అవసరాలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో ప్రభుత్వానికి ముందుచూపు కొరవడిందని విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. రైతులు, విద్యార్థులు, ప్రజలు, విద్యుత్ కొరతతో నరకయాతన పడుతుంటే ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్నాయి. అవసరమైన విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలనుండి కొనుగోలు చేయడంతోపాటు, కేంద్రం నుండి రాష్ట్ర వాటాను సాధించుకోవాలని సూచించాయి. ప్రయివేటు విద్యుత్ ప్రాజెక్టులు తమ ఉత్పత్తిలో 20 శాతాన్ని బయట ప్రాంతాలకు అమ్ముకోవచ్చుంటూ గతంలో ఇచ్చిన జిఓను పున:సమీక్షించాలన్నాయి. బయట రాష్ట్రాలకు అమ్ముకోకుండా రాష్ట్ర అవసరాలకే కేటాయించేలా జివో ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఈ నెల 11 నుండి విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగవుతోందని మంత్రి పొన్నాల ఇచ్చిన సమాధానాన్ని బాధ్యతారాహిత్యంగా పేర్కొన్నాయి. తామిచ్చిన సూచనలపై ప్రభుత్వం సరిగా స్పందించలేదని నిరసన వ్యక్తంచేస్తూ టిడిపి, సిపిఎం, సిపిఐ సభ నుండి వాకౌట్ చేశాయి. ప్రజారాజ్యం లోక్‌సత్తా నిరసన వ్యక్తంచేశాయి. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల అనంతరం రాష్ట్రంలోని విద్యుత్ పరిస్థితిపై మంత్రి పొన్నాల లక్ష్యయ్య ప్రకటన చేశారు. దానిపై మూడు గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగింది. విద్యుత్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లాలకు చెందిన అధికార, ప్రతిపక్షాల నుండి 25 మంది సభ్యులు మాట్లాడారు.
ఆయా జిల్లాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో 1994 కి ముందు నాటి దుర్భర పరిస్థితులను మళ్లీ తీసుకొచ్చారని విమర్శించారు. ప్రతి ఏటా 10 శాతం వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పిత్తి, పంపిణీని మెరుగు పర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్డీయేకు టిడిపి మద్దతిచ్చిన సమయంలో కేంద్రంనుండి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను తీసుకొచ్చామన్నారు. అప్పటి టిడిపి ఎంపీల కంటే ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీల సంఖ్య ఎక్కువున్నందున కేంద్రంపై ఒత్తిడి చేసి అవసరమైన వాటా సాధించాలని సూచించారు. వ్యవసాయానికి 5 గంటలకు మించి ఎక్కడా విద్యుత్ సరఫరా చేయడం లేదని విమర్శించారు. విద్యుత్ కొరతపై ట్రాన్స్‌కో సిఎండికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న సమయంలో లిఫ్ట్ ఆగిపోయిందని ప్రజారాజ్యం అధ్యక్షులు చిరంజీవి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. లిఫ్ట్‌లో ఉన్న ఆ 20 నిమిషాలు తామెంత ఉక్కిరిబిక్కిరి అయ్యామో, రాష్ట్రంలోని ప్రజలంతా కూడా విద్యుత్ కోతతో అదే విధంగా ఇక్కట్లు పడుతున్నారని విమర్శించారు.విద్యుత్ శాఖకు మంత్రిని కూడా నియమించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందన్నారు. గృహాలు, హాస్టళ్లకు నిరంతరాయంగానూ, వ్యవసాయానికి కనీసం రెండు విడతలగానైనా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
కోటి ఎకరాల్లో వ్యవసాయం కరెంట్‌పైనే ఆధారపడి ఉందని సిపిఎం సభ్యులు జూలకంటి రంగారెడ్డిఅన్నారు. కరెంట్‌తో అనేక ఇతర రంగాలు ముడిపడి ఉన్నందున అవసరమైన కరెంట్ కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సమాధానం 'ఆఫరేషన్ సక్సెస్- పేషెంట్ డెడ్' అన్న చందంగా ఉందన్నారు. 7 గంటలిస్తామన్న చోట 4 గంటలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. కరెంట్ కోతపై ఎఇని అడిగితే డిఇని, డిఇని అడిగితే ఎస్‌ఇని అడగమంటూ కిందనుండి పైదాకా తప్పించుకుంటున్నారన్నారు. లో వోల్టోజీ, కోత సమస్యలను పరిష్కరించాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్స్ కాలిపోతున్నందున రోలింగ్ స్టాకు పెట్టాలని సూచించారు. పొట్టకు వచ్చిన పంట ఎండిపోతోందని సిపిఐ శాసనసభాపక్షనేత జి మల్లేశ్ విమర్శించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది బడ్జెట్‌లో ఉచిత విద్యుత్ కేటాయింపులు రూ.2000 కోట్లు తక్కువగా చూపించడంలో అంతర్యం ఏమిటని లోక్‌సత్తా సభ్యులు జయప్రకాశ్‌నారాయణ నిలదీశారు. ప్రచార హోర్డింగ్‌లకు వాడే విద్యుత్‌ను ఆదా చేస్తే విద్యార్థుల చదువుకు సరిపోతుందని ఎంఐఎం సభ్యులు రసూల్‌ఖాన్ సూచించారు.
6 శాతం విద్యుత్ మాత్రమే కొరత: పొన్నాల
రాష్ట్ర అవసరాల్లో 6 శాతం విద్యుత్ మాత్రమే కొరత ఉందని మంత్రి పొన్నాల లక్ష్యయ్య సమాధానమిచ్చారు. గౌతమి, స్పెక్ట్రమ్, జివికె 2 వ దశ, కోనసీమ, విటిపిఎస్ యూనిట్-6 విద్యుత్ కేంద్రాలలో ప్రతిష్టంభనలు ఏర్పడటం వల్లే ఫిబ్రవరి 28 నుండి విద్యుత్ కొరత పెరిగిందన్నారు. మార్చి 5 నుండి గౌతమి, స్పెక్ట్రం నుండి 550 మెగావాట్స్ విద్యుత్, తొమ్మిదో తేదీనుండి జివికె 2 నుండి 220 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి పున:ప్రారంభమైందని తెలిపారు. మార్చి పదో తేదీన కోనసీమ, 11 నుండి స్పెక్ట్రమ్ పనిచేయడం ప్రారంభమవుతున్నందున విద్యుత్ కొరత తీరుతుందన్నారు. ఇంకా అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేస్తామని సమాధానమిచ్చారు.విద్యార్థులు, తాగు, సాగునీటి అవసరాలకు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.