బడ్జెట్ సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. బడ్జెట్ ఆమోదింపచేసుకోవడం అత్యంతకీలకం కావడంతో ముఖ్యమంత్రి కె. రోశయ్య ఈ విషయమై దృష్టి సారించారు. ఢిల్లీ పర్యటన నుండి తిరిగివచ్చిన ఆయన సోమవారం ఉదయమే శాసనసభా సమావేశాల నిర్వహణపై కసరత్తు ప్రారంభించారు. పదకొండు మంది మంత్రులతో సమావేశమైనారు. మంగళ, బుధ వారాల్లో కూడా ఈ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం నిర్వ హించిన సమావేశంలో ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన బడ్జెట్ సమావేశాలపై దృష్టి సారించాలని ఆయన మంత్రులను కోరారు. ఇప్పటిదాకా వివిధ అంశాల్లో తలమునకలుగా ఉన్న మంత్రులు ఇకనుండి శాసనసభా సమావేశాలకు సిద్దం కావాలని కోరారు. వివిధ రకాల ఆందోళనలు, పరిస్థితులుకారణంగా శాఖలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించలేని మంత్రులూ సీరియస్‌గా తీసుకోవాలని, అధికారులతో సమావేశాలు జరపాలని ఆదేశించారు. ప్రతిపక్షాలు లేవనెత్తే విషయాల్లో సమాధానమివ్వ డానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ సిద్దంగా ఉండాలని చెప్పారు. 'ప్రతిపక్షాలు ఏ అంశాలు లేవనెత్తుతాయో మనకు తెలుసు. వాటిపై సిద్దం కావాలి. ప్రతిపక్షానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదు. సభలో అందరూ ఐక్యంగా ఉండాలి. దాడిని తిప్పికొట్టాలి' అని అన్నారు. శాసనసభా సమావేశాలకు ఎంఎల్‌ఏల హాజరు బాధ్యతను మంత్రులే చూసుకోవాలని, సమావేశాలు జరుగుతున్న సమ యంలో అందరు తప్పనిసరిగా సభలోనే ఉండాలని సూచించారు. ఈ విషయంలో జిల్లాల మంత్రులే పూర్తిబాధ్యతలు తీసుకోవాలని సూచించారు. 'ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. పూర్తిగా సిద్దంకండి. ఎంఎల్‌ఏలనూ తయారుచేయండి. విపక్షం దాడిచేస్తే సమర్ధవంతంగా తిప్పికొట్టాలి' అని ఆయన అన్నారు. ఢిల్లీ పర్యటన విశేషాలనూ ముఖ్యమంత్రి వివరించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే తగ్గుముఖం పడుతున్నాయని, రానున్నరోజుల్లో మరింతగా తగ్గుతాయని ప్రధానమంత్రి చెప్పారని మంత్రులకు వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ తీరును హోంమంత్రి ప్రశంసించారని చెప్పారు. 'చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా ఉంది' అని హోంమంత్రి అన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు సబితాఇంధ్రారెడ్డి, గీతారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ముఖేష్‌గౌడ్, రఘువీరారెడ్డి, పార్ధసారధి, విశ్వరూపన, శత్రుచర్ల విజయరామరాజు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి నిధికి సానుకూలత
ఎంఎల్‌ఏల నియోజకవర్గ అభివృద్ధి నిధిని పునరుద్దరించడానికి ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రతిపాదనల్లో నియోజకవర్గానికి కనీసం కోటిరూపాయలు కేటాయించాలని మంత్రులు ఈ సమావేశంలోసిఎంనుకోరారు. సమావేశంలో పాల్గొన్న అందరు మంత్రులు ఇదే విషయాన్ని చెప్పడంతో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థికపరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలని, బడ్జెట్ ప్రతిపాదనల్లో వివిధ శాఖలు ఆశిస్తున్నంతగా కేటాయింపులు ఉండకపోవచ్చని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. కొందరు మంత్రులు తమ శాఖలకు గతంలో ఇచ్చిన విధంగా ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ 'అందుబాటులో ఉండే నిధులను బట్టె కేటాయింపులుంటాయి. దీనిని అందరు అర్ధం చేసుకోవాలి. ఈ విషయంలో ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టడానికి సిద్దం కావాలి' అని అన్నట్లు తెలిసింది.