కోతలు, వాతలతో చేటు

  • విద్యుత్‌పై కేబినెట్లో మంత్రుల ఆందోళన
  • శ్వేతపత్రం విడుదల చేయాలని సూచన
  • భూముల లీజుపై మంత్రుల గొడవలు
  • ఏప్రిల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు !
  • ఐదుగురు మంత్రుల గైర్హాజర్‌.. ధర్మాన హాజరు

రాష్ట్ర కేబినెట్‌లో విద్యుత్‌ ప్రకంపనలు సృష్టించాయి. విద్యుత్‌ను అదుపులో పెట్టకుంటే అందులో మాడిమసై పోకతప్పదని ముక్తకంఠంతో మంత్రులందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏదో ఒకటి చేసి విద్యుత్‌ మంటలకు తక్షణం నివారణ చర్యలు వెతకాలని ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారు. ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు విద్యుత్‌ కొరత నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషిని, ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు చేసి విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నామో వాస్తవాలతో కూడిన శ్వేతపత్రం(వైట్‌పేపర్‌) విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కోతల నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఇకనుంచి భారాలు వేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మంత్రుల ఆందోళనతో దిగివచ్చిన ముఖ్యమంత్రి అందుకు తగిన సలహాలు, సూచనలు కేబినెట్‌ సబ్‌కమిటీలో చర్చించి, నివేదిక ఇవ్వాలని కోరారు. మూడునెలల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం సాయంత్రం జరిగింది. రెండున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో విద్యుత్‌పైనే మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. మైట్రోరైల్‌కు భూమి సేకరణ, భూముల లీజు, తదితర అంశాలపై మంత్రుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. స్థానిక ఎన్నికల నిర్వహణపై తప్ప మిగతా రాజకీయాల అంశాల జోలికి పోలేదు. అసెంబ్లీ తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని కేబినెట్‌ అభిప్రాయపడింది. అసెంబ్లీ సమావేశాలపై ముక్తసరిగానే చర్చించారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారులు గెెలవడంలో సహకరించిన మంత్రులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. బడ్జెట్‌ సమావేశాలను పురస్కరించుకుని ఈ నెల 13న ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగపాఠానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి ఐదుగురు మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, రఘవీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, కాసు వెంకటకృష్ణారెడ్డి, ఉత్తమకుమార్‌రెడ్డి గైర్హాజర్‌ అయ్యారు. ధర్మాన ప్రసాదరావు కేబినెట్‌ సమావేశానికి హాజరయ్యారు.