శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల వారినీ సంతృప్తి పరిచేలా అవి లేకపోతే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే అవకాశ ముందని ఆందోళన చెందుతోంది. కమిటీ రూపురేఖలపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, పార్టీల నుంచి ముందు కొస్తున్న డిమాండ్లను నిశితంగా పరిశీలి స్తోంది. ఈ నేపథ్యంలో విధివిధానాలపై మరోసారి చర్చ జరపాలని పార్టీ నిర్ణయించింది. వాస్తవానికి విధివిధా నాలపై సోమవారమే ప్రకటన చేయాలని హోం శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని శాఖ అత్యున్నత అధికారే ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఈ అంశంపై కాంగ్రెస్ మరోమారు చర్చించాలని భావిం చిన నేపథ్యంలో విధివిధానాల ప్రకటన వాయిదా పడింది. 'సోమవారమే వెల్లడిం చాలని మేం భావించాం. అయితే, మరో సారి లోతుగా చర్చించాల్సిన అవసరముందని కాంగ్రెస్ పార్టీ
భావిస్తోంది. పార్టీ కోర్ కమిటీ మరోసారి చర్చ జరిపిన తర్వాతే విధివిధానాలను వెల్లడిస్తాం' అని హోం శాఖ అత్యున్నత అధికారి ఒకరు సోమవారం మీడియాతో చెప్పారు. సోమవారం మధ్యాహ్నం కూడా హోం శాఖ విధివిధానాలపై కసరత్తు చేసింది. ఈ మేరకు శాఖ కార్యదర్శి పిళ్లైతో చిదంబరం అరగంటకు పైగా చర్చలు జరిపారు. అనంతరం సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్ సూచన మేరకు విధివిధానాల ప్రకటనను వాయిదా వేశారు. సాధారణంగా కాంగ్రెస్ కోర్ కమిటీ ప్రతి శుక్రవారమూ సమావేశమౌతుంది. అయితే, విధివిధానాలపై తుది కసరత్తు చేయడానికి ఈ లోపుగానే పార్టీ అధిష్టానం సమావేశమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విధివిధానాలపై ఎప్పుడైనా ప్రకటన వెలువడే అవకాశముందని హోం శాఖ శ్రేణులు పేర్కొంటున్నాయి.