'భట్టి' ఎస్కార్ట్‌ వాహనం డీకొని ఐదుగురి దుర్మరణం

నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం వద్ద 9వ నెంబర్‌ జాతీయ రహదారిపై ప్రభుత్వ ఛీఫ్‌విప్‌ మల్లు భట్టి విక్రమార్క ఎస్కార్ట్‌ జీపు ఆటోను ఢకొీంది. దీంతో ఐదుగురు దుర్మరణం చెందారు. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన జీపు వెనుక వాహనంలోనే భట్టి విక్రమార్క ఉన్నారు. సంఘటనా స్థలంలో కొద్దిసేపు ఆగి పోలీసులకు, 108కు ఫోన్‌ చేసి సమాచారమందించి వెళ్లిపోయారు. బాధిత కుటుంబాలకు లక్ష రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన ఐతగోని జయచందర్‌ కుటుంబ సభ్యులతో కలిసి కొంత కాలం క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ నుండి ఆటోలో బయలుదేరారు. ఆటో చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ప్రభుత్వ ఛీఫ్‌విప్‌ మల్లు భట్టివిక్రమార్క ఎస్కార్ట్‌ జీపు లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢకొీట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న జయచందర్‌(35), ఆయన భార్య ఐతగోని లింగమ్మ(29), మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్‌ రాములు(30) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జయచందర్‌ కుమారుడు నిఖిల్‌ (5), రమాదేవి(23) ఆసుపత్రిలో చనిపోయారు.సంఘటన జరిగినప్పుడు భట్టి విక్రమార్క ఎస్కార్ట్‌ జీపు వెనక వాహనంలోనే ఉన్నారు. సంఘటనా స్థలంలో కొద్దిసేపు ఆగి, ప్రమాద విషయాన్ని 108, పోలీసులకు ఫోన్‌ద్వారా తెలిపారు. ఆ తరువాత హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. మృతుల కుటుంబాలతో పాటు బాధితులను ఆదుకోవాలని గ్రామస్తులు, బంధుమిత్రులు హైవేపై రాస్తారోకో చేశారు. జయచందర్‌ కూతురు నీహారిక, తంగడపల్లికి చెందిన లింగమ్మ, లింగాల శివ, కొయ్యలగూడెం గ్రామానికి చెందిన గుర్రం నరేందర్‌, ఎస్కార్ట్‌ జీపులో ఉన్న ఖమ్మం జిల్లా ఎఆర్‌ పోలీసులు బి.గంగరాజు, బి.హరినాథ్‌, ఎం.రావుజీ, కె.నాగేశ్వర్‌రావు, జి.లచ్చిరాం, ఎస్కార్ట్‌ డ్రైవర్‌ ఎమ్‌డి.గౌస్‌ గాయపడ్డారు. వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. చౌటుప్పల్‌ సిఐ తిరుపతన్న పర్యవేక్షణలో ఎస్‌ఐ శ్రీనివాస్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్