ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సమాయత్తం

  • సిపిఎం విస్తృత సమావేశం పిలుపు
  • జనం సమస్యలు ఎజెండాలోకి తెచ్చేందుకే స్వతంత్రంగా పోటీ

ప్రజా సమస్యలపై స్వతంత్రంగానూ, ఐక్యంగానూ ఉధృత ఉద్యమాలు నిర్వహించటం తక్షణ కర్తవ్యమని మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సిపిఎం రాష్ట్ర విస్తృత సమావేశం నిర్ణయించింది. పార్టీ శాఖలన్నీ ఉద్యమాలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు సమావేశంలో తీర్మానం ఆమోదించారు. కాంగ్రెస్‌ ముఠా కుమ్ములాటల్లో మునిగిపోయి పరిపాలనను విస్మరించింది, ప్రజా సమస్యల పరిష్కారాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించింది. స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశానికి జి.నాగయ్య, సి.రాములు, డాక్టర్‌ ప్రసూన అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. రాష్ట్రంలో గత సంవత్సరం 878 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడి 85 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని పేర్కొంది. పంటలు నష్టపోయినవారికి రూ.1800 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ''ప్రజాపథం''లో చెల్లిస్తామని

ప్రభుత్వం ప్రకటించి, చివరకు ఉప ఎన్నికల సందర్భంగా వచ్చిన కోడ్‌ కారణంగా పంపిణీ చేయలేక పోతున్నామన్నారని

విమర్శించింది. ''ప్రజాపథం''లో తాగునీటి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పినప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. విద్యుత్‌కోతతో మంచినీటి పంప్‌సెట్లు పనిచేయడం లేదు. తీవ్ర కరువు వల్ల లక్షలాది వ్యవసాయ కార్మికులు పనులు లేక వలసలు పోతున్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం చేసిన కృషి నామమాత్రమని విమర్శించింది.

పెంచిన విద్యుత్‌ ఛార్జీల బిల్లులు వస్తున్నాయి. వినియోగదారుడు భారాలు భరించలేకుండా ఉన్నాడని పేర్కొంది. పంటల ధరలు పూర్తిగా పడిపోయాయి. పత్తి, మిరప, పసుపు ధరలు హీనస్థాయికి పడిపోయాయి. పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.

కోర్టు తీర్పు నేపథ్యంలో ఇసుక తవ్వకాల నిలిపివేతతో భవన నిర్మాణ రంగం పూర్తిగా నిలిచిపోయిందని తెలిపింది. 40 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని పేర్కొంది. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు హెల్త్‌కార్డుల కోసం ఆందోళనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించింది. జెన్‌ఎన్‌ఎన్‌యుఆర్‌ఎం 13వ ఆర్థిక సంఘం గ్రాంట్ల పేరుతో పట్టణాల్లో పన్నులు, ఫీజుల భారాలు పెంచింది. నీటి ఛార్జీలు, చెత్తపన్ను, యూజర్‌ ఛార్జీలు పెంచారని పేర్కొంది. కాంట్రాక్టు కార్మికులకు జీవో నెం.11, ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు జీవో నెం.3ను అమలు చేయడం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదో వేతన సంఘం నియామకం చేయాలనే డిమాండ్‌తో ఆందోళనకు సమాయత్తమవుతున్నారు. మాల్స్‌లో పని గంటల అమలు, భోజన విరామ సమయం మార్పు, జీతాల చెల్లింపు కాల నిర్ణయం లేకపోవడం లాంటి 4 అంశాలపై వ్యాపారులకు అనుకూలమైన నిర్ణయాలను ప్రభుత్వం చేసింది. దీని వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి రక్షణ లేని స్థితికి నెట్టబడ్డారని విమర్శించింది.

దళితులపైన, రజకులపైన వివక్ష, దాడులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. దాడులకు పాల్పడ్డ వారిపై ఎలాంటి చర్యలూ లేవు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, మహిళా కమిషన్‌కు ఛైర్మన్‌ను నియమించలేదు. సబ్‌ప్లాన్‌ నిధులపై ఒకవైపు ఆందోళన సాగుతున్నా, మరోవైపు వేలకోట్లు నిధుల మళ్లింపు జరుగుతూనే ఉందని సమావేశం తెలిపింది. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడంతో ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని, అభివృద్ది పేరుతో ఉపాధి కోల్పోయిన మత్య్సకారులు, నిర్వాసితుల ఆందోళనపై నిర్బంధం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రానికి, సోంపేట, కాకరాపల్లి ధర్మల్‌ కేంద్రాలకు అనుమతులు వచ్చాయన్న ప్రచారంతో నిర్వాసితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపింది. క్షౌర వృత్తిదారులపై పన్నులు పెంచడంతోపాటు, సైన్‌బోర్డులపై పన్నులు వేస్తున్నారు. వృత్తి కళాకారుల పెన్షన్లను నిలుపుదల చేశారు. గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘాలకు నాబార్డ్‌, ఎన్‌సిడిసి సంస్థలు రుణాలు ఇస్తామని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో పథకాలు అమలు కావడంలేదు. ఆర్టీసీ ప్రయివేటీకరణకు రంగం సిద్ధం చేస్తోందని విమర్శించింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. 2006-11లో భూముల పందేరంలో అక్రమ రాయితీలు ఇచ్చినట్లు, జలయజ్ఞంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ''కాగ్‌'' రిపోర్టు బహిర్గత పరిచిందని తెలిపింది. మద్యం సిండికేట్లలో, గనుల మాఫియాల్లో ప్రభుత్వ నేతల అవినీతిని బట్టబయలు చేస్తున్న అధికారులను బదిలీ చేశారని తెలిపింది. ఆరుగురు మంత్రులకు, ఎనిమిది మంది ఐఎఎస్‌ అధికారులకు సుప్రీంకోర్టు సంజాయిషీ నోటీసులు ఇచ్చిందని పేర్కొంది. కాంగ్రెస్‌లో ముఠాల మధ్య కుమ్ములాటలు తీవ్రంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు మధ్య తగాదా తీవ్ర స్థాయికి చేరింది. వీరిని ఢిల్లీకి పిలిపించి అధిష్టానం మందలించినా పరిస్థితి మెరుగుపడలేదు. కొంతమంది మంత్రులు, శాసనసభ్యులు బహిరంగంగానే ముఖ్యమంత్రిని ఆక్షేపిస్తున్నారని సమావేశం పేర్కొంది.

రాష్ట్ర విభజన - సమైక్యత సమస్యను పరిష్కరించకుండా అధిష్టానం నానబెడుతూనే ఉందని సిపిఎం విమర్శించింది. సమస్యను సృష్టించి జఠిలం చేసిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి ఇతరులపై నెపం వేస్తోందని పేర్కొంది. పార్లమెంట్‌లో చిదంబరం వ్యాఖ్యలు దీన్నే స్పష్టం చేస్తున్నాయి. అపరిష్కృతంగా కొనసాగుతున్న ఈ సమస్య రాష్ట్ర రాజకీయాలను ఒక విష వలయంలోకి నెట్టడమే కాకుండా, రాష్ట్రాభివృద్దిని, ప్రజల సంక్షేమాన్ని కుంటుపరుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన వైఖరి తీసుకోకుండా దాటవేయడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. సమస్య పరిష్కారం కోసం తక్షణం కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలతో ముందుకు రావాలని మార్స్కిస్టు పార్టీ కోరినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించింది.

మార్చిలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని, తెలుగుదేశం పార్టీ కూడా ఓటమి చవిచూసిందని తెలిపింది. మార్స్కిస్టు పార్టీ రాజకీయ అననుకూల పరిస్థితుల్లో విస్తృత నిర్మాణం లేకున్నా, ప్రజా సమస్యలను రాజకీయ ఎజెండా మీదకు తెచ్చేందుకు, అవకాశవాద రాజకీయాలను ఎండగట్టి, వామపక్ష ప్రత్యేకతను చాటి చెప్పేందుకు నాలుగు స్థానాల్లో పోటీ చేసిందని గుర్తుచేసింది. పరిమిత స్థాయిలోనైనా ఓట్లు సాధించి స్వతంత్రతను నిలబెట్టుకుందని పేర్కొంది.

ప్రస్తుతం 18 స్థానాలకు జరిగే రెండవదశ ఉప ఎన్నికల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయని పేర్కొంది. కాంగ్రెస్‌, టిడిపి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లు చావు బతుకుల పోరాటంగా ఈ ఎన్నికలను తీసుకున్నాయి. పరకాల నియోజకవర్గంలో ఈ పార్టీలతో పాటు, టిఆర్‌ఎస్‌, బిజెపిలు కూడా రంగంలో ఉన్నాయని గుర్తుచేసింది. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. ప్రధాన పార్టీలన్నీ డబ్బు, సారాలను ప్రవహింపచేస్తున్నాయి. మార్చి నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో మాదిరిగానే మిగతా పార్టీల అవకాశవాద, అవినీతి రాజకీయాలకు భిన్నంగా ప్రజా సమస్యల ఎజెండాను ముందుకు తీసుకొచ్చేందుకు మార్క్సిస్టు పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తోందని వివరించింది. ఉమ్మడిగా పోటీ చేసేందుకు సిపిఐతో చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, సిపిఐ(ఎం) పోటీ చేస్తున్న స్థానాలతో సహా అన్నింటిలో టిడిపికి, పరకాలలో టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడానికి సిపిఐ నిర్ణయించిందని గుర్తు చేసింది.

ప్రజాసేవకు, ప్రజా ఉద్యమాలకు ఓటేయాలని, డబ్బు, మద్యం, ప్రలోభాలను తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. అవినీతిని, అవకాశావాదాన్ని ఛీ కొట్టి, నిజాయితీని బలపరచండి అనే నినాదాలతో నూతన రాజకీయాల కోసం సిపిఐ(ఎం) ప్రచారం చేస్తోందని సమావేశ తీర్మానంలో పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు ఇతర విశేషాలు