తీవ్ర విద్యుత్‌ సమస్య

  • మరో లక్ష కుటుంబాలకు ఉపాధి పనులు
  • తూర్పుగోదావరి జిల్లా సమీక్షలో సిఎం

రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య తీవ్రంగా వేధిస్తోందని ముఖ్యమంత్రి కె రోశయ్య అభిప్రాయపడ్డారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రులు పి విశ్వరూప్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ విద్యుత్‌ ఉత్పాదనకు, డిమాండ్‌కు మధ్య గత కొంతకాలంగా చాలా వ్యత్యాసముందన్నారు. అది ఇంకా పెరుగుతుందని, మరింత వ్యత్యాసం ఏర్పడే ప్రమాదముందన్నారు. వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే నెలరోజుల్లో ఈ సమస్యకు ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టేందుకు రాష్ట్రస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత వారం జరిగిన కేబినెట్‌లో సహచర మంత్రులతో విద్యుత్‌ సమస్యపై రెండు గంటల పాటు చర్చించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలు తీరుపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. దీంతోబాటు నీటిపారుదల, మౌలికవసతులు, రోడ్ల అనుసంధానం వంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా విస్మరించరాదన్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ, విద్యార్థులకు పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్పులు, సంక్షేమ హాస్టళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలల పనితీరును కూడా సమీక్షించాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది ప్రవహిస్తుండటంతో కొంతమేరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిని నివారించవచ్చన్నారు. జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్చి చివరి నాటికి మరో లక్ష కుటుంబాలకు ఉపాధి కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈ పనులను బాగా వాడుకోవడం వల్ల కొంత వరకూ అభివృద్ధి సాధ్యమైందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ పనులకు రూ.44.50 లక్షల నిధులు ఖర్చు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడానికి తగిన సూచనలివ్వాలని కోరారు. రేషన్‌కార్డులు, సామాజిక ఫించన్లను జనాభాతో సంబంధం లేకుండా ఇచ్చామని, వీటిపై సమగ్ర సర్వే నిర్వహించి, అర్హులైన లబ్ధిదారులకు అందజేయనున్నట్లు చెప్పారు. స్క్రీనింగ్‌ పేరుతో ఎవరికీ అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా జిల్లాలో రూ.119.67 లక్షలతో శస్త్రచికిత్సలు చేసినట్లు చెప్పారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్