నిఘా నీడలో నగరం

  • వదంతులతో ప్రజల్లో ఆందోళన
  • హైదరాబాద్‌లో పోలీసుల భారీ తనిఖీలు
  • వాణిజ్యసముదాయాల మూసివేత
  • హోటళ్లు, మెస్‌లూ బంద్‌
  • అబిడ్స్‌లో బిగ్‌బజార్‌ సీజ్‌

భాగ్యనగరాన్ని ఉగ్రవాదుల భయం వెంటాడుతూనే ఉంది. మళ్లీ హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశాలున్నా యంటూ కేంద్ర ఇంటిలిజెన్స్‌ చేసిన హెచ్చరికలతో పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తమైనారు. భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్దఎత్తున వదంతులు వ్యాపిస్తున్నాయి. క్షణానికో రకంగా వదంతులు ప్రచారం అవుతుండటంతో నగర ప్రజానీకం తీవ్రస్థాయిలో ఆందోళనకు గురవుతున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మీడియా కార్యాలయాలకు ఫోన్లు చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధి కారులు నగరంలో ఎటువంటి సంఘటన చోటుచేసుకోలేదని, ప్రజలు భయాందో ళనలకు గురికావాల్సిన అవసరం లేదని ప్రకటించారు. గురువారం మధ్యాహ్నాం ఈ ప్రకటన చేయడం కోసమే నగరపోలీస్‌ కమిషనర్‌ విలేకరుల సమావేశం నిర్వహిం చారంటే వదంతులు ఏ రీతిలో వ్యాపిస్తు న్నాయో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు భద్రతా ప్రమాణాలు పాటిం చడం లేదంటూ షాపులను మూయిం చారు. అబిడ్స్‌లో బిగ్‌బజార్‌ను సీజ్‌ చేశారు. భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని బిగ్‌బజార్‌ యాజమాన్యానికి అనేకసార్లు సూచించినా పట్టించుకోలేదని, అందువల్లే సీజ్‌ చేశామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నాం నుండి పోలీసులు వ్యవహ రించిన తీరు నగరంలో చర్చనీయాం శమైంది. దాదాపుగా నగరం లోని అన్ని ప్రాంతాల్లో షాపులన్నింటిని పోలీసులు మూయించివేశారు. మెస్‌లను, హోటళ్లను, టీ షాపులను కూడా మూ యించివేశారు. బండ్లపైన అమ్ముకునే చిరు వ్యాపారులను కూడా రోడ్ల మీదకు

అనుమతించలేదు. పంజాగుట్ట, అమీర్‌పేట, సికింద్రాబాద్‌, ఆర్టీసీక్రాస్‌రోడ్డు బేగంబజార్‌, దిల్‌షుక్‌నగర్‌, ఛార్మినార్‌ అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. షాపులన్నింటినీ మూసివేయడంతో పాక్షిక కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. వదంతులు వ్యాపించడానికి పోలీసు అధికారులు తీసుకున్న ఈ చర్య కూడా కారణమైంది. షాపులన్నింటిని, అన్ని ప్రాంతాల్లోనూ ఎందుకు మూయిస్తున్నారన్న ప్రశ్నకు పోలీస్‌ ఉన్నతాధికారులు జవాబియ్యడం లేదు. అయితే, అనధికార సమాచార ప్రకారం రానున్న ఒకటి, రెండు రోజుల్లో ఉగ్రవాదులు విరుచుకుపడే అవకాశముందున్న నిర్థుష్ట హెచ్చరికలు అందడంతో ముందుజాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. మరో ఒకటి, రెండురోజులు ఇదే స్థితి కొనసాగుతుందని సమాచారం. తనిఖీల్లో భాగంగా పోలీసులు ఏ ఒక్కరిని వదలడంలేదు. వాహనాలతో పాటు పాదచారుల బ్యాగేజిని కూడా పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తున్నారు. స్పెషల్‌ పార్టీ పోలీసులు గుంపులు గుంపులుగా బస్తీలను తనిఖీలు చేస్తున్నారు. గల్లీ,గల్లీ తిరిగి రోడ్డుమీద ఉన్న వారిని చెల్లాచెదురు చేస్తున్నారు. దీంతో ఇళ్లనుండి బయటకు రావడానికే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. శివరాత్రి సందర్భంగా నగరంలోని అన్ని ప్రముఖ దేవాలయాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు ఐదు బెటాలియన్ల స్పెషల్‌ పోలీసులు, గ్రేహోండ్స్‌, ఆక్టోపస్‌, టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌ఐటి, సిసిఎస్‌ పోలీసులు పెద్దఎత్తున చేస్తున్న తనిఖీలు వ్యాపారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌, కిరాణా షాపులను బలవంతంగా మూయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఆదివారం, పండగ సమయాల్లో తప్ప రద్దీగా ఉండే అన్ని వ్యాపార కూడళ్లు గురువారం వెలవెలబోయి కనిపించాయి. జంటనగరాల్లో భద్రతా ప్రమాణాలు పాటించని షాపింగ్‌మాల్స్‌, పాపులు, ప్రైయివేటు కార్యాలయాలు, స్వీట్‌షాపులు, హోటళ్లు, బంగారు నగల షాపులపై హైదరాబాద్‌ సిటీ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా జంటనగరాల్లో భయానక వాతావరణం నెలకొని ఉండటంతో వ్యాపారులే కాకుండా ఇతర జిల్లాల నుంచి స్వంత పనుల మీద హైదరాబాద్‌కు వచ్చే వారి రాకపోకలు కూడా తగ్గిపోయాయి. ఆర్టీసి, రైల్వే స్టేషన్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆటో రిక్షాలు, ట్యాక్సీలకు గిరాకీ లేకపోవడంతో ఆటోస్టాండ్‌ వద్ద వాహనాలను నిలిపివేసి ప్యాసింజర్ల కోసం ఎదురు చూస్తున్నారు.

సచివాలయంలో తనిఖీలు

భద్రతా చర్యల్లో భాగంగా అక్టోపస్‌ విభాగం సచివాలయంలో గురువారం తనిఖీలు చేశారు. అనూహ్యంగా జరిగిన ఈ తనిఖీలు కలకలం రేపాయి. కొద్దిసేపు సందర్శకులను నిలిపివేసి మరీ ఈ తనిఖీలు చేశారు. సచివాలయంలో నిర్వహించిన తనిఖీలు కూడా వదంతులకు దారి తీశాయి.