మహిళా బిల్లుపై నీలిమేఘాలు!

  • బిజెపిలో విభజన బ కాంగ్రెస్‌లో లుకలుకలు
  • రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల్లోనూ 'అభద్రత'

యుపిఎ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ ఎంతో ఘనంగా చెప్పుకుంటున్న మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆటంకాలు పూర్తిగా తొలగిన పరిస్థితి కన్పించడం లేదు. రాజ్యసభ గండాన్ని దాటిన బిల్లుకు, లోక్‌సభలో ఆమోదం లభించడం అంత సులభంగా అనిపించడం లేదు. ఎస్‌పి, ఆర్‌జెడి, జెడి(యు), బిఎస్పీల నుంచే ఇప్పటి వరకూ బిల్లుపై వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా పలువురు అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బిజెపి లోక్‌సభ సభ్యులు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో బిల్లుపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. బిజెపి, వామపక్షాల మద్దతుతో లోక్‌సభలో బిల్లుకు సునాయాసంగా ఆమోదం లభిస్తుందన్న కాంగ్రెస్‌ అధిష్టానం అంచనాలు తప్పాయి. మహిళా బిల్లు విషయంపై ప్రధాన ప్రతిపక్షం బిజెపిలో విభజన ఏర్పడటమే దీనికి కారణం. బిజెపిలోని మెజార్టీ లోక్‌సభ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఆ పార్టీ చీఫ్‌విప్‌ ప్రకటించడం పరిస్థితికి అద్దం పడుతోంది. 'మా పార్టీలోని 70 శాతం మంది ఎంపీలు మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నారు. పలువురు ఎంపీలు విప్‌ను ధిక్కరించడానికి కూడా సిద్ధపడుతున్నారు' అని లోక్‌సభలో బిజెపి చీఫ్‌విప్‌ రమేష్‌ బైస్‌ బుధవారం ఒక జాతీయ వార్తా పత్రికతో అన్నారు. గురువారానికి ఆయన కొంత మెత్తబడినా, పరోక్షంగా తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. గోరఖ్‌పూర్‌ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌, పార్టీలో ప్రముఖ నేత, మాజీ మంత్రి హుకుమ్‌దేవ్‌ నారాయణ్‌ యాదవ్‌ బిల్లును బహిరంగంగా విమర్శిస్తున్నారు.

అవసరమైతే పార్టీ విప్‌ను ధిక్కరించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం. దాదాపుగా మరో 30 మంది బిజెపి ఎంపీలు కూడా బిల్లుపై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. బిల్లును తాము వ్యతిరేకిస్తున్నప్పటికీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మరికొంత మంది ఎంపీలు పేర్కొంటున్నారు. మహిళా బిల్లు పట్ల పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిపై బిజెపి నేతలు దృష్టి సారించారు. పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ ఈ అంశంపై ఎంపీలతో గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 'బిల్లుకు బిజెపి పూర్తి మద్దతు ఉంటుంది. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో పార్టీ తరపున విప్‌ జారీ చేస్తాం' అని ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌ గురువారమిక్కడ ప్రకటించారు. బిల్లుపై పార్టీలో బేధాభిప్రాయాలున్నప్పటికీ అన్నీ సర్దుకుంటాయని మరో సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషీ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ఎంపీల్లోనూ అభద్రత

మహిళా బిల్లుకు సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమౌతోంది. బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడమే కష్టమని లోక్‌సభ సభ్యులు తొలుత భావించారు. పెద్దల సభలో బిల్లుకు ఆమోదముద్ర పడటంతో ఇప్పుడు అధికార పార్టీలోనూ లుకలుకలు ప్రారంభమయ్యాయి. 33 శాతం స్థానాలను మహిళలకు రిజర్వ్‌ చేస్తే తమ రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందని పలువురు ఎంపీలు ఆందోళన చెందుతున్నారు. 'బిల్లును ఎలాగైనా ఆపాలని బిజెపి, కాంగ్రెస్‌ ఎంపీలు మాకు విజ్ఞప్తి చేస్తున్నారు' అని ఆర్‌జెడి అధినేత లాలూ గురువారంలోక్‌సభలో వ్యాఖ్యానించారు. లాలూతో పాటు ములాయం, శరద్‌యాదవ్‌, తదితర నేతలు బిల్లుకు వ్యతిరేకంగా ప్రసంగిస్తున్న సమయంలో పలువురు కాంగ్రెస్‌, బిజెపి సభ్యులు వారికి మద్దతు పలకడం గమనార్హం. బీహార్‌లోని కిషన్‌గంజ్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ సభ్యుడు అసురుల్‌ హక్‌ బిల్లును గురువారం బహిరంగంగా వ్యతిరేకించారు. బిల్లులో సమాజంలోని అన్ని పక్షాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని, ఈ అంశాన్ని పార్టీ అధిష్టానంతో చర్చిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. పలువురు రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలు కూడా బిల్లుపై అసంతృప్తితో ఉన్నారు. గురువారం లోక్‌సభలో లాలూ ప్రసంగానికి మద్దతు తెలిపిన వారిలో అనకాపల్లి ఎంపీ సబ్బం హరి కూడా ఉన్నారు. బిల్లుపై తమకున్న అభ్యంతరాలను సోనియా దృష్టికి తీసుకెళ్లాలని పలువురు ఎంపీలు భావిస్తున్నారు. ఈ మేరకు ఎంపీలు ఒక లేఖను కూడా తయారు చేస్తుండటం గమనార్హం.

పట్టు బిగిస్తున్న త్రయం

మహిళా బిల్లు లాలూప్రసాద్‌ యాదవ్‌, ములాయంసింగ్‌ యాదవ్‌, శరద్‌యాదవ్‌ను ఒక్కటి చేస్తోంది. లోక్‌సభలో బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని ప్రతినబూనిన నేతలు ఆ మేరకు వ్యూహరచన చేస్తున్నారు. కాంగ్రెస్‌, బిజెపితో పాటు ఇతర ప్రధాన పార్టీల్లోని ఎంపీల్లో బిల్లుపై అనుమానం, అభద్రత సృష్టించడంలో ఈ నేతలు కొంతమేర విజయం సాధించారు. ప్రధానంగా పలువురు బిజెపి ఎంపీలతో ఈ ముగ్గురు నేతలూ తెరవెనుక మంతనాలు సాగిస్తున్నారు. పలు ఆర్థిక బిల్లులకు ఆమోదం లభించాల్సి ఉన్న స్థితిలో నాలుగు రోజులుగా లోక్‌సభలో గలాభా సృష్టించడం ద్వారా వారు కాంగ్రెస్‌పైనా ఒత్తిడి పెంచగల్గారు. తాజా పరిణామాలు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. 'అందరితో చర్చించాకే బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడతాం' అంటూ ప్రణబ్‌ముఖర్జీ గురువారం లోక్‌సభలో చేసిన ప్రకటన తాజా పరిణామాల పర్యవసానమే. సొంత పార్టీ ఎంపీలను, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలను బుజ్జగించడంపై ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి సారించింది.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్