భారం కానున్న త్రిబుల్‌ ఐటీలు

  • ఉన్నత విద్యా కేటాయింపుల్లో సింహ భాగం వీటికే

ఉన్నతవిద్యలో గ్రామీణ విద్యార్థులకు అవకాశం కల్పించడం కోసం ఏర్పాటు చేసిన త్రిబుల్‌ ఐటీలు రాష్ట్రప్రభుత్వానికి భారం అవుతున్నాయి. ఉన్నత విద్యకు కేటాయించిన బడ్జెట్‌లో సగానికిపైగా నిధులను త్రిబుల్‌ఐటీలకే కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2010-11 విద్యాసంవత్సరానికి బడ్జెట్‌లో ప్రభుత్వం ఉన్నతవిద్యకు వెయ్యికోట్లను కేటాయించబోతుంది. అందులో ఒక్క రాజీవ్‌గాంధీ యూనివర్సిటీకే 650 కోట్లు కేటాయిస్తుండగా మిగతా 32 యూనివర్సిటీలకు కలిపి 350 కోట్లను మాత్రమే మంజూరు చేయబోతుంది. రానున్నకాలంలో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీకి రెండువేల కోట్లను కేటాయించాల్సి వస్తుంది. ఒక్క వర్సిటీకే వేలకోట్లను కేటాయిస్తే మిగతా యూనివర్సిటీల పరిస్థితి ఏమిటనే విషయంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వచ్చే విద్యాసంవత్సరానికి రాజీవ్‌గాందీ యూనివర్సిటీకి 850 కోట్లు కేటాయించాలని యూనివర్సిటీ అధికారులు ప్రతిపాదనలు పంపినా 650 కోట్లకే ప్రభుత్వం అంగీకరించింది. నిధులు తగ్గిస్తే అనుకున్న లక్ష్యం నేరవేర్చడం కష్టమవుతుందని అధికారులు చెప్పినా ఇంతకంటే ఏమీ చేయలేమని ఆర్థికశాఖ అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. మూడేళ్ళకే 800 కోట్లు కేటాయిస్తే మరో మూడేళ్ళకు రెండు వేలకోట్లు కేటాయించాల్సి వస్తోందని, మిగతా యూనివర్సిటీలకు ఎక్కడనుంచి నిధులు తేవాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య ఉన్నతాధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీకి నిధులు తేవడంపై ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని సూచించినట్లు సమాచారం. ఇంజనీరింగ్‌ విద్య పూర్తికాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించడం కష్టమవుతుందని, అప్పటివరకు ప్రభుత్వమే నిధులు కేటాయించాల్సి ఉంటుందని అధికారులు చెప్పినట్లు తెలిసింది.

ఉన్నతవిద్యలో గ్రామీణప్రాంత విద్యార్థులకు అవకాశం కల్పించడం కోసం రెండేళ్ళక్రితం రాష్ట్రప్రభుత్వం రాజీవ్‌గాంధీ సాంకేతిక నాలెడ్జి టెక్నాలజీ యూనివర్సిటీ(ఆర్‌జికెయుటి)ని ఏర్పాటు చేసింది. ఈ యూనివర్సిటీ కింద ఆదిలాబాద్‌లోని బాసర, కడపలోని ఇడుపులపాయ, కృష్ణాజిల్లాలోని నూజివీడు ప్రాంతాల్లో త్రిబుల్‌ఐటీలను ప్రారంభించింది. ఒక్కొక్కత్రిబుల్‌ఐటీలో రెండువేల సీట్ల చొప్పున గ్రామీణవిద్యార్థులకు 80శాతం సీట్లను కేటాయించారు. ఇప్పటివరకు మూడు త్రిబుల్‌ఐటీల్లో కలిపి దాదాపు ఆరువేల మంది విద్యార్థులు వున్నారు. వచ్చే విద్యాసంవత్సరం మరోఆరువేల మంది చేరనున్నారు. వసతులు, ఫ్యాకల్టీల నియామకం ప్రభుత్వానికి తీవ్రభారం కానుందని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఫీజు రియంబర్స్‌మెంట్‌ కింద 80 శాతం మంది విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజు భరిస్తుంది. ఆర్థికమాంద్యం నేపథ్యంలో నిధులు కేటాయించడం కష్టమవుతుందని ప్రభుత్వం చెబుతోందని ఉన్నతవిద్యామండలి అధికారులు అంటున్నారు.

ప్యాకల్టీల కొరత

త్రిబుల్‌ఐటీలో ఫ్యాకల్టీల కొరత ఏర్పడింది. ఈఏడాది ఇంటర్‌ పూర్తిచేసుకుని వచ్చే విద్యాసంవత్సరం ఇంజనీరింగ్‌లో విద్యార్థులు చేరబోతున్నారు. రెండేళ్ళ ఇంటర్‌విద్యను బోధించడానికి తాత్కాలిక పద్ధతిలో అధ్యాపకులను నియమించారు. ఇంజనీరింగ్‌విద్యలో అసిస్టెంటు, అసోసియేట్‌, ప్రొఫెసర్లు అవసరం వుంటుంది. మొదటి సెమిస్టర్‌కు 40 మంది ప్యాకల్టీలు కావాలి. ఇలా నాలుగేళ్ళకు కలిపి 120 మంది ప్యాకల్టీలను నియమించుకోవాలి. కానీ పిహెచ్‌డి పూర్తిచేసిన వారు త్రిబుల్‌ఐటీల్లో బోధించడానికి వస్తారా లేదా అన్నదే చెప్పలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. ఒక్కొక్కరికి ఐఐటీ వేతనం ఇస్తామని అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నియామకాలు జరపడానికి త్వరలో నోటిఫికేషన్‌ వేయబోతున్నట్లు చెప్పారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్