హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్‌

  • ఒకరి హత్య
  • మరొకరు క్షేమంగా ఇంటికి

వైష్ణవి కిడ్నాప్‌, హత్యోదంతం మరువక ముందే హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్‌కు గురయ్యారు. వీరిలో ఒకరు హత్యకు గురయ్యారు. మరో చిన్నారి సోమవారం రాత్రి క్షేమంగా ఇంటికి చేరారు. సంచలనం కల్గించిన ఈ సంఘటనలపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని ఖాజీపురలో నివసించే మహ్మద్‌ అమీర్‌ఖాన్‌ వృత్తిరీత్యా బంగారం వ్యాపారి. ఆయన కుమారుడు నూరుల్లా అలియాస్‌ తర్వీన్‌(6) ఇంటికి దగ్గరలో ఉన్న క్రౌన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో యుకెెజి చదువుతున్నాడు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం బడికి బయలుదేరి, రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా దర్గా సమీపంలో మోటార్‌ సైకిలుపై వచ్చిన అగంతకులు కిడ్నాప్‌ చేశారు. స్థానికులు తేరుకునేలోపు వారు బాలుణ్ని తీసుకొని పరారయ్యారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు ఆ బాలుని కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు వెంటనే షాలిబండ పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వెంటనే ఆ పరిసర ప్రాంతాల్లోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు సమాచారమందించి, తనిఖీలు చేసినప్పటికీ కిడ్నాపర్ల ఆచూకీ తెలియలేదు. కాగా కిడ్నాపర్లు బాలుని తండ్రికి ఫోన్‌ చేసి పది లక్షల రూపాయలివ్వాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివుంటుందని హెచ్చరించారు. మీడియాను, పోలీసులను పిలిచి హడావిడి చేయొద్దని బెదిరించారు. దీంతో కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కిడ్నాపర్లు 9949141523, 9603979469 నెంబర్లు గల మొబైల్స్‌ నుండి బాలుని తండ్రికి ఫోన్‌ చేశారు. ఈ నంబర్లకు పోలీసులు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించగా అవి అప్పటికే స్విచాఫ్‌ చేశారు. కిడ్నాప్‌ చేసిన వారు అమీర్‌ఖాన్‌కు తెలిసినవారై ఉంటారని పోలీసులు అనుమానించారు. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు ముగ్గురు నిందితులను సోమవారం రాత్రి అరెస్ట్‌ చేసి చిన్నారిని విడిపించారు. సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్‌ ఎకెఖాన్‌ కిడ్నాప్‌ వివరాలను వెల్లడించారు.

కిడ్నాప్‌ జరిగిన వెంటనే ముఖ్యమంత్రి, హోమంత్రి, డిజిపిల నుండి దర్యాప్తును ముమ్మరం చేసి బాలున్ని సురక్షితంగా రక్షించాలంటూ ఆదేశాలందాయని తెలిపారు. దీంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి నగరాన్ని జల్లెడపట్టినట్లు చెప్పారు. ముఖ్యంగా బాధితుని బంధువులను విచారించడంతో లభించిన ఆధారాలతో కిడ్నాపర్లను పట్టుకున్నామన్నారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో హసన్‌నగర్‌కు చెందిన బంధువు సయ్యద్‌ రషీద్‌(22), మహ్మద్‌ పహీమ్‌(23), మధ్యప్రదేశ్‌కి చెందిన రాజేష్‌వర్మ(25)లు ఉన్నారు. బాలుని తండ్రికి భూ విక్రయంలో మంగళవారం 16 లక్షల రూపాయలు వస్తున్నట్లు తెలుసుకున్న బంధువు రషీద్‌ బాలుని కిడ్నాప్‌కు పథకం రూపొందించి అమలు చేసినట్లు కమిషనర్‌ తెలిపారు. బాలుని కిడ్నాప్‌ జరిగిన 12 గంటల వ్యవధిలో పోలీసులు కిడ్నాపర్లను అరెస్ట్‌ చేయడం విశేషం. బాలుడు క్షేమంగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

మరో బాలుని హత్య

సంతోష్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం సాయంత్రం కనిపించకుండాపోయిన మరో బాలుణ్ని అగంతకులు పహాడి షరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హత్య చేశారు. సంతోష్‌నగర్‌లోని డివి దర్గా వద్ద నివసించే సయ్యద్‌ తాజ్‌ వృత్తి రీత్యా చిరువ్యాపారి. ఆయన కుమారుడు సయ్యద్‌ ఫైసల్‌(10) ఆదివారం రాత్రి నుండి కనిపించకపోవడంతో సంతోష్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా సోమవారం పహాడిషరీఫ్‌ పరిధిలోని అబ్బాస్‌ పార్క్‌ కాలనీ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న గ్రౌండ్‌లో బాలుని మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. బాలుణ్ని విచక్షణారహితంగా కొట్టి గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు కనిపించాయి. మొదట గుర్తు తెలియని శవంగా భావించారు. సోమవారం రాత్రి బాలుణ్ని కుటుంబ సభ్యులు గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. ఎవరు తీసుకెళ్లి ఎందుకు హత్య చేశారో తెలియదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్