ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు నిరసనగా సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్‌బ్లాక్, ఆర్‌ఎస్‌పి పార్టీలు దేశ రాజధానిలో శుక్రవారం భారీ ప్రదర్శన నిర్వహించనున్నాయి. అధిక ధరలతో పాటు భూమి సమస్య, నిరుద్యోగం, బెంగాల్లో వామపక్ష శ్రేణులపై జరుగుతోన్న దాడులను ఈ ప్రదర్శనలో వామపక్షాలు ప్రధానంగా వెలుగులోకి తేనున్నాయి. గురువారం రాత్రికే వేలాది మంది ప్రజలు మైదానం వద్దకు చేరుకున్నారు. వీరికోసం ఢిల్లీ పార్టీ కార్యకర్తలు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో రామ్‌లీలా నుండి మహా ప్రదర్శన ప్రారంభమౌతుంది. ప్రధానంగా పలు ఉత్తరాది రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో పేదలు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నారు. సుమారుగా లక్ష మంది ప్రజలు ప్రదర్శనలో పాల్గొంటారని పార్టీ అంచనా వేస్తోంది. సుమారుగా 12 గంటల సమయంలో పార్లమెంటు వీధిలోని జంతర్‌మంతర్ వద్దకు ప్రదర్శన చేరుతుంది. అనంతరం అక్కడ భారీ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. నాలుగు వామపక్ష పార్టీల అగ్రనేతలు ఈ ధర్నాను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వామపక్ష పార్టీల ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.