సమైక్యాంధ్ర జెఏసి విద్యార్థి నేతలు రాష్ట్ర రాజధానికి చేపట్టిన పాదయాత్రను భగం చేసి అరెస్టు చేయడానికి నిరసనగా సోమవారం సీమాంధ్ర విద్యాసంస్థల బంద్ పాక్షికంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి, ప్రభుత్వ చర్యను నిరసించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆందోళన పాక్షికంగానే జరిగింది. సమైక్యాంధ్ర కోరుతూ ఐదుగురు ఎయు విద్యార్థులు చేపట్టిన పాదయాత్రను టిడిపి నేత కె.ఎర్రన్నాయుడు శ్రీకాకుళంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర సీమాంధ్రలోని అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల మీదుగా మార్చి 13న తిరుపతి చేరుకుంటుంది. పాదయాత్రలో సమైక్యాంధ్ర ఆవశ్యకతనూ, ప్రత్యేక తెలంగాణ వల్ల వచ్చే నష్టాలనూ ప్రజలకు వివరించనున్నట్టు విద్యార్థి నాయకుడు ఆరేటి మహేష్ తెలిపారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వరా విశ్వవిద్యా లయంలో విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులను బహిష్కరించారు. బంద్‌లో పాల్గొన్న విద్యార్థులు స్థానిక బైరాగి పట్టడి నుంచి మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బంద్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. కడప జిల్లాలో విద్యాసంస్థల బంద్ పాక్షికంగా జరిగింది. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీ విద్యార్థులు బంద్ పాటించారు. జిల్లాల్లో పలు ప్రాంతాల్లో సమైక్యాంధ్ర కోరుతూ ర్యాలీలు నిర్వహించారు. విజయవాడ బంద్ పాక్షికంగా జరిగింది. కళాశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్ పాటించినప్పటికీ పలు ప్రాంతాల్లో పాఠశాలలు యథావిథిగా కొనసాగాయి. ప్రకాశం జిల్లాలో విద్యా సంస్థల బంద్ ప్రభావం కనిపించలేదు. ఒంగోలులో కొన్ని విద్యాసంస్థల వారు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. నెల్లూరు జిల్లా వ్యాపితంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి.
నాగార్జున వర్శిటీకి తాళాలు
హైదరాబాద్‌కు పాదయాత్ర చేస్తున్న విద్యార్థి జెఎసి నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఇచ్చిన పిలుపు మేరకు నాగార్జున విశ్వవిద్యాలయానికి సోమవారం తాళాలు వేశారు. వర్శిటీ బస్సులు లోపలకు వెళ్లకుండా జెఎసి విద్యార్థి నాయకులు అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి ఐక్యకార్యాచరణ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ ఎం.వెంకటరమణ మాట్లాడుతూ సమైక్యాంధ్రపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేవరకూ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ విధివిధానాలు ప్రకటించిన తరువాత తమ భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పారు.