విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లిం రిజర్వేషన్లు చెల్లవు

  • ఎపి హైకోర్టు సంచలనాత్మక తీర్పు
  • సుప్రీంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేస్తాం : సిఎం

ముస్లిం రిజర్వేషన్ల ప్రక్రియకు న్యాయస్థానంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వోద్యోగాల్లో, విద్యా సంస్థల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తూ రూపొందించిన చట్టాన్ని హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ముస్లింలకు బిసి 'ఇ' కేటగిరీ కింద రిజర్వేషన్లు కల్పించడానికి నిర్దేశించిన 'చట్టం 27, 2007' చెల్లదని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృతస్థాయి ధర్మాసనం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. బిసి కమిషన్‌ నివేదిక అశాస్త్రీయమని, వివేచనారహితమని ఐదుగురు న్యాయమూర్తులు తీర్పు చెప్పగా, కమిషన్‌ నివేదికను, ముస్లిం రిజర్వేషన్లను సమర్థిస్తూ ఇద్దరు న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి దవే, న్యాయమూర్తులు టి మీనాకుమారి, ఎ గోపాల రెడ్డి, వి ఈశ్వరయ్య, జి రఘురాం మెజార్టీ రిజర్వేషన్‌ చట్టం, బిసి కమిషన్‌ నివేదిక చెల్లవని తీర్పు చెప్పగా, న్యాయమూర్తులు బి ప్రకాశరావు, డిఎస్‌ఆర్‌ వర్మ మైనార్టీ రిజర్వేషన్లను సమర్థిస్తూ విడిగా తీర్పు చెప్పారు. రిజర్వేషన్‌ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన మెజార్టీ బెంచ్‌ తీర్పు చెప్పినందున ముస్లిం రిజర్వేషన్‌ చట్టం చెల్లదు. హైకోర్టు విస్తృత ధర్మాసనం వెలువరించిన తీర్పును 90 రోజుల పాటు సస్పెండ్‌ చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను విస్తృత ధర్మాసనం తిరస్కరించింది. ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం చెల్లదని ప్రధాన న్యాయమూర్తి దవే, న్యాయమూర్తులు ఎ గోపాల రెడ్డి, ఈశ్వరయ్య, రఘురామ్‌ విడిగా తీర్పు చెప్పారు. కాగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ మీనా కుమారి విడిగా తీర్పు చెప్పారు. అయితే కమిషన్‌ నివేదిక లోపభూయిష్టమని, అశాస్త్రీయమని ఆమె తన తీర్పులో ప్రకటించారు. రిజర్వేషన్‌ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ టి మురళీధరరావు సహా మరో 16 మంది వేరువేరుగా దాఖలు చేసిన రిట్లను కోర్టు అనుమతించింది. న్యాయమూర్తులు ఎ గోపాల రెడ్డి, ఈశ్వరయ్య, రఘురాం తరపున ప్రధాన న్యాయమూర్తి దవే తీర్పును వెల్లడించారు.

తీర్పులోని అంశాలు

ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం చెల్లదు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తే అది మత మార్పిడిని ప్రోత్సహించేందుకు దారి తీస్తుంది. ఈ దృష్ట్యా రిజర్వేషన్‌ చట్టం చెల్లదని నలుగురు న్యాయమూర్తులు ప్రకటించారు. బిసి కమిషన్‌ నివేదిక ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్‌ కల్పించారు. అయితే ఈ నివేదిక లోపభూయిష్టంగా, అశాస్త్రీయంగా ఉన్నందున దాని ఆధారంగా రూపొందించిన చట్టం చెల్లదు. కమిషన్‌ తన నివేదికను రూపొందించడంలో 'ఫాస్ట్‌ ట్రాక్‌' పద్ధతిని పాటించింది. ఇది 'హిట్‌ అండ్‌ రన్‌' మాదిరిగా ఉంది. ఇది చట్టపరంగా లేదు. న్యాయ సమీక్షకు నిలువజాలదని ధర్మాసనం పేర్కొంది. కృష్ణన్‌ సిఫార్సుల మేరకు కమిషన్‌ తన నివేదికను రూపొందించింది. అసలు కృష్ణన్‌ నియామకమే చెల్లనప్పుడు ఆ సిఫార్సుల ఆధారంగా రూపొందించిన కమిషన్‌ నివేదికను చట్ట ప్రకారం పరిగణనలోకి తీసుకోజాలమని ధర్మాసనం తీర్పు చెప్పింది. అసలు బిసిలను గుర్తించడంలో కమిషన్‌ ఏ ప్రాతిపదికను తన పరిధిలోకి తీసుకుందో అంతుచిక్కడం లేదని ధర్మాసనం పేర్కొంది. సమగ్రంగా, శాస్త్రీయంగా సర్వే జరిపి నివేదికను రూపొందించడంలో కమిషన్‌ విఫలమైందని బెంచ్‌ అభిప్రాయ పడింది. కేవలం తనకు అందుబాటులో ఉన్న సమీప ఇళ్లలో సర్వే జరిపి నివేదిక రూపొందించిందని బెంచ్‌ పేర్కొంది. గతంలో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని కొట్టివేస్తూ హైకోర్టు 'అర్చనా రెడ్డి' కేసులో ఇచ్చిన తీర్పులో పేర్కొన్న మార్గదర్శక సూత్రాలను పాటించాల్సిందేనని బెంచ్‌ ప్రకటించింది. బిసిలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారుగా గుర్తించడానికి కమిషన్‌కు నివేదించే అధికారం ప్రభుత్వాని కుందని కోర్టు చెప్పింది. కమిషన్‌ చేసిన దర్యాప్తు సంపూర్ణంగా లేదు. కమిషన్‌ తన సర్వేను ఆరు జిల్లాలకే పరిమితం చేసింది. కమిషన్‌ నివేదిక ఆధారంగా చేసిన ముస్లిం రిజర్వేషన్ల చట్టం 27, 2007 రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15(4), 15(5), 16(4)కు విరుద్ధమని, చెల్లదని బెంచ్‌ ప్రకటించింది.

నివేదిక లోపభూయిష్టం : జస్టిస్‌ మీనాకుమారి

చట్టంలోని నిబంధనల ప్రకారం సాంఘికంగా, విద్యాపరంగా వెనకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించే నిమిత్తం వర్గాన్ని గుర్తించడానికి కమిషన్‌కు నివేదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికుందని జస్టిస్‌ మీనాకుమారి ప్రకటించారు. కమిషన్‌ నివేదిక లోపభూయిష్టం. కేవలం రెండు, మూడు రోజుల్లో రూపొందించింది. కమిషన్‌ ముందు వాస్తవమైన సమాచారం, సక్రమమైన డేటా లేదని ఆమె ప్రకటించారు. పిఎస్‌ కృష్ణన్‌ సిఫార్సులను మక్కీకి మక్కీ కమిషన్‌ తన నివేదికలో దింపింది. కమిషన్‌ కొన్ని ప్రాంతాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఇతర అన్ని ప్రాంతాలనూ విస్మరించిందని జస్టిస్‌ మీనాకుమారి తెలిపారు. అర్చనారెడ్డి, ఇంద్ర సహానీ, అశోక్‌ కుమార్‌ ఠాకూర్‌ (రిజర్వేషన్ల విషయంలో గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు) కేసుల్లోని మార్గదర్శక సూత్రాలకు ప్రస్తుత చట్టం విరుద్ధంగా ఉందని జస్టిస్‌ మీనాకుమారి స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్‌ చట్టం జ్యుడీషియల్‌ స్క్రూటినీకి నిలువజాలదని ఐదుగురు న్యాయమూర్తులూ ఏకీభవించారు. కాగా రిజర్వేషన్లను సమర్థిస్తూ జస్టిస్‌ బి ప్రకాశరావు, జస్టిస్‌ డిఎస్‌ఆర్‌ వర్మ విడివిడిగా తీర్పు చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడంలో తప్పు లేదని జస్టిస్‌ ప్రకాశరావు ప్రకటించారు. కమిషన్‌ మరీ అంత కచ్ఛితంగా వ్యవహరించాల్సిన పని లేదన్నారు.

అప్రమత్తమైన ప్రభుత్వం

హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వమూ అప్రమత్తమైంది. ఎంఐఎం ఆందోళన కొనసాగుతుండగానే ముఖ్యమంత్రి రోశయ్య తీర్పు, దాని అనంతర పరిణామాల విషయమై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమయ్యారు. అడ్వకేట్‌ జనరల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ఆదేశించారు. ముస్లిలంలకు నాలుగు శాతం రిజర్వేషన్ల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నిర్వహించిన మంత్రుల సమావేశంలోనూ ఈ విషయం చర్చకు వచ్చింది. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమాత్రం మారలేదని, ఈ విషయాన్ని మంత్రులందరూ తమ జిల్లాల్లో స్పష్టంగా చెప్పాలని సిఎం సూచించారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్