యూనివర్సిటీల వైస్‌ఛాన్సలర్లపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నిప్పులు చెరిగారు. యూనివర్సిటీల పనితీరును మెరుగుపరచడంలో విఫలమైతే తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు. విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలన్నారు. డిగ్రీలు అందించే కర్మాగారాలుగా గాక సమాజానికి ఉపయోగపడే విద్యార్థులతో యూనివర్సిటీలను తీర్చిదిద్దాలని తెలిపారు. వార్షిక ప్రణాళిక చేపట్టకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారు. మూడు నెలలకొకసారి యూనివర్సిటీల నివేదిక సమర్పించాలని తెలిపారు. విద్యాప్రమాణాలే గీటురాయిగా యూనివర్సిటీలను నడిపించాలని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. యూనివర్సిటీల వైస్‌ఛాన్సలర్ల సదస్సు సోమవారం ఉదయం జూబ్లీహాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ఉన్నత విద్యాశాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు, ఉన్నత విద్య ముఖ్యకార్యదర్శి సిఆర్ బిశ్వాల్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కెసిరెడ్డి, సాంకేతిక విద్యాశాఖ అధికారి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, సెక్రటరీ క్రిష్టఫర్, తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ 'నేను లౌక్యంగా చెప్పలేను. నిజం చెబుతున్నాను. ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి యూనివర్సిటీలు దృష్టి సారించాలి. మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు టీచింగ్ ఫ్యాకల్టీని పటిష్టంగా అమలు పర్చాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి. ఫలితాలు ప్రకటించాలి. విద్యార్థులు యూనివర్సిటీలకు వచ్చిన నాటి నుంచి వారికి వైస్‌ఛాన్సలర్లే తల్లిదండ్రులు. తల్లిదండ్రులు విద్యార్థులను మీ చేతుల్లో పెడుతున్నప్పుడు వారిని ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మీదే. దరఖాస్తులు ఇచ్చిన నాటి నుంచి ఫలితాల ప్రకటించే వరకూ విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను తయారుచేయాలి. పరీక్షలను, ఫలితాలను సకాలంలో కచ్చితంగా ప్రకటించి తీరాలి. నేను గట్టిగా చెబుతున్నాను. నిర్బంధంగా, ఆదేశంగా అమలుచేయాలి. దీన్నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కుపోవద్దు. ఆర్థికపరమైన విషయాల్లోనూ ప్రణాళికలు తయారుచేసుకోవాలి. ముందుచూపు తప్పనిసరిగా ఉండాలి. విద్యలో నీవు, నేను అనేది గాకుండా మనందరం అనే భావనతో ముందుకుసాగాలి. యూనివర్సీటీలకు స్వయంప్రతిపత్తి అవసరమే. కానీ జవాబుదారీతనం లేని స్వయం ప్రతిపత్తి అర్థరహితం. యూనివర్సిటీలకు అనుసంధానంగా ఉన్న కాలేజీలు యుజిసి నిబంధనల ప్రకారం ఉంటున్నాయా, లేవా చూడాలి. భవనాలున్నా ల్యాబ్‌లు, లైబ్రరీలు తప్పనిసరిగా ఉండాలి. వాటిని తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచడం కోసం వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. ప్రతి మూడు నెలలకొకసారి యూనివర్సిటీలు సాధించిన ప్రగతిని నివేదికల రూపంలో సమర్పించాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం.' అని అన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో దళితుల సమస్యలు చర్చించాలి
జాయింట్ సెలక్ట్ కమిటీకి ఆస్తుల ధ్వంసం బిల్లు
కేంద్ర ఉద్యోగులకు 8 శాతం డిఎ పెంపు
22న క్యాంప్ ఆఫీసులోకి సిఎం !
హేడ్లీతో అమెరికా మ్యాచ్ ఫిక్సింగ్
'క్యాట్' ముందుకు డిజిపి
కేబుల్ ప్రసారాల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ
వెంకటాపురం అడవుల్లో ఎదురు కాల్పులు
నర్సింగ్ విద్యార్థుల స్టైఫండ్ పెంపు