాన కార్యదర్శి మహ్మద్ అమీన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌టియు), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) ప్రతినిధులు కూడా మహాసభలకు హాజరై సందేశాలిచ్చారు. మహాసభల్లో వివిధ జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులు చేసిన ప్రసంగాల సారంశమిదీ...
గురుదాస్‌దాస్ గుప్తా (ఎఐటియుసి) : కార్మికవర్గ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఈ స్థితిలో సమైక్య పోరాటా లకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. సిఐటియు, ఎఐటియుసి ఈపాటికే చాలా సన్నిహితంగా పని చేస్తున్నాయి. విభేదాలను పక్కనపెట్టి మనం మరింత సమైక్యంగా, సంఘటితంగా ముందుకు వెళ్లాల్సిన అవసరముంది. కార్మిక వర్గ ఐక్యతతోనే ప్రస్తుత యుపిఎ ప్రభుత్వ ఏకపక్ష విధానాలను ఎదుర్కోవడం సాధ్యమౌతుంది.
ఎడి నాగ్‌పాల్ ( హిందు మజ్దూర్ సభ) : దేశంలో జాతీయ కార్మిక సంఘాలన్నీ ఏకమవ్వడం కార్మికవర్గంలో కొత్త ఆశలు పుట్టిస్తోంది. పాలకుల్లో ఆందోళన కలిగిస్తోంది. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ మంత్రం పఠిస్తున్న పాలకులకు కార్మికులు సమైక్యంగా బుద్ధి చెప్పాలి.
సర్వేష్ ద్వివేదీ (బిఎంఎస్) : ప్రస్తుతం 'పేపర్ ఎకానమీ'కి, కార్మిక వర్గ హక్కులకు మధ్య ప్రపంచవ్యాప్తంగా పోరాటం జరుగుతోం ది. ఈ నేపథ్యంలో ప్రపంచ కార్మికులంతా ఏకమవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. దేశంలో ప్రారంభమైన కార్మికవర్గ ఐక్యత మరింత సంఘటితం కావాలి.
సుభాష్ శర్మ (ఐఎన్‌టియుసి) : ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలో సుమారుగా కోటి మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయారు. జిడిపి పెరుగుదలకు, ద్రవ్యోల్బణం పెరుగుదలకు మధ్య సంబంధం ఏమిటన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయలేకపోతోంది. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం మరింతగా సమైక్య పోరాటాలు సాగాలి.
ఎస్‌పి తివారీ (టియుసిసి) : అసంఘటితరంగ కార్మికులను కలుపుకుపోకుండా దేశ కార్మిక ఉద్యమం మనుగడ సాగించలేదు. పాలకవర్గాల దాడిని సమర్ధవంతంగా ఎదుర్కోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అసంఘటితరంగ కార్మికులను సంఘటితం చేయడంపై కార్మిక సంఘాలు మరింతగా దృష్టి సారించాలి.
అబనీరాయ్ (యుటియుసి) : యుపిఎ ప్రభుత్వం అత్యంత నగంగా సంపన్నుల సేవలో తరిస్తోంది. సంస్కరణలను మరింత ఉధృతంగా ముందుకు తెస్తోంది. ఈ స్థితిలో ఏ ఒక్క కార్మిక సంఘమో సమస్యలను పరిష్కరించగలదనుకుంటే అది భ్రమే అవుతుంది.
రాజీవ్ దేబ్రి (ఎఐసిసిటియు) : ఆమ్‌ఆద్మీ పేరు చెప్పి ఖాస్ ఆద్మీకి (సంపన్నులు) దోచి పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సంస్కరణల ఎజెండాను సిద్ధం చేస్తోంది. జిడిపి ఫలాలన్నీ కొద్ది మంది కోటీశ్వరులకే దక్కుతున్నాయి. దేశవ్యాప్త సమైక్య కార్మిక ఉద్యమమే ఈ స్థితిని మార్చగలదు.