బాలురదే హవా

  • రెండు విభాగాల్లోనూ వారే ముందంజ
  • ఎంసెట్‌ ర్యాంకుల విడుదల
  • ఇంజనీరింగ్‌లో 73.18%, మెడిసిన్‌లో 85.57% ఉత్తీర్ణత

ఎంసెట్‌లో అబ్బాయిలు ప్రభంజనం సృష్టించారు. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్‌లో అబ్బాయిల, మెడిసిన్‌లో అమ్మాయిల హవా ఉంటుండగా ఈ సంవత్సరం విడుదల చేసిన ఫలితాల్లో రెండింటిల్లోనూ అబ్బాయిలదే పై చేయిగా నిలిచింది. శుక్రవారం విడుదలైన ఎంసెట్‌ ర్యాంకుల్లో ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ ప్రవేశ పరీక్షల్లో అబ్బాయిలనే టాప్‌ ర్యాంకులు వరించాయి. రెండు విభాగాల్లోనూ కలిపి మొదటి పదేసి ర్యాంకుల్లో 16 ర్యాంకులు అబ్బాయిలే సాధిం చారు. నాలుగు ర్యాంకులు మాత్రమే అమ్మాయిలకు దక్కాయి. అదేవిధంగా రెండు విభాగాల్లోని మొదటి ర్యాంకు రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల విద్యార్థులకు రాగా, మిగతా ర్యాంకుల్లో ఎక్కువభాగం విజయవాడ కుదక్కాయి. విశాఖపట్నం, ప్రకాశం, వరంగల్‌, నిజామాబాద్‌, నెల్లూరు జిల్లాలకు ర్యాంకులు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం ఆరుగంటలకు మాసబ్‌ ట్యాంక్‌లో ఉన్న జెఎన్‌టి ఫైనార్ట్స్‌ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ఎంసెట్‌ ర్యాంకులు, మార్కులను డిప్యూటీ సిఎం, ఉన్నత విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో 73.18 శాతం, అగ్రికల్చర్‌, మెడిసిన్‌లో 85.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్‌లో 156 మార్కులు, మెడిసిన్‌లో 159 మార్కులను లెక్కించారు. ఇంటర్‌లో 25 శాతం, ఎంసెట్‌లో 75 శాతం మార్కులను కలిపి ర్యాంకును తీశారు.

మే 12న ఎంసెట్‌ పరీక్ష జరగగా 3,89,671 మంది దరఖాస్తు చేసుకోగా 3,74,604 మంది హాజరయ్యారు. మార్చిలో విడుదల చేసిన ఇంటర్‌ ఫలితాలతో కలిపి మే 24న ఎంసెట్‌ ర్యాంకులు విడుదల చేయాల్సి ఉన్నా ఇంటర్‌ ఫిజిక్స్‌ పేపర్‌ కారణంగా ర్యాంకుల విడుదల వాయిదా పడింది. ఇంజనీరింగ్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ జులై మూడో వారంలో జరుగుతుందని, రెండో విడత కౌన్సెలింగ్‌ ఆగస్టు మొదటివారంలో జరపడానికి ఏర్పాట్లు చేస్తామని డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ తెలిపారు. మెడిసిన్‌ కౌన్సెలింగ్‌ జులై 20 నుంచి 27 వరకు జరుగుతుందని, ఆగస్టు మొదటివారంలో తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఓఎంఆర్‌ వెరిఫికేషన్‌ జనరల్‌ విద్యార్థులు 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 200 రూపాయలు చెల్లిస్తే అందిస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ ఎంవి రమణారావు తెలిపారు. వెరిఫికేషన్‌, ఫొటోస్టాట్‌ కోసం జనరల్‌ విద్యార్థులు వెయ్యి రూపాయలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 400 రూపాయలు చెల్లించాలన్నారు. ఎపి ఆన్‌లైన్‌, సిటీజన్‌ సర్వీస్‌ సెంటర్‌, ఈసేవా సెంటర్లల్లో జులై రెండో తేదీ నుంచి తొమ్మిదో తేదీలోగా డబ్బులు చెల్లిస్తే వారికి జులై 12లోగా

ఫలితాలందిస్తామని చెప్పారు.

667 ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఎఐసిటిఇ అనుమతి

శుక్రవారం నాటికి 667 ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఎఐసిటిఇ అనుమతిచ్చిందని దామోదర రాజనర్సింహ తెలిపారు. 667 కాలేజీల్లో మూడు లక్షల 21 వేల సీట్లు ఉన్నాయని, ఫార్మసీలో 271 కాలేజీలుండగా 29,840 సీట్లున్నాయని, 37 మెడిసిన్‌ కాలేజీల్లో 4,950 సీట్లున్నాయని చెప్పారు.