డిస్కంల ప్రైవేటీకరణ

  • తుదిగడువు మార్చి 31
  • కేంద్రంతో ఎమ్‌ఓయుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే!
  • 2014 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి
  • ఏడాదిలో రోడ్‌మ్యాప్‌
  • ఉద్యోగుల కుదింపు
  • ఆస్తుల అమ్మకం
  • సబ్‌స్టేషన్లు, కరెంటు పోల్స్‌ సహా అన్నీ అప్పగింత

డిస్కంల పునర్వవ్యవస్థీకరణ పేర రాష్ట్రంలోని విద్యుత్‌ వ్యవస్థను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధమైంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం మార్చి 31ని తుదిగడువుగా నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌శాఖతో ఒప్పందం చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఇంధనశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి చిదంబరం డిస్కంల పునర్వవస్థీకరణను వేగవంతం చేస్తామని, ఈ మేరకు కేంద్ర విద్యుత్‌శాఖతో ఒప్పందాలు చేసుకున్న రాష్ట్రప్రభుత్వాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిధుల్ని విడుదల చేస్తామని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రప్రభుత్వం ఆ ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. సంతకాలు అయిన ఏడాదిలోపు కేంద్రప్రభుత్వ షరతుల మేరకు ప్రైవేటీకరణపై ట్రాన్స్‌కో రోడ్‌మ్యాప్‌ను రూపొందించాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే తొలిదఫా కసరత్తును పూర్తి చేసినట్లు సమాచారం. దీనికోసం కోర్టు కేసుల్ని సత్వరం పరిష్కరించు కోవాలని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని నాలుగు డిస్కంలకు ఆదేశాలు జారీ చేసింది.