కుల దురహంకార హత్య

  • కూతుర్ని కొట్టిచంపిన తండ్రి
  • ప్రేమ వివాహం చేసుకుంటానన్నందుకు దాడి

ఓ వైపు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో.. మరోవైపు మహిళల స్వేచ్ఛపై నిర్బంధాలు, దాడులు, దారుణాలు కొనసాతూనే ఉన్నాయి. ప్రేమ వివాహానికి నిరాకరించిన తండ్రి కూతురిపైనే దాడి చేసి కడతేర్చాడు. వరంగల్‌ జిల్లా జఫర్‌ఘడ్‌ మండలం తిమ్మంపేటలో గురువారం జరిగిన ఈ దారుణఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు...

తిమ్మంపేటకు చెందిన మేకల బిక్షపతి, కళమ్మ దంపతుల మూడవ కుమార్తె మేకల పద్మ(20) స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. పద్మ తన సహ విద్యార్థి శ్రవణ్‌ను ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అబ్బాయి వేరే కులానికి చెందిన వాడనీ, అతనితో వివాహం చేసే ప్రసక్తే లేదని నిరాకరించి మరోసంబంధం చూశారు. తాను మరెవరినీ పెళ్లి చేసుకోబోనని పద్మ తల్లిదండ్రులతో తెగేసి చెప్పింది. బుధవారం రాత్రి శ్రవణ్‌తో పద్మ ఈ విషయాన్ని ఫోన్‌లో చెబుతుండగా, అది విన్న తండ్రి పట్టరాని కోపంతో పద్మపై దాడి చేశాడు. తీవ్రంగా కొట్టాడు. తలకు తీవ్రగాయం కావడంతో పద్మ మృతిచెందింది. గురువారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వర్ధన్నపేట సిఐ మల్లయ్య, స్థానిక ఎస్‌ఐ ఫణిధర్‌ సంఘటన స్థలానికి వెళ్లి విఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజిఎంకు తరలించారు.