కరెంట్ కోతపై ట్రాన్స్‌కో సిఎండికి వినతిపత్రం ఇచ్చేందుకు విద్యుత్‌సౌధకు వెళ్లిన ప్రజారాజ్యం అధ్యక్షులు చిరంజీవి లిఫ్ట్‌లో ఇరుక్కున్నారు. ఆయన లిఫ్ట్‌లో ఉన్న సమయంలోనే కరెంట్ ఆగిపోయింది. దీంతో అక్కడ కొద్ది నిమిషాలు గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకున్న సిబ్బంది 20 నిముషాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి చిరంజీవిని లిఫ్ట్‌నుండి బయటకు తీసుకొచ్చారు. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతపై మంగళవారం ఎపి ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట ప్రజారాజ్యం ధర్నాకు దిగింది. అంతకు ముందు నెక్లెస్ రోడ్డునుండి ఖైరతాబాద్ మీదుగా ట్రాన్స్‌కో కార్యాలయానికి పిఆర్పీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.పోలీసులు ఖైరతాబాద్ చౌరస్తాలో కొంతమంది కార్యకర్తలను అడ్డుకుని అరెస్ట్ చేశారు. పోలీసులను దాటుకుని ట్రాన్స్‌కో కార్యాలయానికి మిగిలిన కార్యకర్తలు చేరుకున్నారు. ధర్నానుద్దేశించి చిరంజీవి మాట్లాడారు. ఆస్పత్రులు, స్కూల్స్‌కు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయానికి 7 గంటలు కరెంటు ఇవ్వాలన్నారు. లో వోల్టేజి సమస్యను పరిష్కరించాలని, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను 24 గంటల్లో బాగుచేయాలని సూచించారు. విద్యుత్ రంగానికి సంబంధించి నిధులు పుష్కలంగా కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నాకు దిగిన తమ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమని చిరంజీవి పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ధర్నా జరుగుతున్న సమయంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన ట్రాన్స్‌కో ఉద్యోగులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు సి రామచంద్రయ్య, పార్టీ ఎమ్మెల్యేలు వంగా గీత, శోభానాగిరెడ్డి, కె కన్నబాబు, కాటసాని రామిరెడ్డి, మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.