మైనింగ్‌ మాఫియాను సిగ్గులేకుండా సమర్థిస్తున్నారు

  • ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శ
  • పారిశ్రామికీకరణపై టిడిపి సైంధవపాత్ర : కన్నా ఎదురుదాడి
  • మంత్రివా? రౌడీవా? : ధూళిపాళ బ సభ రెండుసార్లు వాయిదా

బ్రహ్మణి స్టీల్స్‌కు భూ కేటాయింపుపై బుధవారం శాసనసభలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష టిడిపిల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆయా పార్టీల సభ్యులు విమర్శ, ప్రతివిమర్శలతో సభ హోరెత్తింది. మైనింగ్‌ మాఫియాను సిగ్గులేకుండా ఈ ప్రభుత్వం సమర్థిస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. బ్రహ్మణి స్టీల్స్‌కు భూ కేటాయింపు వ్యవహారంపై పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వద్దని చెప్పిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణపై టిడిపి సైంధవ పాత్ర గురించి ప్రజలకు వివరించాలని పరిశ్రమల శాఖ మంత్రి కన్నా లకీëనారాయణ ఎదురు దాడికి దిగడంతో టిడిపి సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఆయనొక మంత్రి అని, ఇలా మాట్లాడటం సరైంది కాదని టిడిపి సభ్యుడు ధూళిపాళ నరేంద్ర అన్నారు. ఆయన మంత్రా? లేక రౌడీయా? అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.

సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ సభను రెండుసార్లు వాయిదా వేశారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో బ్రహ్మణి స్టీల్స్‌కు భూ కేటాయింపు అంశాన్ని టిడిపి సభ్యులు నాగం జనార్ధన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి లేవనెత్తారు.

ఓబులాపురం గనులు ప్రజల ఆస్తి అని, వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ ఖనిజాన్ని కారు చౌకగా ప్రైవేటువ్యక్తులకు ఎలా కట్టబెడతారని సిపిఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. ఎకరాకు రూ.18,500 చొప్పున 10,600 ఎకరాలను బ్రహ్మణి స్టీల్స్‌కు కట్టబెట్టిన మాట వాస్తవమేనా అని సిపిఐ శాసనసభా పక్షనేత జి మల్లేష్‌ ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే ఇక్కడ సమర్థిస్తారా అని అడిగారు. పిఆర్పీ సభ్యుడు కన్నబాబు మాట్లాడుతూ బ్రహ్మణికి కేటాయించిన భూమిని తనఖాపెట్టి బ్యాంకులో లోన్‌ తీసుకున్నది వాస్తవమేనా అని ప్రశ్నించారు. లోక్‌సత్తా సభ్యుడు జయప్రకాశ్‌ నారాయణ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ కాప్టివ్‌ మైనింగ్‌కు దరఖాస్తు చేస్తే అనుమతిస్తారా అని ప్రశ్నించారు. కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌లో ఉన్న కొన్ని నిబంధనలు మార్చాల్సి ఉందని, లాలూచీ పడి తమ అస్మదీయులకే అప్పగించే పద్ధతి వద్దని సూచించారు.

సిగ్గులేకుండా సమర్థిస్తున్న ప్రభుత్వం : చంద్రబాబు

మైనింగ్‌ మాఫియాను సిగ్గులేకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం సమర్థిస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మైనింగ్‌ మాఫియాకు వ్యతిరేకంగా కర్ణా టకలో పిసిసి ఒక పుస్తకం వేసినట్లు సభలో చూపిం చారు. అక్కడ పోరాటం చేస్తుంటే ఇక్కడ సిగ్గు లేకుం డా సమర్థిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం వద్దని

చెప్పినట్లు గుర్తు చేశారు.

మాఫియా నువ్వా? మేమా? : కన్నా ఎదురు దాడి

కుట్ర ప్రకారమే అభివృద్ధిని నిరోధించాలనే ఉద్దేశంతో అడ్డుకుంటున్నారని పరిశ్రమల శాఖ మంత్రి కన్నా లకీëనారాయణ ఆరోపించారు. ఆదిలాబాద్‌లో సిమెంట్‌ ఫ్యాక్టరీని 50 పైసలకే లీజుకిచ్చింది ఎవరని టిడిపిని ప్రశ్నించారు. విజయనగరంలో మాంగనీసు కంపెనీ రూ.150 కోట్ల విలువ చేసే 220 ఎకరాలను రూ.3 లక్షలకు ఇచ్చారని, చీమకుర్తిలో 200 ఎకరాలను మైనింగ్‌ లీజు ఉచితంగా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వరంగ సంస్థ ఒఎన్‌జిసికి ఇవ్వకుండా ప్రైవేటు సంస్థలకు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. ఆల్విన్‌, రిపబ్లిక్‌ ఫోర్బ్స్‌, నిజాం సుగర్స్‌ ఇలా అన్నింటినీ అమ్ముకున్నారని మంత్రి చెప్పారు. 'ఇప్పుడు మాఫియా ఎవరు నువ్వా? మేమా?' అని చంద్రబాబును ప్రశ్నించారు.

20 కోట్లకు మించి ఖర్చుపెడితే సభ్యత్వానికి రాజీనామా : నాగం

ఓఎంసికి సంబంధించిన ఫైళ్లన్నీ సభ ముందుంచాలని డిమాండ్‌ చేశారు. బ్రహ్మణి స్టీల్స్‌ కంపెనీలో రూ.20 కోట్లకు మించి ఖర్చు పెట్టినట్లు నిరూపిస్తే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నారు. ఆ ప్రాంతంలో కేవలం ప్రహరీగోడ, కార్యాలయం మాత్రమే నిర్మించారని చెప్పారు. ప్రభుత్వం కేటాయించిన రూ.1,300 కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు. నైతిక బాధ్యత వహించి గనుల శాఖ మంత్రి రాజీనామా చేస్తారా? అని సవాల్‌ విసిరారు.

సుగర్‌ నుంచి బ్రౌన్‌ సుగర్‌ : రేవంత్‌రెడ్డి

ఓబుళాపురం గనుల వ్యవహారం సుగర్‌ పరిశ్రమకు అనుమతిస్తే బ్రౌన్‌ సుగర్‌ అమ్ముకున్న చందంగా ఉందని రేవంత్‌రెడ్డి అనగానే మైక్‌ కట్‌ చేశారు. దీనిపై స్పీకర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ అంటారా? అని రేవంత్‌రెడ్డిపై కోపోద్రిక్తులయ్యారు. ఓఎంసికి స్టీల్‌లో అనుభవం లేకున్నా పెద్దల అండదండల వల్లే బ్రహ్మణి స్టీల్స్‌ దక్కిందని రేవంత్‌రెడ్డి చెప్పారు.

1100 కోట్లు ఖర్చు చేశాం : మంత్రి బాలినేని

ప్రతిపక్షం కేవలం రూ.20 కోట్లే ఖర్చు చేసినట్లు చెబుతోందని, ఇప్పటి వరకూ బ్రహ్మణి స్టీల్స్‌కు రూ.1,100 కోట్లు యజమాన్యం ఖర్చు చేసిందని, అనవసర వ్యాఖ్యలు చేయొద్దని గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మైనింగ్‌ ఉత్తర్వుల్లో ఎలాంటి నిబంధనలూ లేవని చెప్పారు. బిడ్డింగ్‌లు నిర్వహించడానికి అనుమతి లేదని, ఈ విషయమై కేంద్రం ఆలోచిస్తోందని తెలిపారు. ఓఎంసిలో ఇప్పటి వరకూ 54 లక్షల టన్నుల ఖనిజం తీశారని మంత్రి చెప్పారు. బ్రహ్మణి స్టీల్స్‌కు మొత్తం 80 కోట్ల టన్నుల ముడి ఖనిజం అవసరముందని, ఇక్కడ 6.6 కోట్ల టన్నులు మాత్రమే లభ్యమౌతుందన్నారు. మిగతా ఖనిజం కోసం కర్ణాటకపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. జనార్ధన్‌రెడ్డి ఓఎంసిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. బ్రహ్మణి స్టీల్స్‌ సమస్య ఇప్పుడు హైకోర్టులో ఉందని, తీర్పుకనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇది ప్రశ్నోత్తరాల సమయమో లేక చర్చ జరుగుతోందో అర్థం కావడం లేదని కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ గీతారెడ్డి అన్నారు. సభను సజావుగా నడిపించాలని ఇరు పక్షాలకూ సూచించారు. సభ్యులు పరిధి దాటి మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. బ్రహ్మణిలో వాటాలు వారికున్నాయేమో కానీ తమకు లేవని, ఈ సమస్య గురించి ఎన్నిసార్లు మాట్లాడతారని ప్రభుత్వ విప్‌ శైలజానాథ్‌ అన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్