ఆర్థికమాంద్యం నేపథ్యంలో పారిశ్రామిక వేత్తలకు ప్రకటించిన లక్ష కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని సామాన్య ప్రజలపై భారాలు వేయటం ద్వారా తిరిగి రాబట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు విమర్శించారు. 18 నుండి 20 శాతంగా ఉన్న ఆహారధాన్యాల ద్రవ్యోల్బణాన్ని తగ్గించకపోవటానికి కారణ మిదేనని అన్నారు. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరల పట్ల కలకత్తాలో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొన్న ప్రతినిధులందరూ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో తనను కలిసిన విలేకరులతో రాఘవులు మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు ప్రస్తావించిన అనేక అంశాలను గురించి ఆయన వివరించారు. అధిక ధరల విషయంలో ప్రధాని మన్మోహన్, కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్‌పవార్ తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ ప్రజలమీదికి నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పంచదార తినకపోతే కొంపలేం మునిగిపోంటూ శరద్‌పవార్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు కాబట్టే ఆహార ధాన్యాల ధరలు పెరిగిపోతున్నాయంటూ గతంలో ఆయన వ్యాఖ్యానించారని రాఘవులు గుర్తు చేశారు. ధరలు తగ్గాలంటే వినియోగాన్ని తగ్గిం చాలనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరి స్తోందని దుయ్యబట్టారు. మార్కెట్లు, ఎగుమ తులు, దిగుమతులపై ప్రభుత్వ నియంత్రణ కొరవడిందని చెప్పారు. ఈ సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమాలు చేపట్టేందుకు కేంద్ర కమిటీ నిర్ణయించిందని అన్నారు. ఇందులో భాగంగా మార్చి 12న చేపట్టబోయే చలో పార్లమెంటు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రం నుండి కూడా జన సమీకరణ చేస్తామని తెలిపారు. ఈ విషయంపై సిపిఐతో కూడా మాట్లాడుతామని వివరిం చారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే విధంగా పారిఖ్ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు.ఆయిల్ కంపెనీలపై ధరల నియంత్రణ లేకపోవటం అభ్యంతరకరమని వ్యాఖ్యానించారు. పారిఖ్ కమిటీ సిఫార్సులు ఎప్పుడు అమల్లోకి వస్తే అప్పుడు వ్యతిరేకించాలని కేంద్ర కమిటీ నిర్ణయించిందని అన్నారు. ఇందుకోసం ఇతర పార్టీలను కూడా సంప్రదించి పోరాటాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు.
రాష్ట్ర పరిస్థితులపై.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి కేంద్ర కమిటీకి
వివరించామని రాఘవులు అన్నారు. ఇక్కడి ప్రభుత్వం ఏ రకంగా నిశ్చేష్టంగా మారింది, పరిపాలన ఏ విధంగా స్థంభించిందీ, రాష్ట్ర విభజన, సమైక్యత ఉద్యమాల నేపథ్యంలో ప్రజా సమస్యలు ఏ రకంగా పక్కకు పోయాయనే విషయాలను వివరించామని తెలిపారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ సమైక్యత కోసం నిలబడి, సాధారణ పరిస్థితికి ఎదురీదాల్సి వచ్చినప్పటికీ సూత్రబద్ధ వైఖరికి కట్టుబడి ఉండటం అభినందనీయమని కేంద్ర కమిటీ పేర్కొనట్లు తెలిపారు. ఇదే సమయంలో చర్చల ప్రక్రియ, మెకానిజంలో భాగంగా శ్రీకృష్ణ కమిటీని వేయడాన్ని కేంద్ర కమిటీ ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ కమిటీ సమస్యను పరిష్కరిస్తుందా? లేదా? అనే విషయం దాని విధివిధానాల (టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)నుబట్టి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమస్యను కాంగ్రెస్ పార్టీ సాగదీయటం వల్ల ప్రజా సమస్యలు మూలన పడుతున్నాయని అన్నారు. వీటిని శాసనసభలో ప్రస్తావించేందుకు కూడా అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలిపారు. అందువల్ల సభ వెలుపల కూడా సమస్యలపై ఉద్యమించాలని పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ఈనెల 10,11 తేదీల్లో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ విషయాలపై చర్చిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక దుస్థితిని ఎదుర్కొంటోందని విమర్శించారు. ప్రభుత్వానికి అప్పులు దొరకటం లేదని, స్థలాలు అమ్మి పోగుచేసుకుందామన్నా నిధులు దొరకటం లేదని తెలిపారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులను కూడా రాబట్టుకునే స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని విమర్శించారు. గతంలో ప్రవేశపెట్టిన లక్షా మూడు వేల కోట్ల బడ్జెట్‌ను ఖర్చు పెట్టేందుకు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని అన్నారు. రాబోయే కాలంలో ఆదాయాలు ఇంకా తగ్గుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కోతలు మొదలెట్టిందని విమర్శించారు. కోతలు లేని వాటికి డబ్బులు ఇవ్వకుండా వాయిదా వేస్తోందని అన్నారు. డబ్బులు లేవనే కారణంతో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే 108,104 వాహనాల ట్రిప్పులను కుదించటం దారుణమని వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టుల ప్రాధాన్యతలపై అఖిలపక్షం
ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని రాఘవులు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వివాదాస్పదం కాకుండా ఉండేందుకు జలయజ్ఞంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, రైతు సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యతలను ఎంపిక చేయాలని కోరారు. వైఎస్ అధికారం చేపట్టిన మూడు రోజులకే ప్రాజెక్టుల్లో ప్రాధాన్యతలను గుర్తించాలని తమపార్టీ విజ్ఞప్తి చేసిందని గుర్తుచేశారు. ఆనాడు తమ సూచనను పట్టించుకోలేదని అన్నారు. డబ్బులు ఉన్నప్పుడు ప్రాధాన్యతలు గుర్తించని ప్రభుత్వం, డబ్బుల్లేని ప్రస్తుత సందర్భంలో ప్రాధాన్యతల గురించి మాట్లాడితే ప్రయోజనం ఏం ఉందని అన్నారు. గత బడ్జెట్‌లో కేటాయించిన 18 వేల కోట్ల రూపాయలకే దిక్కులేనప్పుడు ఈ బడ్జెట్‌లో 28 వేల కోట్ల రూపాయలు జలయజ్ఞానికి ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు.