విదేశీ బహుళజాతి సంస్థలు మన దేశంలో సమకూర్చుకున్న ఆస్తులపై పన్నులు ఎగ్గొట్టకుండా చూసేందుకు పన్నుల చట్టాన్ని వెనుక తేదీ నుండి వర్తింపజేయాలన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని, సాధారణ పన్ను ఎగవేత నిరోధక నిబంధనల(గార్)ను మరింత కట్టుదిట్టం చేయాలని సిపిఎం పొలిట్‌బ్యూరో మంగళవారం నాడు డిమాండ్ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చేసిన తొలి ప్రకటనను సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా విమర్శించింది. పన్నుల చట్టాన్ని వెనుక తేదీ నుండి అమలు చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలన్న దాంతోపాటు ఆర్థిక మంత్రి ఆ ప్రకటనలో ప్రతిపాదించిన చర్యలు బహుళ జాతి సంస్థలు మన దేశంలో సమకూర్చు కున్న ఆస్తులపై పన్ను ఎగ్గొట్టేందుకు, అలాగే విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలు పన్నులు కట్టకుండా తప్పించుకునేందుకు వీలు కల్పించేవిగా ఉన్నాయని పేర్కొంది. వెనుకటి తేదీ నుండి అమలు చేయాలన్న పన్నుల చట్టంలోని నిబంధనను తిరగదోడాలన్న తన ఉద్దేశాన్ని ఆర్థికమంత్రి స్పష్టంగా బయటపెట్టారు. వెనకటి నుంచి అమలు చేయాలనే నిబంధన ఆర్థిక బిల్లులో పొందుపరచబడింది, దీనిని పార్లమెంట్ ఇప్పటికే ఆమోదించింది. కాబట్టి పార్లమెంటు ఆమోదం లేకుండా ఈ ఆర్థిక బిల్లులో ఎలాంటి మార్పులు చేయరాదని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
వెనకటి తేదీ నుండి చట్టాన్ని అమలు చేయాలన్న నిర్ణయాన్ని తిరిగి వెనక్కితీసుకోవడమంటే విదేశీ సంస్థ వొడాఫోన్ భారత్‌లో సమకూర్చుకున్న రు.12 వేల కోట్ల ఆస్తులపై పన్ను ఎగవేతకు తోడ్పడడమే అవుతుందని పేర్కొంది. అదే విధంగా పన్నుల ఎగవేతను అరికట్టేందుకు ఉద్దేశించిన గార్ నిబంధనలను పునఃసమీక్షించాలన్న ఆర్థిక మంత్రి నిర్ణయం కంపెనీలు పన్ను ఎగవేయ డానికున్న లొసుగులను తొలగించడానికి గాకుండా మారిషస్ మార్గాన్ని ఎంచుకునే కంపె నీలకు రాచబాట వేసేందుకు ఉద్దేశించిందేనని పొలిట్‌బ్యూరో విమర్శిం చింది. ఆర్థికమంత్రి ప్రకటించిన
చర్యలు నయా ఉదారవాద విధానాలను ముందుకు తీసుకెళ్లడమే కాదు, పార్లమెంటు, సొంత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే తిరగదోడేదిగా వుందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. 'పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించాల'న్న పేరిట పన్ను చట్టాలను సవరించుకుంటూ పోతే జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించటమే కాక ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనాన్ని విదేశీ సంస్థల భారీ లాభాల కోసం వెచ్చించటమే అవుతుందని పొలిట్‌బ్యూరో విమర్శించింది.