సాకారం కాలేని ముస్లిం రిజర్వేషన్లు

ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లు చెల్లవని రాష్ట్ర హైకోర్టు సోమవారం ఇచ్చిన సంచలనాత్మక తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగలడమే కాకుండా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నుంచి ఎదురు దెబ్బ తగిలింది. ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై అధ్యయనం నిమిత్తం 1995 లో ఏర్పాటైన పుట్టుస్వామి కమిషన్‌ ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని తన మధ్యంతర నివేదికలో పేర్కొంది. తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ కాంగ్రెసు పార్టీ 2004 ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసింది. అధికారంలోకి రాగానే 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రయత్నాలు చేసినా న్యాయస్థానం ఆ రిజర్వేషన్లు తిరస్కరించింది. ప్రభుత్వ చర్య రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీం కోర్టు తీర్పునకు లోబడి లేదని, ముస్లింలకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్ల వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయని న్యాయస్థానం స్పష్టం చేస్తూ ఈ రిజర్వేషన్ల అమలును నిరాకరించింది. బీసీ సంక్షేమశాఖ సలహాదారు పిఎస్‌ కృష్ణన్‌ చేత ప్రభుత్వం హడావిడిగా అధ్యయనం చేయించి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2007లో చట్టం తీసుకురాగా సంఘపరివార్‌ కార్యకర్తలు కోర్టుకెక్కడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. అప్పటికే విద్యార్థుల అడ్మిషన్లు పూర్తి అయ్యాయని సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించగా హైకోర్టు ఇచ్చిన స్టే రద్దయింది. తుది తీర్పు సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని హైకోర్టును కోరింది. ముస్లింలలో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల చట్టం-2007 కింద కల్పించిన రిజర్వేషన్ల రాజ్యాంగ, చట్ట బద్ధతను సవాలు చేస్తూ హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 2007 నుంచి 2008 జనవరి వరకు ఈ కేసును విచారించింది. ఈ కేసులో అనేక కీలకమైన అంశాలు ఉండటంతో దీన్ని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేశారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్