సాక్షికి ప్రకటనల నిలిపివేత

  • జీవో జారీ

సాక్షి దినపత్రిక, ఛానల్‌కు ప్రకటనలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ బుధవారం రాత్రి జీవో 2097ను జారీ చేసింది. జగతి పబ్లికేషన్స్‌పై సిబిఐ ఛార్జీషీట్‌ దాఖలు చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 'సాక్షి దినపత్రిక, టెలివిజన్‌ ఛానల్‌ నిర్వహిస్తున్న జగతి పబ్లికేషన్స్‌పై ఆర్‌సి. నెం. 19(ఎ)తో 31.3.2012న సిబిఐ ఛార్జీషీటు దాఖలు చేసినట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది' అని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 'ప్రజా ప్రయోజనాల రీత్యా రాష్ట్ర ప్రభుత్వ శాఖల, ఏజెన్సీల, ప్రభుత్వ రంగానికి చెందిన అన్ని సంస్థల, కార్పొరేషన్ల, ఏజెన్సీల ప్రకటనలు, నోటిఫికేషన్లను ఆ సంస్థకు జారీ చేయడాన్ని నిలిపివేస్తున్నామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకొస్తుంది' అని ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. సాక్షికి విడుదల చేసిన ప్రకటనలపై కొంతకాలంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై దృష్టిసారించిన సిబిఐ అధికారులు, అప్పట్లో ప్రకటనలను విడుదల చేసిన పలువురు అధికారులను తమ కార్యాలయానికి పిలిచి విచారించారు. దాదాపుగా 42 ఫైళ్ళను సిబిఐ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారశాఖ అధికారులు చెబుతున్నారు. ఛార్జిషీట్‌ కూడా దాఖలు కావడంతో ప్రకటనలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.